కలగానే..!

ABN , First Publish Date - 2023-03-19T00:25:27+05:30 IST

తణుకు ఈఎస్‌ఐ ఆస్పత్రి కార్మికులకు కలగానే మిగిలింది. ఎప్పటి నుంచి కార్మికులు డిమాండ్‌ చేస్తున్న సాకారం కావడం లేదు. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన తణుకులో కార్మికులకు అవసరాలకు తగిన విధంగా ఆస్పత్రి నిర్మాణంలో ప్రభుత్వం శ్రద్ధ చూప లేదన్నది కార్మికుల వాదన.

కలగానే..!
తణుకు డిస్పెన్సరీ

తణుకులో నిర్మాణానికి నోచుకోని ఈఎస్‌ఐ ఆస్పత్రి

టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మంజూరు

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఊసేలేదు..

ప్రస్తుత డిస్పెన్సరీలో కనీస సౌకర్యాలు కరువు

సిబ్బంది కొరత.. సక్రమంగా అందని వైద్యసేవలు

ఇబ్బందులు పడుతున్న కార్మికులు

తణుకు, మార్చి 18 : తణుకు ఈఎస్‌ఐ ఆస్పత్రి కార్మికులకు కలగానే మిగిలింది. ఎప్పటి నుంచి కార్మికులు డిమాండ్‌ చేస్తున్న సాకారం కావడం లేదు. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన తణుకులో కార్మికులకు అవసరాలకు తగిన విధంగా ఆస్పత్రి నిర్మాణంలో ప్రభుత్వం శ్రద్ధ చూప లేదన్నది కార్మికుల వాదన. తణుకు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు 12 వేల మంది డిస్పెన్సరీలో నమోదై ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులతో కలిపి 60 వేల మంది వరకు డిస్పెన్సరీలో వైద్య సేవలను పొందుతున్నారు. కార్మికులకు వారి జీతాల నుంచి ప్రతినెలా కొంత మొత్తం సంస్థకు చెల్లిస్తున్నా దానికనుణంగా సదుపాయాలు కల్పించడం లేదు. ప్రధానంగా వైద్య పరీక్షలు చేయకపోవడంతో పాటు పూర్తిస్థాయిలో పురుష, మహిళా వైద్యులు అందుబాటులో లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

డిస్పెన్సరీ స్థాయి నుంచి ఆస్పత్రి స్థాయికి పెంచాలని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హయాంలో వేల్పూరులో పరిధిలో ఎ.1.14 సెంట్లు భూమిని కేటాయించారు. అప్పట్లో అధికారులు పరిశీలించారు. తర్వాత ప్రభుత్వం మారడంతో దాని గురించి పట్టంచుకున్నా దాఖలాలు లేవు. కార్మికుల అవస్థలు పట్టించుకున్న వారు లేరు. ప్రస్తుతం మళ్లీ కొత్తగా అదే ప్రతిపాదిత భూమిలో పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేయడానికి ప్రతిపాదనలు పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. అదే జరిగితే ఆస్పత్రితో పాటు వైద్యులు, సిబ్బంది క్వార్టర్స్‌తో సహా నిర్మించనున్నారు. దీనికి సంబంధించి నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్మాణ సంస్థ అయినా కార్పొరేషన్‌కు విడుదల చేస్తారని చెబుతున్నారు.

సిబ్బంది కొరత

డిస్పెన్సరీలో సగం పైగా సిబ్బంది కొరత ఉంది. 15 మందికి సంబంధించి వివిధ పోస్టులకు గాను 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఇద్దరు వైద్యులు ఉన్నారు. డిప్యూటీ సివిల్‌ సర్జన్‌, క్రిటికల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న వైద్యులు రాజమండ్రి ఈఎస్‌ఐ ఆస్పత్రి నుంచి డిప్యూటేషన్‌ పై వచ్చి పనిచేస్తున్నారు. ఇద్దరు ఫార్మాసిస్టులకు ఒకరు మాత్రమే ఉన్నారు. ఎంఎన్‌వో, వాచ్‌మేన్‌, తోటి, అటెండర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ప్రాథమిక పరీక్షలూ కరువే

డిస్పెన్సరీలో ప్రాథమిక పరీక్షలు కూడా చేయడం లేదు. రక్త పరీక్షలు చేయడానికి అవసరమైన కిట్స్‌ అందుబాటులో లేవు. ఇన్సులిన్‌ సూదులు, టీటీ ఇంజక్షన్‌లు, ఈసీబీ, ఎక్స్‌రే, షుగర్‌ పరీక్షల ఊసేలేదు. ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకుంటే ఈఎస్‌ఐ వైద్యులు కుదరదని ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని చెప్పడంతో సమయం, డబ్బులు వృథా అవుతున్నారు. మందులు కూడా ప్రతి మూడు నెలలకు కంపెనీలు మార్చి ఇవ్వడం వల్ల తమ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కార్మికులు వాపోతున్నారు. కొన్ని నెలలుగా మందులు సరపరా తగ్గినట్టు చెబుతున్నారు. నొప్పులకు అవసరమైన స్ర్పేలు, కేన్సర్‌, బీపీ, షుగర్‌ వంటి వాటికి కూడా సక్రమంగా మందులు ఉండడం లేదని కార్మికులు వాపోతున్నారు.

కార్మికులు డిమాండ్లు ఇవే.. ప్రధానంగా మహిళా వైద్యులు, సిబ్బందిని నియమించాలి. కేన్సర్‌, కిడ్నీ, షుగర్‌ వంటి రకాల ప్రాణాంతక వ్యాధుల మందులు అందుబాటులో ఉండాలి. షుగర్‌తో పాటు అన్ని రకాల పరీక్షలు చేయాలి.ఈసీజీ, ఎక్స్‌రేలు తీయాలి.

కనీస వైద్య సేవలు అందడం లేదు

ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో కార్మికులకు కనీస వైద్య సేవలు అందడం లేదు. గతంలో మంజూరైన ఆస్పత్రిని తక్షణం నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలి. మందులు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి.

– పీవీ ప్రతాప్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి

Updated Date - 2023-03-19T00:25:27+05:30 IST