Chennai: అన్నాడీఎంకే మహానాడులో అపశ్రుతి
ABN , First Publish Date - 2023-08-22T08:44:58+05:30 IST
మదురైలో ఈనెల 20న ఆదివారం జరిగిన అన్నాడీఎంకే(AIADMK) మహానాడులో అపశ్రుతి జరిగింది. ఈ మహానాడుకు వచ్చిన ఆ పార్టీ
- గుండెపోటుతో ఇద్దరు, ప్రమాదాల్లో ఆరుగురి మృతి
- 50 మందికి గాయాలు
అడయార్(చెన్నై): మదురైలో ఈనెల 20న ఆదివారం జరిగిన అన్నాడీఎంకే(AIADMK) మహానాడులో అపశ్రుతి జరిగింది. ఈ మహానాడుకు వచ్చిన ఆ పార్టీ కార్యకర్తల్లో ఎనిమిదిమంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఇద్దరు గుండెపోటుతో చనిపోగా, మరో ఆరుగురు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. పార్టీ కార్యదర్శిగా ఉన్న విల్లుపురం జిల్లా సెంజి సమీపంలోని నెగనూరుకు చెందిన పొన్నుస్వామి(65) మహానాడుకు ముగిశాక ఆదివారం సాయంత్రం ఇంటికి వెనుదిరిగారు. ఆ సమయంలో ఆయనకు హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, కొన్ని క్షణాల్లోనే ఆయన చనిపోయారు. ఇదేవిధంగా ఈ మహానాడుకు వచ్చిన కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చికి చెందిన పళనిస్వామి అనే కార్యకర్త కూడా గుండెపోటుతో మృతి చెందాడు.
ఇదిలావుండగా కోయంబత్తూరుకు చెందిన కదిరేశన్ అనే కార్యకర్త మహానాడు ముగిశాక ఇంటికి తిరిగి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దిండుగల్ జిల్లా రెడ్డియార్ సత్రం వద్ద కదిరేశన్ ప్రయాణిస్తున్న వ్యాన్‌ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో ఐదుగురు కూడా ఇదే విధంగా వివిధ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల కారణంగా మృతి చెందారు. ఈ ఎనిమిదిమంది మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి ప్రకటించిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి.. మృతుల కుటుంబాలకు తలా రూ.6 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి తలా రూ.1.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి తలా రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేగాక గాయపడినవారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని తమ పార్టీ నేతలను ఆదేశించారు.
