పాపం.. పోలీసు

ABN , First Publish Date - 2023-06-03T00:36:30+05:30 IST

శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల ప్రధాన విధి. కానీ ఇతర విధుల్లో ఇప్పుడు బిజీ అయి పోతున్నారు. ప్రతిరోజు టార్గెట్‌లు ఇస్తున్నారు.

పాపం.. పోలీసు

రోజువారీ లక్ష్యాలతో తలమునకలు

శాంతి భద్రతలకన్నా ఆదాయమే మిన్న

నెలవారీ టార్గెట్‌లు ఇస్తున్న ప్రభుత్వం

ప్రతీ రోజు ప్రత్యేక డ్రైవ్‌లే

అసలు విధులు మరిచిపోతున్నారు

వ్యక్తిగత జీవితానికీ దూరం

(భీమవరం–ఆంధ్ర జ్యోతి)

కొన్ని నెలల క్రితం భీమవరంలో హెల్మెట్‌ డ్రైవ్‌ జరిగింది. స్థానిక సీఐ ఆధ్వర్యంలో పోలీసులు డ్రైవ్‌ నిర్వహస్తున్నారు. హెల్మెట్‌ ధరించని ఓ మహిళను ఆపారు. దాంతో సదరు మహిళ సీఐని గట్టిగా నిలదీసింది. వాహన దారుల ప్రాణరక్షణ కోసమే తమ ప్రయత్నమంటూ సీఐ వివరణ ఇచ్చినా మహిళ వినలేదు. రహదారులు సక్రమంగా ఉంటే ప్రమాదాలు ఎందుకు జరుగుతాయంటూ ఎదురు ప్రశ్నించింది. ఏం సమాధానం చెప్పాలో తెలియక పోలీసులు బిక్క మోహం వేశారు.

తీరిక సమయం దొరకక ఓ పోలీస్‌ యూనిఫామ్‌తో మార్కెట్‌ చేశారు. అదే తప్పయింది. యూనిఫామ్‌తో ఎందుకు మార్కెట్‌ చేశారంటూ షోకాజ్‌ వెళ్లింది. ఇప్పుడు అందరి పోలీసులదీ అదే పరిస్థితి. యూనిఫామ్‌తో అంటే ఖాకీ దుస్తులతో మార్కెట్‌ చేయకూడదు. అలా చేస్తే ప్రలోభాలకు అవకాశం ఉందన్న ఉద్దేశంతో యూనిఫామ్‌ లేకుండానే మార్కెట్‌ చేయాలంటూ జిల్లాలో పోలీసులకు నోటీసులు జారీచేశారు. ఇటువంటి నోటీసులతో పోలీసులు హతాశులవు తున్నారు.

తాడేపల్లిగూడెంలో ఓ పోలీస్‌ బుధవారం అర్ధరాత్రి వరకు విధులు నిర్వహించి ఇంటికి వెళ్లారు. ఉదయం ఆరు గంటలకే మళ్లీ డ్యూటీలో చేరాల్సి వచ్చింది. ఇక మార్కెట్‌కు వెళ్లేందుకు సమయం ఎప్పుడు ఉంటందంటూ సదరు పోలీస్‌ తనను కలిసిన సామాన్య వ్యక్తి వద్ద వాపోయారు.

లక్ష్యాలకు సలామ్‌

శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల ప్రధాన విధి. కానీ ఇతర విధుల్లో ఇప్పుడు బిజీ అయి పోతున్నారు. ప్రతిరోజు టార్గెట్‌లు ఇస్తున్నారు. జరిమానాల రూపంలో సొమ్ములు వసూలు చేయాలంటూ ప్రభుత్వం పరోక్షంగా అదేశాలు జారీచేస్తోంది. అందులోనే పోలీసులు నిమగ్న మవుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక చోట డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. ఇటీవల జిల్లావ్యాప్తంగా హెల్మెట్‌ డ్రైవ్‌లు నిర్వహించారు. హెల్మెట్‌ ధరించని వారి చేత కొనుగోలు చేయించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లపై అదే సమయంలో ఆరా తీశారు. లైసెన్స్‌ లేనట్టయితే రూ. 500 జరిమానా విధించారు.

లైసెన్స్‌ చేయించే బాధ్యతా పోలీస్‌దే

పోలీస్‌లపై ఇటీవల ప్రభుత్వం కొత్త లక్ష్యాన్ని నిర్దేశించింది. లైసెన్స్‌ లేనట్టయితే వాహన దారులకు జరిమానా విధిస్తారు. అయితే అదే సమయంలో లైసెన్స్‌ పెట్టుకునేలా వాహనదారుడి చత స్లాట్‌ ఓపెన్‌ చేయిస్తారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌కు శ్లాట్‌ తెరిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమ కూరుతుంది. ఇప్పుడు ఆ బాధ్యత కూడా పోలీసులపై పెట్టారు. మరోవైపు ఏదో ఒక రూపంలో జరిమానా విధించాలన్న ఆదేశాలు అందుతున్నాయి. ప్రతిరోజు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ఆ విధుల నిర్వహించ డంలోనే సిబ్బంది తల మునకలవు తున్నారు. ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ప్రతినెల దాదాపు రూ. 14 లక్షలు జరిమానాల రూపంలో ప్రభుత్వానికి చేరాల్సి ఉంటుంది. గతంలో పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరించేవారు.కొందరు చేతివాటాన్ని ప్రదర్శించే వారు. ఇప్పుడా పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. వాహనం నిలిపితే జరిమానా విధించాల్సిందే. కేసు రాయాల్సిందే. ఇదీ పోలీస్‌ తాజా పరిస్థితి. ఒక్కో ఇన్‌స్పెక్టర్‌ 70 కేసులు రాయాలి. ఇలా లక్ష్యాలను నిర్దేశిస్తుండడంతో ట్రాఫిక్‌ పోలీసులు అసలు విధులను విస్మరిస్తున్నారు. డ్రైవ్‌లతోనే తల మునకలవుతున్నారు.

రెండు అద్దాలు ఉండాల్సిందే

హెల్మెట్‌ ధరించినంత మాత్రాన ఇప్పుడు విడచిపెట్టే పరిస్థితి లేదు. ఇటీవల పోలీస్‌ అంతా హెల్మెట్‌పైనే దృష్టి పెట్టారు. దాంతో హెల్మెట్‌ ధరిస్తే చాలన్న పరిస్థితిలో వాహనదారులు న్నారు. కానీ జరిమానా వసూళ్లకు పోలీస్‌ మళ్లీ సమాయత్త మవుతోంది. కేసు నమోదైతే ఈచలానా వచ్చేస్తోంది. దానిని మీ సేవ కేంద్రాల్లో చెల్లించాలి. అయితే చలానాలు చెల్లించకపోతే ప్రత్యేక యాప్‌ ద్వారా గుర్తిస్తున్నారు. మీ–సేవ కేంద్రాల్లో సొమ్ములు చెల్లిస్తేనే వాహనాన్ని విడచి పెడుతున్నారు. ఇప్పుడు మరో నిబంధన తెరపైకి వచ్చింది. ప్రతి వాహనానికి రెండు సైడ్‌ అద్దాలు ఉండాలి. ఒక అద్దం లేకపోయినా సరే జరిమానా విధించేలా ఆదేశాలొచ్చాయి. ఇలా ఏదో ఒక రూపంలో జరిమానాలు విధించాలన్న ధ్యేయంతోనే ప్రభుత్వం ఉంది.

వారాంతపు సెలవు ఏమైంది ?

ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్‌ పోలీసులకు వారాంతపు సెలవులు ఇవ్వ నున్నట్టు గొప్పగా ప్రకటించారు. ఉత్తర్వులు కూడా జారీచేశారు. అమలులోకి వచ్చేసరికి అది కలగానే ఉండిపోయింది. సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఒక్కో పోలీస్‌ ముగ్గురు సిబ్బంది చేయాల్సిన విధులు నిర్వహించే దుస్థితి నెలకొంది. ప్రతిపక్షాలు నిరసనకు పిలుపునిస్తే ముందుగా పోలీసుల్లో దడ మొదలవుతోంది. అఽధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతు న్నారు. గృహ నిర్బంధాలు, అరెస్ట్‌లు సాధారణమై పోయాయి. గతంలో ఇటువంటి వ్యయ ప్రయాసలు ఉండేవి కాదు. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితానికి దూరమవుతున్నారు. ఎన్నడూ లేని విఽధంగా పోలీస్‌ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయిందంటూ మదనపడుతున్నారు. ప్రజల ముందు పలుచనవుతున్నారు.

Updated Date - 2023-06-03T00:38:18+05:30 IST