MLC Elections: అనురాధకు ఓటేసిన ఆ ఇద్దరు ఎవరు..?

ABN , First Publish Date - 2023-03-23T20:39:30+05:30 IST

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) వైసీపీకి స్వంత ఎమ్మెల్యేలే షాకిచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు..

MLC Elections: అనురాధకు ఓటేసిన ఆ ఇద్దరు ఎవరు..?

అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) వైసీపీకి స్వంత ఎమ్మెల్యేలే షాకిచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) మంత్రాంగంతో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అనురాధ (Panchumarthi Anuradha) విజయం సాధించారు. సాంకేతికంగా టీడీపీకి 23 స్థానాలు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ (గన్నవరం), కరణం బలరాం (చీరాల), మద్దాళి గిరి (గుంటూరు పశ్చిమ), వాసుపల్లి గణేశ్‌కుమార్‌ (విశాఖ దక్షిణం) వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో టీడీపీకి 19 సీట్లు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాలి. అంటే ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థిని బలపర్చాలి. 19 ఎమ్మెల్యేలు చేతిలో ఉన్నప్పటికీ 23 ఓట్లతో అనూహ్యంగా అనురాధ విజయం సాధించారు. వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయరెడ్డి (Anam Rannaraya Reddy), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరు కూడా అనురాధకు ఓటు వేశారు. ఆ ఇద్దరు ఎవరు అనేదానిపై వైసీపీలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) కూడా వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ ముగ్గురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ముగ్గురితో పాటు మరొకరు అనురాధను బలపర్చారు. ఆ ఒక్కరు ఎవరనేది తేలాల్సి ఉంది. వాస్తవానికి టీడీపీ (TDP)కి అవకాశం లేకపోయినా చంద్రబాబు అభ్యర్థిని నిలబెట్టడంపై అప్పుడే అందరిలో సందేహాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ అభ్యర్థిని ప్రకటించకముందే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం కూడా ఉంది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడం.. ముమ్మాటికీ వైసీపీ వైఫల్యమేనని అంటున్నారు. ఎందుకంటే ఇంటలిజెన్స్ వ్యవస్థ ఉన్నా సొంతపార్టీ ఎమ్మెల్యేల కదలికల్ని గుర్తించలేకపోయారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో పరాజయం వైసీపీ నాయకత్వానికి మింగుడుపడడం లేదు. ప్రజాభిప్రాయం టీడీపీకి సానుకూలంగా ఉండడం చూసి.. తమపై ఇంత వ్యతిరేకత ఉందనుకోలేదని అంతర్గతంగా ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధ గెలవడం వైసీపీకి పెద్ద షాకేనని అంటున్నారు.

ముందు నుంచి వెంటాడున్న భయం

పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోన ఎక్కడైనా తప్పులు జరుగుతాయేమో.. ఓటింగ్‌కు ఎమ్మెల్యేలు గైర్హాజరవుతారేమో.. క్రాస్‌ ఓటింగ్‌ చేస్తారేమోనన్న భయం ప్రభుత్వ పెద్దలను వెంటాడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడు దఫాలు మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. కొందరు ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు. సోమవారం 15 మంది ఓటింగ్‌కు దూరంగా ఉండడం గమనార్హం. ఇందుకు వివిధ కారణాలు చెప్పినా.. వైసీపీ నాయకత్వంలో అనుమానాలు పెరుగుతున్నాయి. మరోవైపు మాక్‌ పోలింగ్‌లో అధికార పక్ష సభ్యులు పలు తప్పిదాలకు పాల్పడ్డారు. ప్రాధాన్య ఓటు సరిగా వేయలేదని తెలుస్తోంది. మూడు సార్లు చెప్పినా అదే పునరావృతం కావడం వైసీపీ నాయకత్వాన్ని ఆందోళనకు గురయ్యారు. అంతా సవ్యంగానే ఉందని.. తమ విజయానికి ఎలాంటి ఢోకా లేదని వైసీపీలో ధీమాతో ఉన్నప్పటికీ.. లోలోన మాత్రం ఏదైనా జరగరానిది జరిగితే.. దాని ప్రభావం భవిష్యత్‌ ఎన్నికలపై పడుతుందన్న ఆందోళనలో మగ్గిపోయారు. ఎన్ని జాగ్రతలు తీసుకున్నా చివరికి వైసీపీ అధిష్టానాన్ని క్రాస్ ఓటింగ్ కొంప ముంచిందని అంటున్నారు.

చంద్రబాబు నివాసం దగ్గర హోరెత్తిన సంబురాలు

చంద్రబాబు నివాసం దగ్గర సంబురాలు హోరెత్తాయి. టపాసులు పేల్చి టీడీపీ నేతలు స్వీట్లు పంచుకున్నారు. నిన్న పట్టభద్రులు, నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ విజయం.. భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లోనూ తమదే విజయం నేతలు అంటున్నారు. చంద్రబాబు ఇంటి దగ్గరకు భారీగా పార్టీ నేతలు చేరుకుంటున్నారు. కాసేపట్లో చంద్రబాబు నివాసానికి పంచుమర్తి అనురాధ రానున్నారు.

Updated Date - 2023-03-23T20:56:23+05:30 IST