సైబర్ నేరగాళ్ల కొత్త రూటు.. ఓటీపీ కూడా అడక్కుండానే బ్యాంకు ఖాతాలోంచి రూ.50 లక్షలు మాయం..!

ABN , First Publish Date - 2023-01-20T19:58:44+05:30 IST

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సౌకర్యాలతో పాటు మోసాలు (Cyber Crimes) కూడా భారీగా పెరుగుతున్నాయి. సైబర్ నేరాలను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మోసగాళ్లు ఆగడం లేదు. రోజుకో సరికొత్త పద్ధతిని ఉపయోగించి డబ్బులు కొట్టేస్తున్నారు.

సైబర్ నేరగాళ్ల కొత్త రూటు.. ఓటీపీ కూడా అడక్కుండానే బ్యాంకు ఖాతాలోంచి రూ.50 లక్షలు మాయం..!

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సౌకర్యాలతో పాటు మోసాలు (Cyber Crimes) కూడా భారీగా పెరుగుతున్నాయి. సైబర్ నేరాలను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మోసగాళ్లు ఆగడం లేదు. రోజుకో సరికొత్త పద్ధతిని ఉపయోగించి డబ్బులు కొట్టేస్తున్నారు. తాజాగా ఒక్క ఫోన్ కాల్‌తో రూ.50 లక్షల కొట్టేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓటీపీ (OTP) కూడా అడక్కుండానే మోసగాడు ఆ వ్యక్తి ఖాతాలో నుంచి రూ.50 లక్షలు మాయం చేశాడు.

కాన్పూర్‌కు (Uttar Pradesh) చెందిన ఓ వ్యక్తికి హోమ్ మంత్రిత్వ శాఖ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అటు నుంచి ఎలాంటి శబ్దమూ రాలేదు. కొద్ది సేపటి తర్వాత ఆ వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. రూ.50 లక్షలు అకౌంట్ నుంచి విత్ డ్రా అయినట్టు వచ్చిన మెసేజ్‌ను చూసుకుని ఆ వ్యక్తి షాకయ్యాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. స్నేహితులు లేదా రాష్ట్రంలోని ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నుంచి ఫోన్ చేస్తున్నట్టు నమ్మిస్తున్న కొందరు కేటుగాళ్లు అమాయకుల ఖాతాల నుంచి డబ్బులు కొట్టేస్తున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది (Crime News).

సోషల్ మీడియా ద్వారా డబ్బున్న వారిని టార్గెట్ చేసి వారి మొబైల్ నెంబర్లను సేకరించి కొందరు హ్యాకర్లు ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మెసేజ్‌ల ద్వారా మాల్‌వేర్‌ను పంపించి, కాల్స్ చేసి వాటిని హ్యాక్ చేసి ఫోన్లలోని అకౌంట్ల వివరాలు తెలుసుకుని డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా ఓటీపీ కూడా అడక్కుండానే మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2023-01-20T19:58:47+05:30 IST