Share News

Aeroplanes: కరోనా తరువాత గణనీయంగా పెరిగిన విమానాల డిమాండ్.. డిసెంబర్‌లో రికార్డు బద్దలు

ABN , Publish Date - Dec 20 , 2023 | 08:55 AM

భారతదేశ విమానయాన పరిశ్రమ డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. డిసెంబర్‌ నెలలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు విమాన ప్రయాణం చేసే అవకాశం ఉంది.

Aeroplanes: కరోనా తరువాత గణనీయంగా పెరిగిన విమానాల డిమాండ్.. డిసెంబర్‌లో రికార్డు బద్దలు

ఢిల్లీ: భారతదేశ విమానయాన పరిశ్రమ డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. డిసెంబర్‌ నెలలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు విమాన ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్‌ డేటా ప్రకారం.. ఈ పెరుగుదల మునుపటి నెలలతో పోల్చితే విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగేలా చేశాయి. సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ (SaaS) కంపెనీ రేట్‌గెయిన్(Rate Gain) తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ ప్రారంభంలో ఇండియాలో అవుట్‌బౌండ్ ఫ్లైట్ బుకింగ్‌లు నవంబర్ రికార్డును బద్దలుకొట్టాయి.

ఈ నెల బుకింగ్లో 15-20 శాతం పెరుగుదల నమోదవుతుందని కంపెనీ అంచనా వేసింది. నవంబర్ తో పోల్చితే బుకింగ్స్ లో 5-10 శాతం పెరుగుదల ఉంటుందని రేట్ గెయిన్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ ఆఫ్ మార్కెటింగ్ అంకిత్ చతుర్వేది తెలిపారు. ఇదే ఏడాది మేలో 4,30,000 మంది ప్రయాణికులు రికార్డు స్థాయిలో ప్రయాణించగా.. డిసెంబర్ లో ఆ సంఖ్య 4,50,000 దాటి రికార్డు నెలకొల్పుతుందని అంచనా. డిమాండ్ పెరుగుదలతో దసరా సీజన్ తో పోల్చితే ఛార్జీలు పెరిగాయి. ఇక్సిగో సీఈవో అలోక్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో విమాన ఛార్జీలు 20-25 శాతం పెరిగాయని తెలిపారు.


ఏవియేషన్ టర్బైల్ ఫ్యూయల్ (ATF) ధరలు తగ్గడం వల్ల గతేడాది ఇదే సీజన్ లో ఛార్జీలు తక్కువగా ఉన్నాయి. విమానయాన సంస్థల ఖర్చులలో 40% జెట్ ఇంధనానిదే ఉంటుంది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్, ఫ్లేర్ ఏవియేషన్ కన్సల్టింగ్ నిర్వహించిన సర్వే ప్రకారం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉన్న దేశాలలో భారత్ లోని అత్యధికంగా ఛార్జీలు పెరిగాయి.

డిసెంబర్ చివర్లో ముఖ్యమైన రూట్లలో ఛార్జీలు 50 శాతం వరకు పెరిగాయని EaseMyTrip సీఈవో నిశాంత్ పిట్టి తెలిపారు. “వాస్తవానికి, కోవిడ్ తర్వాత, భారత్ లో ఛార్జీలు పెరిగాయి. సగటున 30-40 శాతం ధరల్లో పెరుగుదల గమనించాం. ఢిల్లీ-ముంబై, ముంబై-బెంగళూరు, ముంబై-చెన్నై వంటి ప్రధాన దేశీయ మార్గాలలో డిసెంబర్ 24- జనవరి 1 నాటికి విమాన ఛార్జీలు 50 శాతం పెరగబోతున్నాయి" అని తెలిపారు. ఎక్కువ మంది గోవా, ఢిల్లీ, జైపుర్, ముంబై, పుణె, పుదుచ్చేరిల మధ్య రాకపోకలు సాగిస్తుంటారు.

Updated Date - Dec 20 , 2023 | 09:08 AM