వరాహ పుష్కరిణికి మహర్దశ
ABN , First Publish Date - 2023-05-26T00:14:27+05:30 IST
చరిత్ర ప్రసిద్ధి చెందిన పురాతన కట్టడం స్థానిక శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహా స్వామి వరాహ పుష్కరిణికి మహర్దశ పట్టనుంది.

అమృత సరోవర్‌లో అభివృద్ధికి శ్రీకారం
కొత్త హంగులు సమకూర్చేందుకు అధికారుల చర్యలు
ఆగిరిపల్లి, మే 25 : చరిత్ర ప్రసిద్ధి చెందిన పురాతన కట్టడం స్థానిక శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహా స్వామి వరాహ పుష్కరిణికి మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం అమృత సరోవర్ పథకంలో భాగంగా పుష్క రిణికి కొత్త సొబగులు అద్దనుంది. మొత్తం రూ.32 లక్షలతో అంచనాలు రూపొందించారు. ఇందులో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెరువులోని మేట వేసిన మెరకను తీసి పుష్కరిణిని లోతు చేసే పనులకు శ్రీకారం చుట్టారు.
ఆగిరిపలిలోని దాదాపు 300 ఏళ్ల పైబడి చరిత్ర కలిగిన చారిత్రక ప్రసిద్ధి చెందిన కట్టడంగా వరాహ పుష్కరిణిని భాసిల్లుతోంది. ఐదెకరాల విస్తీర్ణంలో నాలుగు వైపులా మెట్లు మధ్యలో ముఖమండపం కొలువుతీరి చూపరులను ఇట్టే సమ్మేహితులను చేసేవిధంగా పురాతన కాలంలోనే ఈ కొలను తీర్చిదిద్దబడింది. ఈ చారిత్ర కట్టడాన్ని, దీన్ని చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం పుష్కరిణి పునరుద్ధరణ కు నడుం బిగించింది. జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఇటువంటి పుష్కరిణిలు అరుదుగా ఉంటాయని ఇటువంటి చారిత్రక కళాఖండాలను పదిలపరచుకోవడం అందరి బాధ్యతని దీని అభివృద్ధి కోసం అంచనాలు రూపొందించి అవసరమైతే దాతల నుంచి విరాళాలు సేకరించి అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
రూ.32 లక్షలతో అంచనాలు
జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పంచాయతీరాజ్ శాఖ అధికారులు పుష్కరిణి అభివృద్ధికి రూ.32 లక్షలతో అంచనాలు రూపొందించారు. చుట్టూ మెష్‌తో పాటుగా నాలుగువైపు టైల్స్, మెట్ల మార్గంలో ఫ్లడ్‌లైట్లు, ముఖమండపం మరమ్మతులు చేపట్టనున్నారు. దీని చుట్టూ ప్రాకారం నిర్మించి ఫౌంటెన్ ఏర్పాటు చేసి చెరువునీటిని శుద్ధి చేసే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు డిజైన్ వేశారు. చెరువులో నీటిని బయటకు పంపేందుకు, చెరువులోకి నీటిని పెట్టేందుకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేసేందుకు ఈ డిజైన్‌లో అంచనాలు రూపొందించారు.
ప్రస్తుతం రూ.7 లక్షలతోనే అభివృద్ధి
అసిస్టెంట్ కలెక్టర్ ఆదేశాల మేరకు అంచనాలు రూపొందించినా ప్రస్తుతం నిధుల కొరత కారణంగా రూ.7 లక్షల మేరకే అభివృద్ధి చేయను న్నట్టు ఆగిరిపల్లి తహసీల్దార్ ఎం.ఉదయ భాస్కరరావు చెప్పారు. ఈ నిధులతో ఎంతమేరకు పుష్కరిణిని అందంగా తీర్చిదిద్దవచ్చో ఆమేరకు అభివృద్ధి చేయాలని సంకల్పించామన్నారు. దాతలు ముందుకొస్తే పంచా యతీ రాజ్‌శాఖ అధికారులు రూపొందించిన డిజైన్ మేరకు అభివృద్ధి చేస్తామన్నారు. మొత్తం 5.5 ఎకరాల్లో విస్తరించిన పుష్కరిణి అడుగు భాగాన్ని లోతు చేసేందుకు దాదాపు రూ.8 లక్షల అంచనా వ్యయంతో అంచనాలు రూపొందించారు. దీంతో పాటుగా మండల పరిధిలోని నెక్కలంగొల్లగూడెం చుక్కపల్లి ఆటోమోటివ్ కంపెనీ సామాజిక బాధ్యత నిధుల నుంచి రూ.7 లక్షలు వెచ్చించి పుష్కరిణి మెట్లపై భాగంలో నాలుగు వైపులా మెష్ ఏర్పాటు చేయడంతో పాటు స్వామివారి చక్రస్నానం, కార్తీక మాసంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించేందుకు, పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా తూర్పు వైపు మెట్లకు పుష్కర ఘాట్ల మాదిరిగా టైల్స్‌వేసి నాలుగువైపుల కాంతులు వెదజల్లేలా ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయనున్నారు.
సమస్యగా మట్టి తరలింపు
పుష్కరిణిలో ఉపాధి హామీ కూలీలు తవ్విన పూడిక మట్టిన బయటకు తరలించడం ఉపాధి అధికారులకు పెద్ద సమస్యగా మారింది. ఈ మట్టిని మెట్లపైకి ఎత్తి పోయాలంటే వ్యయప్రయాలకు లోనుకావాల్సి వస్తోంది. మట్టిని రైతులు స్వచ్ఛందంగా తమ పొలాలకు తోలుకోవచ్చని చెప్పినా ఆ మట్టిని ఏ సర్వే నంబర్‌లో పొలానికి తరలిస్తున్నారు, ఎన్ని ట్రక్కుల మట్టిని తీసుకువెళ్లారన్న వివరాలు చెప్పాల్సి రావడంతో పాటుగా ప్రతి చిన్న విషయానికి ఉపాధి సిబ్బందితో కలసి ఫొటోలు దిగి అప్‌లోడ్ చేయాల్సి రావడంతో ఈ మట్టిని తీసుకునేందుకు రైతులు ముందుకు రావడంలేదు. మెట్లపై ర్యాంప్ ఏర్పాటు చేస్తే మట్టి తరలింపునకు ముందుకు వస్తామని రైతులు చెబుతున్నా ఇది తమ శాఖ పరిధిలో నిబంధనలకు విరుద్ధమని అధికారులు చెప్పడంతో ప్రస్తుతం తవ్విన మట్టిని పుష్కరిణిలోనే కుప్పలుగా పోస్తున్నారు.