Tata Boeing Aerospace: టాటా బోయింగ్ ఎరోస్పేస్ అరుదైన ఘనత

ABN , First Publish Date - 2023-02-14T19:07:34+05:30 IST

బోయింగ్ 737 విమానం కోసం తొలి వర్టికల్ ఫిన్ స్ట్రక్చర్‌ను

Tata Boeing Aerospace: టాటా బోయింగ్ ఎరోస్పేస్ అరుదైన ఘనత

హైదరాబాద్: బోయింగ్ 737 విమానం కోసం తొలి వర్టికల్ ఫిన్ స్ట్రక్చర్‌ను రవాణా చేసినట్టు హైదరాబాద్‌లోని టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (TBAL) ప్రకటించింది. ఈ వర్టికల్ ఫిన్ స్ట్రక్చర్(Vertical Fin Structure) వాషింగ్టన్‌లోని రెంటన్‌లో ఉన్న బోయింగ్ తయారీ కేంద్రానికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సీల్ గుప్తే మాట్లాడుతూ.. టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్‌పై ప్రశంసలు కురిపించారు.

ప్రపంచం కోసం భారత్‌లోని ఏరోస్పేస్, డిఫెన్స్‌లో సమీకృత వ్యవస్థల సహ అభివృద్ధికి, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రతిబింబించడంపై బోయింగ్ నిబద్ధతకు టాటా బోయింగ్ ఏరోస్పేస్ ఓ ఉదాహరణ అని కొనియాడారు. తొలి వర్టికల్ ఫిన్‌ను తయారుచేసిన వేగం, నాణ్యత టీబీఏఎల్‌లోని నైపుణ్యం కలిగిన సిబ్బంది, ఇంజినీరింగ్ ప్రతిభ, ప్రపంచస్థాయి తయారీ సామర్థ్యాలకు నిదర్శనమని అన్నారు.

బోయింగ్ 737 రకానికి చెందిన విమానాల కోసం సంక్లిష్టమైన వర్టికల్ ఫిన్ నిర్మాణాలను తయారుచేసేందుకు టీబీఏఎల్ 2021లో ఓ కొత్త శ్రేణిని జోడించింది. ఇది నైపుణ్యాభివృద్ధిని పెంచుతూ ఉపాధి అవకాశాలను కూడా సృష్టించింది. బోయింగ్ 737 విమానం కోసం మొదటి వర్టికల్ ఫిన్ స్ట్రక్చర్‌ను విజయవంతంగా రవాణా చేయడం టీబీఏఎల్ బృందాల కృషి, తిరుగులేని సహకారానికి నిదర్శనమని టాటా అడ్వాన్స్‌ డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుకరన్ సింగ్ అన్నారు.

వర్టికల్ ఫిన్ అంటే?

వర్టికల్ ఫిన్ అనేది విమానం తోకపై అమర్చే వర్టికల్ స్థిరీకరణ ఉపరితలం. ఇది విమానానికి స్థిరత్వాన్ని, నియంత్రణను అందిస్తుంది. విమానం సైడ్ స్లిప్‌ను నివారిస్తుంది. కొత్త ఉత్పత్తి శ్రేణి దాని తయారీ ప్రక్రియలలో అత్యాధునిక రోబోటిక్స్, ఆటోమేషన్, పూర్తి స్థాయి డిటర్మినెంట్ అసెంబ్లీ వంటి అధునాతన ఏరోస్పేస్ కాన్సెప్ట్‌లను ఉపయోగించుకుంటుంది.

14 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో..

బోయింగ్, టీఏఎస్‌ఎల్‌కు ఈ జాయింట్ వెంచర్‌ 14 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటైంది. 900 మంది ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇది బోయింగ్ AH-64 అపాచీ హెలికాప్టర్ కోసం ఏరో-స్ట్రక్చర్‌లను ఉత్పత్తి చేస్తోంది. ఇందులో ఫ్యూజ్‌లేజ్‌లు, సెకండరీ స్ట్రక్చర్‌లు, ప్రపంచవ్యాప్త వినియోగదారుల కోసం వర్టికల్ స్పార్ బాక్స్‌ లు ఉన్నాయి. ఈ ఏడాది మొదట్లో భారత సైన్యం ఆరు AH-64 Apache అటాక్ హెలికాప్టర్ల కోసం మొదటి ఫ్యూజ్‌లేజ్‌ను కూడా పంపిణీ చేసింది.

Updated Date - 2023-02-14T19:07:36+05:30 IST