Share News

వాయిదాల పర్వంలో విద్యాదీవెన

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:15 AM

విద్యా దీవెన కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జమ చేస్తామంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.

వాయిదాల పర్వంలో విద్యాదీవెన

ఎదురుచూస్తున్న విద్యార్థులు

ఒత్తిడి పెంచుతున్న కళాశాలలు

భీమవరంలో బటన్‌ నొక్కేందుకు

ముఖ్యమంత్రి కసరత్తు

వాయిదాలు పడుతున్న పర్యటన

కారణాలేమిటో..

సొమ్ములు లేక ఇబ్బందులా ?

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

విద్యా దీవెన కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జమ చేస్తామంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. గడువు ప్రకారం గత నెల లోనే విద్యార్థుల ఖాతాలో జమచేయాలి. భీమవరంలో సభ నిర్వహించి ముఖ్యమంత్రి బటన్‌ నొక్కుతారని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబరు 28న సీఎం భీమవరం పర్యటన ఉంటుందని తాజాగా షెడ్యూల్‌ ప్రకటించారు. ఆ సభలోనే విద్యాదీవెన విడుదల చేస్తారని అంతా ఆశిస్తు న్నారు. యాజమాన్యాలు కూడా ఫీజులు కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వం సక్రమంగా సొమ్ములు చెల్లించకపోవడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారింది. బ్యాంకుల నుంచి అప్పులు చేసి యాజమాన్యాలు కళాశాలలు నిర్వహిస్తున్నాయి. సకాంలో వాయిదాలు చెల్లించలేకపోతున్నాయి. ప్రభుత్వం ఏడాది క్రితం ఫీజును ఇప్పుడు విడుదల చేస్తోంది. అదికూడా నవంబరు నెలలో చెల్లించాల్సి ఉంది. భీమ వరం పర్యటన అప్పుడే ఖరారైంది. అదికాస్త వాయిదా వేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం వద్ద సొమ్ములు అందుబాటులో లేకపోవడం వల్లే వాయిదా పడుతోందన్న అను మానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యాదీవెన జమ చేయాలంటే వందల కోట్లు చెల్లించాలి. ముఖ్యమంత్రి బటన్‌ నొక్కుతున్నా సరే విద్యార్థుల ఖాతాలో ఫీజులు జమ కావడం లేదు. కేటగిరీల వారీగా సొమ్ములు విడుదల చేస్తూ వస్తు న్నారు. బటన్‌ నొక్కిన తర్వాత వారాల తరబడి విద్యార్థులు ఎదురుచూడక తప్పడం లేదు. ఇదే పరిస్థితి ఉంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో పర్యాయం ప్రభుత్వం సొమ్ములు చెల్లించాలి. అందుకోసం ఇంకెంత కాలం వేచి చూడాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వం ఏడాది క్రితం చెల్లించాల్సిన ఫీజులను ప్రస్తుతం విడుదల చేయనుంది. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఇదే దడ పుట్టిస్తోంది. చదువు పూర్తయ్యాక పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లిస్తేనే కళాశాలలు సర్టిఫికెట్‌లు జారీ చేస్తున్నాయి. ముందుగా విద్యార్థులు సొంత సొమ్ములు చెల్లిస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఫీజులు జమ చేస్తోంది. దీనివల్ల తల్లిదండ్రులు నలిగి పోతున్నారు.

బకాయిలు ఇస్తారా....

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పిల్లిమొగ్గలు వేస్తోంది. పీజీ కోర్సులకు విద్యా దీవెనను ఎగనామం పెట్టింది. గత బకాయిలు విడుదల చేయడం లేదు. పీజీ కోర్సులకు విద్యాదీవెన లేకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవు తున్నారు. ఉన్నత విద్యలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది. ఇతర దేశాల మాదిరిగా ఒక ఏడాది ఎంఎస్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అటువంటిది ప్రభుత్వం పిజి కోర్సులకే విద్యాదీవెన అమలు చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఉన్నత విద్యను చదువుకోవడానికి అవకాశం ఇవ్వని ప్రభుత్వం విదే శీ విద్యా దీవెన కోసం రూ. 10 లక్షలు ఇస్తామంటూ గొప్పలు చెపుతోంది. ప్రభుత్వంపై నమ్మశక్యం లేకపోవడంతో విదేశాలకు ఎవ్వరూ వెళ్లడం లేదు. జిల్లానుంచి పట్టుమని పది మంది విద్యార్థులు కూడా విదేశీ విద్యకు ధరఖాస్తు చేసుకోలేదు. ఇక్కడే పీజీ కోర్సులు చదువుకుందా మంటే ప్రభుత్వం విద్యాదీవెన ఇవ్వడం లేదు. గతంలో ఉన్న బకాయిలను చెల్లించకుండా కళాశాలలను అప్పుల ఊబిలోకి నెట్టింది. జిల్లాలో దాదాపు రూ. 30 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. అందులో 75 శాతం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కళా శాలలను ఒప్పించింది. కానీ సొమ్ములు చెల్లించడం లేదు. ఇలా బకాయిల విషయంలో యాజమాన్యాలను మభ్యపెట్టింది.

నిబంధనాలు

ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పై జాప్యం చేస్తున్న ప్రభుత్వం అమలులోనూ నిబంధనలు కఠినతరం చేస్తోంది. ఇప్పటివరకు తల్లుల ఖాతాలో జమ చేస్తోంది. ఇకపై విద్యార్థులతోపాటు, తల్లుల ఉమ్మడి ఖాతా తెరవాలంటూ హడావిడి చేసింది. దానికోసం విద్యార్థులు బ్యాంకుటు చుట్టూ తిరిగారు. జిల్లాలో దాదాపు 75వేల మంది విద్యార్థులకు పీజు రీఎంబర్స్‌మెంట్‌ అమలవుతోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 25 కోట్లు తల్లుల ఖాతాలో జమ చేస్తోంది. ఆ మొత్తాన్ని వారం రోజుల వ్యవధిలోనే కళాశాలలకు చెల్లించాలంటూ షరతు విధిస్తోంది. దీనివల్ల బ్యాంకుల్లో సొమ్ములు తీసుకుని కళాశాలలకు చెల్లించడం యాతనగా మారుతోంది. అటు వంటిది ఇప్పుడు ఉమ్మడి ఖాతా అంటూ ప్రభుత్వం హడావిడి చేసింది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాంతో ఫిబ్రవరికి ఉమ్మడి ఖాతా విధానాన్ని వాయిదా వేసింది. వాస్తవానికి కళాశాలల ఖాతాలోనే జమ చేస్తే తమకు ఇబ్బందులు ఉండవంటూ విద్యార్థులు చెప్పుకొస్తున్నారు. ఇవేమీ ప్రభుత్వానికి పట్టడం లేదు. దానికితోడు ఇప్పుడు ఉమ్మడి ఖాతా అంటూ మరింత కష్టాల పాటు చేస్తోంది. విద్యాదీవెన విడుదలను వాయిదాలు వేస్తోంది.

Updated Date - Dec 17 , 2023 | 12:15 AM