జీపీఎస్ వద్దే వద్దు..
ABN , First Publish Date - 2023-09-26T00:25:56+05:30 IST
జీపీఎస్ వద్దేవద్దంటూ సోమ వారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయులు నినదించారు.

ఏలూరు కలెక్టరేట్/భీమవరం, సెప్టెంబరు 25: జీపీఎస్ వద్దేవద్దంటూ సోమ వారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయులు నినదించారు. రాష్ట్ర మంత్రి వర్గం గ్యారంటీ పెన్షన్ స్కీమ్(జీపీఎస్)ను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవ డాన్ని వ్యతిరేకిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు, భీమవరం కలెక్టరేట్‌ల వద్ద పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. మోకాళ్లపై నిలబడి తమ నిరసన తెలి యజేశారు. ఏలూరులో పలువురు నాయకులు మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేయాలని కోరితే జీిపీఎస్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఓల్డ్ పెన్షన్ స్కీంకు జీపీఎస్ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. ప్రభుత్వం ఓపీఎస్ అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు సీపీఎస్‌ను వారం రోజుల్లో రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగున్న రేళ్లు దాటుతున్నా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ పేరుతో ఉపాధ్యాయులను, ఉద్యోగులను మోసపుచ్చడంపై మండిపడ్డారు. ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ పిజివిఎల్‌ఎన్ నారాయణ, సెక్రటరీ జనరల్ జి.వెంకటేశ్వరరావు, కో ఛైర్మన్లు ఎం.ఆదినారాయణ, ఎస్‌కె జిలాని, ఆర్. రవికుమార్, ఎస్‌కె. రంగావలి, గుగ్గులోతు కృష్ణ, రాంబాబు, ఎపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్షుడు టి. రామారావు, సాయిరాజు, ఏపీసీఎస్‌ఈఏ నాయకులు రెడ్డి రామారావు, ఆర్.నాగదుర్గారావు, ఎస్సీఎస్టీ ఉద్యోగుల సంఘం జేఏసీ ఛైర్మన్ ఎ.సర్వేశ్వరరావు, బీఏ సాల్మన్‌రాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ జవహర్‌రాజు మాట్లాడుతూ, జీపీఎస్‌పై మంత్రివర్గం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయరామరాజు మాట్లాడుతూ జీపీఎస్ డ్రాప్‌ను విడుదల చేయకుండా బిల్లును క్యాబినేట్లో ఆమోదించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఏపీటీఎఫ్ అధ్యక్షుడడు ప్రకాశం మాట్లాడుతూ జీపీఎస్‌ను ఆమోదించి ఉద్యోగుల జీవితాల్లో చీకట్లు నింపిందని అన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా కన్వీనర్ రమణ మాట్లాడుతూ, సిక్కిం, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఓపీఎస్ వైపు అడుగులు వేస్తుంటే, వైసీపీ ప్రభుత్వం ఓపీఎస్ ముగిసిన అధ్యాయమని చెప్పడాన్ని ఖండించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ జీపీఎస్ పై ప్రభుత్వ నిర్ణయం ఇలాగే కొనసాగితే తగుమూల్యం చెల్లించకతప్పదని హెచ్చ రించారు. రామభద్రం, వెంకటేశ్వరరావు. మధు, వెంకటేశ్వరరావు, రాంబాబు పాల్గొ న్నారు. అనంతరం కలెక్టర్ ప్రశాంతికి వినతిపత్రం అందజేశారు.