క్రాస్‌ ఓటింగా.. రెండో ఓటు మళ్లింపా ?

ABN , First Publish Date - 2023-03-15T23:58:23+05:30 IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు గురువారం జరగబోతుంది.

క్రాస్‌ ఓటింగా.. రెండో ఓటు మళ్లింపా ?

నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

అధికార వైసీపీలో టెన్షన్‌ టెన్షన్‌

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు గురువారం జరగబోతుంది. అందరిలోనూ ఉత్కంఠ. క్రాస్‌ ఓటింగ్‌ బెంగ. ఇప్పటికే మండల స్థాయిలో ఎవరెవరు, ఏ రకంగా ప్రతిస్పందించారు, అనుకున్నది అనుకున్నట్టుగా నిర్దేశిత అభ్యర్థికి ఓటేశారా, చెప్పినట్టుగా రెండో ప్రాధాన్యత ఓటు వేశారా లేక దాటేశారా అనే సందేహాలు అభ్యర్థులను చుట్టుముడుతూనే ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వంకా రవీంద్ర, కౌరు శ్రీనివాస్‌, వీరవల్లి చంద్రశేఖర్‌ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నా మరో ముగ్గురు కూడా ఎన్నికల బరిలోనే ఆసాంతం కొనసాగారు. వైసీపీ ముందస్తుగా తమ ఓట్లలో ఉన్న అభద్రతభావం, అసంతృప్తి గమనించి గిఫ్ట్‌ రూపంలో వారిని సంతృప్తిపరిచే ప్రయత్నం చేసింది. ముందు జాగ్రత్త చర్యగా వైసీపీ అభ్యర్థులు కౌరు శ్రీనివాస్‌, వంకా రవీంద్రలకు చెరో 400లకు పైగా తొలి ప్రాధాన్యత ఓట్లు దక్కేలా నియోజకవర్గాల వారీగా వైసీపీ అనుకూల ఓటర్లను ముందస్తుగానే విభజించారు. మొత్తం వైసీపీకి అనుకూలంగా 879 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 14 మంది ఓటర్లు దాదాపు ఓటింగ్‌కు దూరమయ్యారు. ఇవిపోను 865 ఓట్లు వైసీపీ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యతగాను, మలి ప్రాధాన్యతగాను నమోదుకావాల్సి ఉంది. ఈ లెక్కన వైసీపీ గడిచిన రెండు రోజులుగా మండలాల వారీగా పోలైన ఓట్ల వివరాలను ఆచితూచి లెక్కేసుకుంది. ఎవరైనా గీత దాటే ప్రయత్నం చేశారా, లేదా మలి ప్రాధాన్యత ఓటును తాము చెప్పినట్టుకాకుండా ఏమన్నా దాటి వ్యవహరించారా అనే సందేహం వైసీపీకి తలెత్తింది. వాస్తవానికి సంఖ్యాబలం ఉన్న వైసీపీ మాత్రం ఎందుకైనా మంచిదన్నట్టుగా వెండి గ్లాసులు, నగదు, సెల్‌ఫోన్లను అందరికీ అందించి సంతృప్తిపరిచే ప్రయత్నం చేసింది. వైసీపీ తమ పార్టీ అనుకూలురుకే కాకుండా మిగతా పార్టీల వారికి కూడా గిఫ్ట్‌లు అందించామని ధైర్యంగానే చెబుతున్నారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు నియోజకవర్గాల్లోను తమ పార్టీకి ఉన్న స్థానిక బలం కంటే అదనంగా ఓట్లు లభించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం మద్దతుతో అభ్యర్థిగా నిలిచిన వీరవల్లి చంద్రశేఖర్‌ మాత్రం తాము జనసేన, వైసీపీతోపాటు దాదాపు 217 మంది తమకు అనుకూలంగా ఉన్నారని ఘంటాపఽథంగా చెబుతున్నారు. వైసీపీలో కొంతమంది తొలి, మలి ప్రాధాన్యత ఓట్లు కూడా తనకే వేశారని విశ్లేషించడం మరో విశేషం.

అందరిలోనూ టెన్షన్‌ టెన్షన్‌

ఒకవైపు గెలుపు ఖాయమని ధీమాగా ఉన్న వైసీపీలోను ఇప్పటికే టెన్షన్‌ కూడా లేకపోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు ఓటర్లు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ప్రచారం కాస్తా వీరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొందరు ఎంపీటీసీలు మాత్రం మలి ప్రాధాన్యత ఓటును ప్రత్యర్థులకు వేసినట్టుగా ఇప్పటికే లెక్కకడుతున్నారు. వంకా రవీంద్ర, కౌరు శ్రీనివాస్‌ ఇద్దరికీ ఇప్పటికే విభజించి ఓటర్లకు శిక్షణ ఇచ్చి తొలి, మలి ప్రాధాన్యత ఓట్లను వేసేలా జాగ్రత్తలు తీసుకున్నందున ఇప్పుడు సాగుతున్న ప్రచారమంతా ఉత్తుత్తిగానే భావిస్తున్నారు. కౌరు శ్రీనివాస్‌ ఎమ్మెల్సీగా గెలవడంతోపాటు 15 రోజుల వ్యవధిలోనే మంత్రి కాబోతున్నా రంటూ వెలువడుతున్న వార్తలు కూడా వైసీపీలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి : జేసీ

ఏలూరుసిటీ, మార్చి 15 : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నిర్వహించిన పోలింగ్‌ ప్రక్రియలో జిల్లాలో మొత్తం 1,105 మంది ఓటర్లు ఉండగా 1,088 ఓట్లు పోలయ్యాయి. ఏలూరు ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఉదయం ఎన్నికల పరిశీలకులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ తెరిచి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని బందోబస్తు మధ్య నిర్వహిస్తారు. కౌంటింగ్‌ సెంటర్‌ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, జేసీ..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏలూరు జిల్లా జేసీ, రిటర్నింగ్‌ అధికారి పి.అరుణ్‌బాబు తెలిపారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియపై ఎన్నికల సంఘం రూపొందించిన నియమ నిబంధనలపై సిబ్బందికి రెండుసార్లు శిక్షణ అందించామన్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్‌ ఏర్పాట్లను ఏలూరు జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ పరిశీలించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, ఏలూరు ఆర్డీవో కె.పెంచెలకిషోర్‌, డీఆర్‌డీఏ పీడీ ఆర్‌.విజ యరాజు, వ్యవసాయ శాఖ జేడీ వై.రామకృష్ణ, తహసీల్దార్‌ బి.సోమశేఖర్‌ ఉన్నారు.

కౌంటింగ్‌ ఇలా :ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఐదు టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ సిబ్బందితో పాటు ఆయా అభ్యర్థుల ఏజెంట్లు కూడా ఓట్ల లెక్కింపును పరిశీలిస్తారు. లెక్కింపు కేంద్రంలో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. మొద ట కౌంటింగ్‌ టేబుళ్ల వద్ద లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని, తదుపరి రిటర్నింగ్‌ అధి కారి టేబుల్‌ వద్ద జరుగుతుందని చెబుతున్నారు.

Updated Date - 2023-03-15T23:58:23+05:30 IST