ఓటే ఆయుధం

ABN , First Publish Date - 2023-01-25T00:13:49+05:30 IST

ఓటు వజ్రాయుధం లాంటిది. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటుహక్కు పొందాలి. మంచి ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు ఓటును ఆయుధంగా వాడుకోవాలి. ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు ఏటా జనవరి 25న ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు..

ఓటే ఆయుధం

ప్రజాస్వామ్యానికి పునాది

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

ఓటు ప్రజాస్వామ్యానికి పునాది. ఐదేళ్లకు ఒకసారి వచ్చినా మన తలరాతలు జీవితాలను మార్చేవి ఎన్నికలే.. మనం వేసే ఓటు మన భవిష్యత్తు, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తాయి.. అందుకే ఓటు వజ్రాయుధం లాంటిది. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటుహక్కు పొందాలి. మంచి ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు ఓటును ఆయుధంగా వాడుకోవాలి. ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు ఏటా జనవరి 25న ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు..

ద్వారకా తిరుమల, జనవరి 23 : ప్రజాస్వామిక భారతదేశంలో ప్రతి పౌరుడికి కుల, మత, లింగ, వర్గ, ప్రాంతీయ భేదం లేకుండా ఓటు వినియోగించుకునే హక్కు ఉంది. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం పైనే దేశ, రాష్ట్ర భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఓటుహక్కు విలువ తెలిసేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఓటుహక్కు పొందేలా యువతరాన్ని ప్రోత్సహించేందుకు మన దేశంలో ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటాము. 2011 నుంచే ఈ వేడుకలను అధికారికంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. యువత రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యేలా చూడాలన్నదే జాతీయ ఓటర్ల దినోత్సవ లక్ష్యం. ఇందుకు ప్రతీ ఏటా జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి వారి పేరుతో ఓటు నమోదు చేయాలి. జనవరి 25న కొత్త ఓటర్లకు ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డును అందజేస్తారు.

ప్రాధాన్యత ఇదీ

18 ఏళ్లు నిండినా ఓటుహక్కు పొండేందుకు ఆసక్తి కనపరచక పోవడంతో వారిలో చైతన్యం నింపే దిశగా అడుగులు వేయడం, అర్హత మేరకు ఓటర్ల జాబితాను రూపొందించడమే దీని ప్రదాన ఉద్దేశ్యం. ఒకప్పుడు ఓటరు అర్హత 21 సంవత్సరాలు కాగా 1988లో దీనిని 18 ఏళ్లకు మార్పు చేశారు. 18 ఏళ్లు నిండగానే ఎవరైనా భాతర పౌరుడిగా తనను తాను ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. యువ ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఎన్నికల కమిషన్‌ విసృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నది. ఏ ఒక్క ఓటరును విడిచి పెట్టకూడదన్న నినాదంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. అవగాహన పెంచేందుకు ఈ రోజున పాఠశాలలు, కళాశాలల్లో క్విజ్‌లు, చర్చలు, మాక్‌ పోల్స్‌ వంటి కార్యాక్రమాలు నిర్వహిస్తారు.

ఈ ఏడాది ప్రత్యేక ఽథీమ్‌

జాతీయ ఓటర్ల దినోత్సవం సంద ర్భంగా ప్రతీ ఏటా జనవరి 25న ప్రత్యేక థీమ్‌తో ఎన్నికల సంఘం కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. 2020లో బలమైన ప్రజాస్వామ్యానికి ఎన్నికలపై అవగాహన పెంచడం అనే థీమ్‌ తీసుకున్నారు. 2021లో ఓటర్లకు సాధికారత, జాగరూకత, భద్రత, కల్పిస్తూ సమాచారాన్ని అందించడం మరి ఈ ఏడాది ఎన్నికలను సమ్మిళితం చేయడం, పాల్గొనడం, వయసు, లింగ నేపథ్యం లేకుండా ఎన్నికల్లో ఓటర్లు చురుకుగా పాల్గొనేలా చేయడంపై దృష్టి సారించడం.

Updated Date - 2023-01-25T00:14:04+05:30 IST