అకాల న(క)ష్టం
ABN , First Publish Date - 2023-03-19T00:28:27+05:30 IST
అల్పపీడన ద్రోణి ప్రభావంగా జిల్లావ్యాప్తంగా శనివారం వర్షాలు కురిశాయి. ఆదివారం కూడా పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. జిల్లా కేంద్రం భీమవరంలో ఉదయం కొన్ని చోట్ల భారీ వాన కురిసింది.

నీట మునిగిన పల్లపు ప్రాంతాలు
వరి రైతుల్లో ఆందోళన
నేలరాలిన మామిడిపిందెలు
ఉప్పురాశులు నీటిపాలు
భీమవరం/ ఆచంట/ ఆకివీడు/ మొగల్తూరు/ పాలకొల్లు అర్బన్/నరసాపురం/ వీరవాసరం, మార్చి 18 : అల్పపీడన ద్రోణి ప్రభావంగా జిల్లావ్యాప్తంగా శనివార వర్షాలు కురిశాయి. ఆదివారం కూడా పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. జిల్లా కేంద్రం భీమవరంలో ఉదయం కొన్ని చోట్ల భారీ వాన కురిసింది. ఆచంటలో భారీ వర్షం కురిసింది. పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఆకివీడు నడిబొడ్డున్న ఉన్న అందే గంగానమ్మ, మూలలంక బోదెలు పూడుకుపోవడంతో వర్షాలకు పొంగి పొర్లడంతో పాటు వాడకపు నీరు రోడ్లపైకి రావడంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీర ప్రాంతాలైన నరసాపురం, మొగల్తూరులో భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులతో పాటు పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మామిడి పిందెలు రాలిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పాలకొల్లులో పల్లపు ప్రాంతాలు చిత్తడిగా మారాయి. శని వారం పట్టణంలో వారపు సంతకు వర్షంతో వ్యాపారాలు పెద్దగా జరగలేదు. వీరవాసరం ఓ మోస్తరు వాన కురిసింది. వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఈ రెండు రోజుల్లో 8 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గుమఖం పట్టింది. ఈ వాతావరణం వల్ల రబీ పంటపై దోమపోటు పెరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నిండా మునిగిన ఉప్పు రైతులు
తీర ప్రాంతం ఉప్పు రైతులను వర్షాలు కోలుకోని దెబ్బతీశాయి. మడులన్నీ నీట మునిగాయి. ఉప్పురాశులు నీటపాలయ్యాయి. తిరిగి సాగుకు మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు అప్పులు చేయక తప్పదని అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఉప్పుకు మంచి డిమాండ్ ఏర్పడింది. సాగు తగ్గడంతో గతేడాది పండిన పంటకు మంచి రేటు లభించింది. దీంతో చాలామంది రైతులు మళ్లీ సాగు వైపు మొగ్గుచూశారు. చినలంక, వేములదీవి, పీఎంలంక గ్రామాల్లో పంట వేశారు. ఈనెల మొదటి వారం వరకు ఎండలు బాగా ఉండడంతో దిగుబడి అధికంగా ఉంటుందని రైతులు అశించారు. అయితే అకాల వర్షాలు వీరి ఆశలపై నీళ్లు చల్లాయి. మళ్లీ సాగు చేయాలంటే ఎకరాకు రూ.10వేలు పెట్టుబడి తప్పదు.