మిచౌంగ్ ముప్పు
ABN , First Publish Date - 2023-12-04T00:25:47+05:30 IST
మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఆదివారం రాత్రి పది గంటల తర్వాత ప్రారంభమైంది. జిల్లాలో అనేక చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు మొదలయ్యాయి.
రైతులు ఉరుకులు..పరుగులు
అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
మాసూళ్లు చేసిన ధాన్యాన్ని
రైస్ మిల్లులకు తరలించండి : కలెక్టర్ ఆదేశాలు
ఏలూరు సిటీ, డిసెంబరు 3 :
మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఆదివారం రాత్రి పది గంటల తర్వాత ప్రారంభమైంది. జిల్లాలో అనేక చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు మొదలయ్యాయి. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సోమవారం నుంచి రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మిచౌంగ్ తుఫాన్ రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సార్వా సాగు ఆరంభం నుంచి పరిస్థితులు అనుకూలంగా లేవని, తీరా పంట చేతికొచ్చే సమయంలో ఈ తుఫాన్ తమను ఆందోళనకు గురి చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతలు కోసిన ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉండడంతో వాటిని రక్షించుకోవడానికి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు అప్రమత్తమయ్యారు. వరి కోతలను వాయిదా వేసుకుంటున్నారు. ఉద్యాన పంటలు గాలులు కారణం గా దెబ్బతినే అవకాశం ఉందని చెబుతు న్నారు.
అంతా అప్రమత్తం
మాసూళ్లు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించే చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఆదేశించారు. అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని పూర్తిగా ఆఫ్‌లైన్ చేసి తగిన జాగ్రత్తలతో రైస్‌మిల్లులకు తరలించాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఇప్పటివరకు 18వేల మెట్రిక్ టన్నుల కోత కాబడిన ధాన్యానికి కావాల్సిన గోనె సంచులు, వాహనాలు, ముఠా వారిని ఏర్పాటు చేసి ఏడు వేల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని తరలించారు. ధాన్యం కొను గోలు ప్రక్రియ సజావుగా సాగడానికి క్షేత్రస్థాయి పర్యవేక్షణ కోసం మండలాల వారీగా ప్రత్యేకాధికారులను నియమించారు. వర్షాలు తగ్గే వరకు వరికోతలు వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోలు రూమ్‌లను ఏర్పాటు చేసింది.
తీరంలో అల్లకల్లోలం
నరసాపురం రూరల్/ మొగల్తూరు, డిసెంబరు 3: మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో అదివారం ఉదయం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతంలో బలమైన చలిగాలులు వీచాయి. సముద్రం ఆల్లకల్లోలంగా మారింది. అలలు ఎగసిపడు తున్నాయి. వాయుగుండం ప్రభావం తుఫాన్‌గా మారే అవకాశం ఉండటంతో పేరుపాలెం సముద్రంలో అలలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తీరంలో చలిగాలులు మబ్బులతో వాతావరణం ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్ ఫాజిల్ మండలంలోని చినలంక, పీఎంలంక గ్రామాల్లో పర్యటించి మత్స్య కారుల్ని అలెక్ట్ చేస్తున్నారు. సముద్రంలో వేటకు వెళొద్దన్నారు. చల్లటి గాలులు వీస్తున్నందున్న వృద్ధులు, చిన్నపిల్లల్ని తుఫాన్ భవనా ల్లోకి మార్చాలని రెవెన్యూ సిబ్బందికి అదేశాలు జారీ చేశారు. అధికారులతో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో అంబరీష్ సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్నందున అధికారులంతా తీరం దాటే వరకు గ్రామాల్లో ఉండి ప్రజల్ని అప్రమత్తం చేయాలన్నారు. అనంతరం వేములదీవి, చినలంక గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.