తెలుగు భాష గొప్పదనాన్ని చాటిన గొప్ప కవి వేమన

ABN , First Publish Date - 2023-01-19T23:21:17+05:30 IST

వేమన పద్యాలతో జీవిత సత్యాలను ప్రజలకు తెలియజేశారని, తెలుగుభాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప కవి అని ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ అన్నారు.

తెలుగు భాష గొప్పదనాన్ని చాటిన గొప్ప కవి వేమన
వేమన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ

ఏలూరు రూరల్‌, జనవరి 19: వేమన పద్యాలతో జీవిత సత్యాలను ప్రజలకు తెలియజేశారని, తెలుగుభాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప కవి అని ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ అన్నారు. యోగి వేమన జయంతిని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో గురువారం వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజ పరిస్థితులకు అద్దంపట్టేలా వేమన పద్య రచనలు సాగాయని, ఆయన తెలుగు ప్రజలకు గౌరవప్రదమన్నారు. ఎస్‌పిబి ఎస్‌ఈ ఎన్‌.సూర్యచంద్రరావు, ఏఆర్‌ అదనపు ఎస్పీ ఎస్‌ఎస్‌ శేఖర్‌, ఇన్‌ఛార్జి డీఎస్పీ పైడేశ్వరరావు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

వేమన పద్యాలు ఆధునిక పరిశోధనలకు ఆధారం అయ్యాయని, సామా న్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో తేలికైన పదజాలంతో వేమన పద్యాలు తన భావాన్ని ప్రజలకు చెప్పారని శనివారపుపేట జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఎ.సర్వేశ్వరరావు కొనియాడారు. పాఠశాలలో యోగి వేమన జయంతి ఘనంగా నిర్వహించారు. విద్యార్ధి యోగి వేమన వేషధారణ ఆకట్టుకుంది. వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి తరం పిల్లలకు వేమన పద్యాలను తప్పకుండా నేర్పించాలని, జీవితంలో ఉన్నత స్థానం చేరుకోవడానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

గణపవరం: తెలుగు సాహితి చరిత్రలో గొప్ప కవి యోగి వేమన అని పలువురు వక్తలు అన్నారు. పిప్పర శాఖా గ్రంథాలయంలో యోగి వేమన జయంతి నిర్వహించారు. వేమన పద్యాల ద్వారా మంచి చెడులను వివరిస్తూ సమాజం కోసం కృషి చేసిన ప్రజా కవి అన్నారు. వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాఖ గ్రంథాలయానికి స్వర్గీయ గుడ్ల వీరన్న దంపతుల జ్ఞాపకార్థం ఆయన కుమారుడు గుడ్ల సీతారామ్‌ రూ.10 వేలు విరాళం అందజేశారు. ఐవీ నరసింహరాజు, గుడ్ల వెంకటకృష్ణారావు, తమ్మి సత్యనారాయణ మూర్తి, గ్రంధాలయాధికారి రంగారావు పాల్గొన్నారు.

ఉంగుటూరు: ప్రజా కవి యోగి వేమన జయంతిని కైకరం, ఉప్పా కపాడు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. వేమన నీతి పద్యాలు తదితర అంశాలపై సీనియర్‌ ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. కార్యక్ర మంలో కైకరం హైస్కూలు ఇన్‌చార్జి హెచ్‌ఎం చేబ్రోలు శ్రీనివాస కుమార్‌, ఉపాధ్యాయులు, ఉప్పాకపాడులో హెచ్‌ఎం అల్లు శ్రీనివాస్‌ ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-19T23:21:18+05:30 IST