నేడు పవన్‌ రాక

ABN , First Publish Date - 2023-07-09T01:09:38+05:30 IST

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ రెండో విడత వారాహి యాత్ర ఆదివారం ఏలూరులో ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ఆయన ఇక్కడకు వస్తారు.

 నేడు పవన్‌ రాక

ఏలూరులో సాయంత్రం బహిరంగ సభ

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

రేపు జనవాణి, ముఖ్య నేతలతో సమావేశం

11న దెందులూరు నేతలతో సమీక్ష

12న తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ

ఏలూరు క్రైం, జూలై 8 : జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ రెండో విడత వారాహి యాత్ర ఆదివారం ఏలూరులో ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ఆయన ఇక్కడకు వస్తారు. ఆదివారం సాయంత్రం నగరంలోని మినీ బైపాస్‌ రోడ్డులో వున్న క్రాంతి కల్యాణ మండపం నుంచి వారాహి యాత్ర ప్రారంభమవుతుంది. లోబ్రిడ్జి, సత్రంపాడు, శాంతినగర్‌, కొత్త బస్టాండ్‌, ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌, శ్రీనివాస థియేటర్‌ రోడ్డు, పవరుపేట స్టేషన్‌ సెంటర్‌, కొత్తపేట నూకాలమ్మ గుడి, స్టేడియం రోడ్డు మీదుగా పాతబస్టాండ్‌కు సాయంత్రం ఐదు గంటలకు చేరుతుంది. ఇక్కడ జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి పవన్‌ ప్రసంగిస్తారని జనసేన జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ కూడళ్లలో పవన్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు, కటౌట్‌లు, జెండాలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇక పదో తేదీ మధ్యాహ్నం 12 గంటలకు క్రాంతి కల్యాణ మండపంలో జనవాణి, సాయంత్రం ఆరు గంటలకు ఏలూరు నియోజకవర్గ ముఖ్యనేతలు, వీర మహిళలతో సమావేశం నిర్వహించను న్నారు. 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు దెందులూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమా వేశం జరుగుతుంది. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుని ఇక్కడ జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు.

ట్రాఫిక్‌ మళ్లింపు

ఏలూరు పాతబస్టాండ్‌ వద్ద పవన్‌ బహిరంగ సభ జరగనున్న దృష్ట్యా సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు డీఎస్పీ ఈ శ్రీనివాసులు తెలిపారు.

తాడేపల్లిగూడెం, కొవ్వూరు వైపు నుంచి ఏలూరు వచ్చే భారీ వాహనాలు వంగూరు హైవే నుంచి లోపలికి రావాలి. ద్విచక్ర వాహనదారులు, కార్లు తూర్పు లాకుల దగ్గర నుంచి రైల్వే గేటు మీదుగా మార్కెట్‌ యార్డు, తంగెళ్ళమూడి వైపు, రైల్వే స్టేషన్‌ వద్ద ఉన్న కోడేల బ్రిడ్జి మీదుగా నుంచి వన్‌టౌన్‌లోకి వెళ్లాలి.

తాడేపల్లిగూడెం, కొవ్వూరు వైపు వెళ్ళే వాహనదారులు సీఆర్‌ఆర్‌ పబ్లిక్‌ స్కూలు దగ్గర నుంచి శనివారపుపేట మీదుగా దుగ్గిరాల హైవే పైకి వెళ్లాలి.

బహిరంగ సభకు వచ్చే వాహనదారులు ఏలూరు పాత బస్టాండ్‌ వద్ద ఆదిత్య ప్రిన్స్‌ హోటల్‌ రోడ్డు, కోమల విలాస్‌ రోడ్డు వైపు వెళ్లాలి. ఆశ్రం వైపు నుంచి వచ్చే వాహనాలు పాతబస్టాండ్‌ పక్కన పాండురంగపురం రోడ్డులోను, చాటపర్రు, ఏలూరు వన్‌ టౌన్‌ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు వన్‌టౌన్‌ మార్కెట్‌ రోడ్డులో పార్కింగ్‌ చేసుకోవాలి.

ఫ్లెక్సీలో బాలకృష్ణ, ఎన్టీఆర్‌

పవన్‌ వారాహి విజయయాత్ర నిమిత్తం అభిమానులు కార్యకర్తలు నగరంలో భారీ ప్లెక్సీలు ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో నగరంలో ‘మార్పు మొదలైంది’ పేరుతో చర్చోప చర్చలు జరుగుతున్నాయి. పవన్‌ కల్యాణ్‌కు స్వాగతం పలుకుతూ పెట్టిన ఆ ప్లెక్సీలో బాలకృష్ణ, ఎన్టీఆర్‌ ఫొటోలను ఉంచడంతోపాటు ప్లెక్సీపై మార్పు మొదలైంది అన్న నినాదం పెట్టడంతో ఇప్పుడు ఈ ప్లెక్సీ వ్యవహారం నగరమంతా వైరల్‌గా మారింది.

Updated Date - 2023-07-09T01:09:38+05:30 IST