Union Asset Management: రాబోయే రెండు దశాబ్దాలు భారత్‌వే!
ABN , First Publish Date - 2023-03-03T21:53:47+05:30 IST
రాబోయే రెండు దశాబ్దాలు భారత్‌వేనని ఈక్విటీ సహా యజమానులు సంజయ్
న్యూఢిల్లీ: రాబోయే రెండు దశాబ్దాలు భారత్‌వేనని ఈక్విటీ సహా యజమానులు సంజయ్ బెంబాల్కర్(Sanjay Bembalkar), హార్దిక్ బోరా(Hardick Bora) తేల్చిచెప్పారు. తాజాగా వారు వెల్లడించిన నివేదికలో దేశపు వృద్ధి కథ, ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు సంబంధించి వివరాలను వెల్లడించారు. వచ్చే ఐదేళ్లు మాత్రమే కాదని, రాబోయే రెండు దశాబ్దాలు దేశ వృద్ధికి నిదర్శనంగా నిలుస్తాయని ఆ నివేదికలో పేర్కొన్నారు.
గతంలో అత్యంత అరుదుగా మాత్రమే విజయం భారత్ సొంతమైందని, కానీ భారత్ ఇప్పుడు ఎలా దూసుకుపోతోందన్న వివరాలను అందులో పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) గణాంకాల ప్రకారం రాబోయే ఐదేళ్లలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న 9వ దేశంగా భారత్ నిలుస్తుందన్నారు.
ఈ నివేదిక ప్రకారం.. 2006లో జీడీపీ 814 డాలర్లు ఉంటే, 2021లో అది 2,280 డాలర్లకు చేరుకుంది. అయినప్పటికీ 10 అగ్రదేశాల జీడీపీ 43,037 డాలర్లతో పోలిస్తే ఇండియా ఎంతో దూరంలో ఉంది. సాధారణంగా 55 శాతానికి పైగా జీడీపీ ప్రైవేట్ వినియోగం ద్వారానే వస్తుంది. మనం మరిన్ని కార్లను సొంతం చేసుకోవడం, మరింత విద్యుత్ వినియోగించడం, మరింత ఇంటర్నెట్ వినియోగించడం, మరిన్ని ప్రయాణాలు చేయడం వల్ల ప్రైవేట్ వినియోగం పెరగడంతో పాటుగా ప్రభుత్వ క్యాపెక్స్ కూడా పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధికి ఇదే ఇంధనమని సంజయ్ బెంబాల్కర్ పేర్కొన్నారు.
న్యూట్రిషన్, విద్యుత్, క్రెడిట్‌కార్డులు, బీమా, ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, సాఫ్ట్‌డ్రింక్స్ మొదలైన రంగాలలో భారతీయ వినియోగం 10 అగ్రదేశాలతో పోలిస్తే ఎంతో వెనుకబడి ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ఇండియా,మిగిలిన దేశాల నడుమ అంతరం చాలా త్వరగా కనుమరుగవుతుందని అంచనా వేసింది. భారతదేశపు దీర్ఘకాలిక లక్ష్యాలపై తాము ఆశాజనకంగా ఉన్నట్టు హార్దిక్ బోరా అన్నారు. భారతదేశపు వృద్ధి విషయంలో యూనియన్ ఏఎంసీ ప్రైవేట్ లిమిటెడ్ ఆశాజనకంగా ఉంది. తమ మదుపరులకు తగిన విలువను అందించేందుకు ఇది ప్రయత్నాలను కొనసాగిస్తోంది.