YS Avinash Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ

ABN , First Publish Date - 2023-03-09T16:15:46+05:30 IST

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

YS Avinash Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ
YS Avinash Reddy

హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(Vivekananda Reddy Murder case)లో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించారు. సిబిఐ(CBI) ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ హైకోర్టులో ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 160 సీఆర్‌పీసీ కింద నోటీస్‌లు ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేయొద్దని ఆయన కోరారు. విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. అంతేకాదు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని వైఎస్ అవినాశ్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

160 CRPC నోటీస్‌ ఇచ్చారు కాబట్టి సీబీఐ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్‌రెడ్డి పిటిషన్‌లో కోరారు. వివేకా హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటివరకు సీబీఐ అరెస్ట్ చేయలేదని, దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదని అవినాశ్ రెడ్డి గుర్తు చేశారు. దస్తగిరి అక్కడ ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ కొనసాగుతోందని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉందని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకొని అదే కోణంలో విచారణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారని, తాను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారని అవినాశ్ రెడ్డి చెప్పారు.

అంతకు ముందు హైదరాబాదు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి విచారణకు ఈ నెల 10న హాజరుకావాల్సిందిగా సీబీఐ నోటీసులు ఇచ్చిందని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి (MP YS Avinash Reddy) వెల్లడించారు. కడప జిల్లా (Kadapa District)లోని వేంపల్లెలో వైసీపీ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఈ నెల 10న విచారణకు రావాలసిందిగా నాకు సీబీఐ నోటీసు (CBI Notices) ఇచ్చింది. 12న కడపకు విచారణకు రావాల్సిందిగా మా తండ్రికి నోటీసు ఇచ్చింది’ అని తెలిపారు. సీబీఐ విచారణ ఎలా సాగుతోంది అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు తగిన సమయంలో సమాధానం చెబుతానంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాగా.. ఎంపీ అవినాశ్‌రెడ్డిని హైదరాబాదుకు, భాస్కర్‌రెడ్డి (Bhaskar Reddy)ని కడప సెంట్రల్‌ జైలు వద్దకు సోమవారం విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసింది. తండ్రీ కొడుకులను ఒకేరోజు విచారణకు పిలవడం వైసీపీలో సంచలనం రేకెత్తించింది. అయితే తనకు ముందస్తు కార్యక్రమాలు ఉండటం వలన సోమవారం విచారణకు హాజరుకాలేనని ఎంపీ సీబీఐ అధికారులు లేఖ రూపంలో తెలియజేశారు. దీనికి ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకూ సీబీఐ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. చివరకు తండ్రీ కొడుకుల విచారణ తేదీలను సీబీఐ మార్చింది. ఈ మేరకు 10న హైదరాబాదులో విచారణకు కొడుకు వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని, 12న కడపలో తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని రావాలని నోటీసులు ఇచ్చింది.

Updated Date - 2023-03-09T16:38:38+05:30 IST