కలగానే..!
ABN , First Publish Date - 2023-01-18T00:12:38+05:30 IST
నరసాపురంలో డ్రెయినేజీ ప్రధాన సమస్యగా మారింది. చిన్నపాటి వర్షం పడితే రోడ్లన్నీ చెరువుల ను తలపిస్తాయి. మేజర్ డ్రెయిన్లకు సరైన అవుట్‌లేట్లు లేవు. దీనివల్ల మురుగునీరు గోదావరి, పంట కాల్వల్లో కలుస్తోంది.
రూ.237 కోట్లతో ప్రతిపాదనలు
గతేడాది సీఎం జగన్ శంకుస్థాపన
ఇంకా టెండర్ దశకు వెళ్లని ప్రతిపాదనలు
నరసాపురం, జనవరి 17: నరసాపురంలో డ్రెయినేజీ ప్రధాన సమస్యగా మారింది. చిన్నపాటి వర్షం పడితే రోడ్లన్నీ చెరువుల ను తలపిస్తాయి. మేజర్ డ్రెయిన్లకు సరైన అవుట్‌లేట్లు లేవు. దీనివల్ల మురుగునీరు గోదావరి, పంట కాల్వల్లో కలుస్తోంది. కొన్నిచోట్ల డ్రెయినేజీలు పొంగినీరు రోడ్లపైకి చేరుతోంది. దీనివల్ల పారిశుధ్య సమస్యతో పాటు దోమలు విజృంభిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించాలని తలపెట్టి రూ.237 కోట్లతో పనులు ప్రతి పాదించగా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గతేడాది తొలి విడ తగా రూ.87 కోట్లు మంజూరు చేయగా సీఎం జగన్ నవం బరు లో శంకుస్థాపన చేశారు. ఇంతవరకు ఈ పనులు టెండర్ దశను దాటలేదు. పట్టణంలో 31 వార్డుల్లో 109 కిలోమీటర్ల మేర డ్రెయినేజీ వ్యవస్థ ఉంది. 18 కిలోమీటర్లు మేజర్, 89 కిలోమీట ర్లు మీడియం, మైనర్, రెండు కిలోమీటర్ల మేర కచ్చా డ్రెయి నేజీలు ఉన్నాయి. ప్రధానంగా మేజర్ డ్రెయినేజీల అవుట్‌లేట్ పొన్నపల్లి వద్ద గోదావరిలో ఉంది. ఇటు ఎన్టీఆర్ కాలనీ, ప్రభు త్వాస్పత్రి వద్ద ఉన్న డ్రెయిన్లు మేజర్ డ్రెయిన్లతో లింకు కాకపోవడంతో ప్రభుత్వాస్పత్రి సమీపంలోని వేములదీవి పంట కాల్వలో కలుస్తున్నాయి. హౌసింగ్ బోర్డు, రుస్తుంబాద నుంచి వచ్చే డ్రెయినేజీలు సరిపల్లి డ్రెయినేజీలో కలుస్తున్నాయి. మెయిన్‌రోడ్‌లో వచ్చే డ్రెయినేజీకి అవుట్‌లేట్ లేక వర్షం వస్తే రోడ్లన్నీ నీట మునిగితున్నాయి. పంజా సెంటర్, మిష న్‌హైస్కూల్, పీచుపాలెం, నందమూరికాలనీకి సంబంధించిన డ్రెయినేజీలు స్మతివనం వద్దనున్న గోదావరిలో కలుస్తున్నాయి. వీటికి సరైన అవుట్‌లేట్లు లేక వర్షం వస్తే పొంగిపొర్లుతున్నాయి. ఇటు పంట కాల్వలో కలిసే డ్రెయినేజీలను మూసివేయాలంటూ పలుసార్లు ఉద్యమాలు జరిగాయి. తీర ప్రాంతంలోని మంచినీటి చెరువులకు పంట కాల్వల నీటినే తోడుకోవడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయితే కాల్వల్లో కలిసే డ్రెయినేజీలను మూసివేసే మార్గం లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. గతేడాది నవంబరులో సీఎం జగన్ ఈ అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి శంకుస్థాపన చేశారు. నేటికీ ఈ పనులకు ప్రతిపాదనలు సిద్ధం కాలేదు. తొలి విడత పనులు ఎక్కడ చేపట్టాలన్న దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. 31 వార్డుల్లో పనులు ఏ దశలో ఎప్పుడు చేపట్టాలన్న దానిపై అధికారుల వద్ద స్పష్టత లేదు. మునిసిపాలిటీకి అనుబంధంగా ఉన్న పబ్లిక్ హెల్త్ విభాగానికి ఈ పనులు అప్పగించారు. ఇంకా వారు అంచనాల్లోనే ఉన్నారు. ఇవి పూర్తయితే గాని టెండర్లు పిలిచే అవకాశం లేదు. తొలుత మంజూరైన రూ.87 కోట్ల పనులకు మాత్రమే టెండర్లు పిలుస్తారా... లేక ఎన్ని పనులకు పిలుస్తారన్నది స్పష్టత లేదు.