Chennai: కోర్టు ప్రాంగణంలో భార్యపై యాసిడ్‌ దాడి

ABN , First Publish Date - 2023-03-24T13:25:26+05:30 IST

కోర్టు ప్రాంగణంలో భార్యపై యాసిడ్‌ పోసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోయంబత్తూర్‌(Coimbatore) రామనాధపురం కావేరి

Chennai: కోర్టు ప్రాంగణంలో భార్యపై యాసిడ్‌ దాడి

పెరంబూర్‌(చెన్నై): కోర్టు ప్రాంగణంలో భార్యపై యాసిడ్‌ పోసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోయంబత్తూర్‌(Coimbatore) రామనాధపురం కావేరి నగర్‌కు చెందిన శివకుమార్‌, కవిత (33) దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. గత 2016లో కవిత బస్సులో వెళ్తున్న సమయంలో అదే బస్సులోని ప్రయాణికురాలి వద్ద బంగారు గొలుసు చోరీ చేసిందనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి కవితను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. ఈ కేసు విచారణ కోవై జేఎం-1 కోర్టులో జరుగుతోంది. ఈ నేపథ్యంలో, జైలు నుంచి వచ్చిన కవితకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడి అతనితో సహజీవనం చేస్తోంది. దీంతో, శివకుమార్‌ పలుమార్లు భార్య వద్దకు వెళ్లి, ఇంటికి రావాలని, పిల్లలు ఎదురుచూస్తున్నారని కోరినా ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో, గురువారం చోరీ కేసు విచారణ కోసం కవిత కోర్టుకు వచ్చింది. శివకుమార్‌ కూడా అక్కడకు చేరుకొని భార్యను బతిమాలాడు. ఆమె వినిపించుకోకుండా కోర్టులోకి వెళ్లడంతో ఆగ్రహించిన శివకుమార్‌, తన వెంట తీసుకొచ్చిన యాసిడ్‌(Acid)ను ఆమెపై పోశాడు. దీంతో, ఒక్కసారిగా ఆమె చీర నిప్పంటుకోవడంతో కేకలు పెట్టింది. దీనిని గమనించిన ఓ మహిళా న్యాయవాది తన నల్ల కోటును తీసి కవితపై వేసి మంటలు ఆర్పేందుకు యత్నించగా అది కూడా కాలిపోయింది. అంతేగాక ఆ న్యాయవాది చేతులకు కూడా గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు మంటలు అదుపుచేసి ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈలోపు తప్పించుకొనేందుకు యత్నించిన శివకుమార్‌ చుట్టుపక్కల వారు చితగ్గొట్టి రేస్‌ కోర్స్‌ పోలీసులకు అప్పగించగా, ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.

Updated Date - 2023-03-24T13:25:26+05:30 IST