Google: 12 వేల మందిని తీసేసిన గూగుల్.. సుందర్ పిచాయ్‌కు మాత్రం..

ABN , First Publish Date - 2023-04-22T21:13:15+05:30 IST

ఖర్చులు తగ్గించుకునేందుకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ (Google) వేలాదిమంది ఉద్యోగులను

Google: 12 వేల మందిని తీసేసిన గూగుల్.. సుందర్ పిచాయ్‌కు మాత్రం..

న్యూఢిల్లీ: ఖర్చులు తగ్గించుకునేందుకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ (Google) వేలాదిమంది ఉద్యోగులను తొలగించింది. అయితే, అదే సమయంలో సీఈవో సుందర్ పిచాయ్‌ (Sundar Pichai) వేతనం విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్టు ప్రవర్తించింది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ (SEC) కి గూగుల్ తాజాగా సమర్పించిన ఫైలింగ్‌లో ఈ విషయం బయటపడింది. దాని ప్రకారం పిచాయ్ వేతన ప్యాకేజీలో దాదాపు 218 మిలియన్ డాలర్ల స్టాక్ అవార్డులు కూడా ఉన్నాయి. కాగా, రెండు నెలల క్రితమే గూగుల్ దాదాపు 12 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది.

ఎస్‌ఈసీ ఫైలింగ్ ప్రకారం.. సుందర్ పిచాయ్‌కు చెల్లించిన మొత్తం 218 మిలియన్ డాలర్ల విలువైన త్రైవార్షిక అవార్డుగా ఉంది. అంతకుముందు ఏడాది పిచాయ్ వేతనం 6.3 మిలియన్ డాలర్లు. అప్పటికి ఆయనింకా స్టాక్ అవార్డులు అందుకోలేదు. గత మూడేళ్లుగా ఆయన ఆయన వేతనం 2 మిలియన్ డాలర్లుగా ఉంది.

2022లో పిచాయ్ పే ప్యాకేజ్ అల్ఫాబెట్‌లోని ఇతర ఎగ్జిక్యూటివ్‌లతో పోలిస్తే చాలా అధికంగా ఉండేది. ఉదాహరణకు ఆ సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిపిల్ షిండ్లెర్, గూగుల్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రాఘవన్ ఇద్దరూ 37 మిలియన్ డాలర్లు మాత్రమే అందుకున్నారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రుత్ పోరట్ 24.5 మిలియన్ డాలర్లు అందుకున్నారు. వారి స్టాక్ గ్రాంట్స్ ప్రతి ఏటా ఇస్తున్నట్టు ఫైలింగ్ వెల్లడించింది. దీంతో ఇప్పుడు సుందర్ పిచాయ్ అందుకున్న పరిహారం టెక్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్న వేళ పిచాయ్ 226 మిలియన్ డాలర్ల వేతనం అందుకోవడం టాక్ టాఫ్ ద టౌన్ అయింది.

Updated Date - 2023-04-22T22:03:28+05:30 IST