Hindenburg Research: దమ్ముంటే చర్యలు తీసుకోండి.. అదానీని సవాలు చేసిన హిండెన్‌బర్గ్

ABN , First Publish Date - 2023-01-26T21:49:39+05:30 IST

స్టాకులు తారుమారు చేస్తూ అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందంటూ అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలను అమెరికాకు చెందిన

Hindenburg Research: దమ్ముంటే చర్యలు తీసుకోండి.. అదానీని సవాలు చేసిన హిండెన్‌బర్గ్

న్యూఢిల్లీ: స్టాకులు తారుమారు చేస్తూ అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందంటూ అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలను అమెరికాకు చెందిన ప్రముఖ రీసెస్చ్ సంస్థ ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ (Hindenburg Research) సమర్థించుకుంది. హిండెన్‌బర్గ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న అదానీ గ్రూప్ హెచ్చరికలను స్వాగతించింది. తమ నివేదికకు కట్టుబడి ఉన్నామని, చేతనైతే తమపై కోర్టుకెళ్లాలని సవాలు విసిరింది. తమ సంస్థ అమెరికా నుంచి పనిచేస్తోంది కాబట్టి అక్కడ దావా వేసుకోవచ్చని సూచించింది. ఒకవేళ ఈ విషయంలో అదానీ గ్రూప్ కనుక విఫలమైతే తమ వాదనలు సరైనవిగా భావించాలని పేర్కొంది. కథనం ప్రచురించి 36 గంటలు దాటినా ఒక్క అంశాన్ని కూడా అదానీ గ్రూప్ లేవనెత్తలేదని గుర్తు చేసింది.

కాగా, అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గౌతమ్ అదానీ (Adani Group) సారథ్యంలోని అదానీ గ్రూప్‌పై (Adani Group) స్టాకుల తారుమారు (Stock manipulation), అకౌంటింగ్ మోసాలకు (Accounting fraud) పాల్పడుతోందని ఆరోపించింది. ఈ మేరకు తమ పరిశోధనలో బయటపడిందని పేర్కొంది. దాదాపు 218 బిలియన్ డాలర్ల విలువ కలిగిన అదానీ గ్రూపు (Adani Group) దశాబ్దాలుగా ఇదే పద్ధతిలో నడుచుకుంటున్నట్టు ఆరోపించింది.

అదానీ గ్రూపునకు చెందిన 7 కీలకమైన కంపెనీల స్టాకుల విలువ భారీగా పెరగడంతో ఆయన మొత్తం సంపదలో 100 బిలియన్ డాలర్లు గత మూడేళ్లలోనే సమకూరినట్టు పేర్కొంది. ఈ మూడేళ్లకాలంలో సగటున 819 శాతం మేర షేర్ల విలువ పెరిగినట్టు వివరించింది. పన్ను స్వర్గధామ దేశాలైన కరీబియన్, మారిషస్ నుంచి యూఏఈ వరకు పలు దేశాల్లో అదానీ కుటుంబం నియంత్రణలో ఉన్న పలు డమ్మీ కంపెనీలను గుర్తించినట్టు తెలిపింది. అదానీ గ్రూపునకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సహా ఎంతో మందితో దీనిపై మాట్లాడామని, వేలాది డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతే ఈ నివేదిక విడుదల చేసినట్టు పేర్కొంది. ఒకవేళ మా రిపోర్టుపై నమ్మకం లేకపోతే అదానీ గ్రూపు ఫైనాన్సియల్ డేటాను పరిశీలించవచ్చని కూడా పేర్కొంది.

అయితే, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టివేసింది. వీటిని పూర్తిగా నిరాధారామైనవిగా పేర్కొంది. కంపెనీని అపఖ్యాతి పాలుచేసే ఆరోపణలతో రిపోర్ట్ విడుదల చేసిందని మండిపడింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ దేశంలోనే అతిపెద్ద ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫరింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో కంపెనీ ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ రిపోర్టును బయటపెట్టినట్టు ఆరోపించింది. హిండెన్‌బర్గ్‌పై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే హిండెన్‌బర్గ్ తాజాగా స్పందించింది. తమ నివేదికకు కట్టుబడి ఉన్నామని, చేతనైంది చేసుకోవచ్చని సవాలు విసిరింది.

Updated Date - 2023-01-26T21:49:41+05:30 IST