ఇళ్లు కట్టరు.. ఇవ్వరు
ABN , First Publish Date - 2023-11-10T00:14:57+05:30 IST
బ్యాంకుల్లో రుణాలు ఇస్తే తీసుకోండి. ఒక్కా పైసా చెల్లించకండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వమే రుణాలు చెల్లిస్తుంది. లబ్ధిదారులపై భారం లేకుండా చూస్తోంది. ఎన్నికల ముందు జిల్లాలో నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్ టిడ్కో లబ్ధిదారులకు ఇచ్చిన భరోసా ఇది. ఆయన సీఎం కాగానే టిడ్కో లబ్ధిదారులు సంబరాలు చేసుకున్నారు.
ఏపీ టిడ్కోలో జాప్యం.. ప్రజలపై వడ్డీ భారం
వసతుల కల్పనలోనూ మీమాంస.. సకాలంలో బిల్లులు ఇవ్వక కాంట్రాక్టర్ల విముఖత
(భీమవరం–ఆంధ్రజ్యోతి):
బ్యాంకుల్లో రుణాలు ఇస్తే తీసుకోండి. ఒక్కా పైసా చెల్లించకండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వమే రుణాలు చెల్లిస్తుంది. లబ్ధిదారులపై భారం లేకుండా చూస్తోంది. ఎన్నికల ముందు జిల్లాలో నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్ టిడ్కో లబ్ధిదారులకు ఇచ్చిన భరోసా ఇది. ఆయన సీఎం కాగానే టిడ్కో లబ్ధిదారులు సంబరాలు చేసుకున్నారు. ఉచితంగా ఇళ్లు వచ్చేస్తాయంటూ ఎగిరి గంతేశారు. మళ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. జగన్ ఇచ్చిన హామీలు నీటి రాతలయ్యాయి. కేవలం 300 చదరపు అడుగుల లబ్ధిదారులకు మాత్రమే ఉచితంగా అందజేశారు. అదే 365, 430 చదరపు అడుగుల కేటగిరీ లబ్ధిదారులకు చేయిచ్చారు. బ్యాంకు రుణాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాయితీతోనే లబ్ధిదారులకు సరిపెట్టారు. తీరా ఇళ్లు కూడా ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్నారు. రుణాలు తీసుకున్న వారికి ప్రభుత్వమే వడ్డీ భారం భరిస్తుందని చెప్పుకొచ్చారు. ఇళ్లు అందజేసే వరకు ప్రభుత్వం వడ్డీ భరిస్తుందని చెప్పడం తో అంతా రుణాలు తీసుకోవడానికి ముందుకొచ్చారు. తీరా ఇప్పుడు వడ్డీతో సహా వాయిదాలు చెల్లించాలంటూ నోటీసులు వెళుతున్నాయి. దీంతో లబ్ధిదారులు హతాశులవుతున్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా ముంచుతోందని మండిపడుతున్నారు.
వడ్డీ భారమెందుకు
టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం మెలికపెట్టింది. రెండేళ్ల వరకు రుణాలపై మారిటోరియం విధించింది. అప్పటి వరకు బ్యాంకులు లబ్ధిదారుల నుంచి రుణాలు రికవరీ చేయ కూడదు. అంటే వాయిదాలు కట్టాలని ఒత్తిడి చేయకూడదు. ఆలోగా ఇళ్లు అందజేస్తే లబ్ధిదారులు వడ్డీతో సహా వాయిదా లు చెల్లించాలి. రెండేళ్లలోగా ఇళ్లు ఇవ్వకపోతేనే ప్రభుత్వం వడ్డీని భరిస్తుంది. పాలకొల్లులో ఇదే జరిగింది. ఇళ్లు పొందిన లబ్ధిదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఏడాదిలో వడ్డీతో సహా మొత్తం రుణాన్ని కలిపి నోటీసులు పంపిణీ చేశారు. వాయిదాలు చెల్లించాలని బ్యాంకు అధికారులు స్పష్టం చేశా రు. దీంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇళ్లు సకాలం లో ఇవ్వకుండా వడ్డీ భారం తమపై మోపుతున్నారంటూ మండిపడుతున్నారు. మరోవైపు రెండేళ్లు దాటితే ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది. అంటే అది అంతిమంగా ప్రజలపై భారం మోపినట్టవుతుంది. సకాలంలో ఇళ్లు మంజూరుచేస్తే ఇటు వంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. తెలుగుదేశం హయాంలో నిర్మించిన ఇళ్లకు రంగులు మార్చడానికే అమిత ప్రాధాన్యం ఇచ్చింది. దాదాపు రూ.20 కోట్లు నిధులు వృథా చేసింది. పార్టీ రంగుల ను వేసింది. అదే ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు ఇవ్వకుండా తాత్సారం చేసింది. దీంతో ఏజన్సీలు నిర్మాణాలను నిలిపివేశాయి. ఇప్పుడిప్పుడే పనులు మొదలెట్టాయి. టీడీపీ హయాలో నిర్మించిన ఇళ్లను మాత్రమే ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందజేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో వాయిదాలు వేస్తూ వస్తున్నారు. డిసెంబరులో రెండో విడత ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
బ్యాంకు రుణాలపైనే ఆసక్తి
జిల్లాలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు మంజూరు చేయాలన్న ధ్యాసకంటే బ్యాంకు రుణాలపైనే ప్రభుత్వం ఆసక్తి చూపు తోంది. జిల్లాలో 365, 430 చదరపు అడుగుల కేటగిరీ ఇళ్లు 12,926 ఉన్నాయి. వాటికి బ్యాంకుల నుంచి రుణాలు మంజూ రు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 10,532 మంది లబ్ధిదారు లకు రుణాలు మంజూరయ్యాయి. మొత్తంగా జిల్లాలో భీమవ రం, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో 19,972 ఇళ్లు నిర్మిస్తు న్నారు. తెలుగుదేశం హయాంలోనే దాదాపు ఎనిమిది వేల మంది ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలినవి 70 శాతం అప్పట్లోనే నిర్మాణాలు చేపట్టారు. గడచిన నాలుగున్నరేళ్లలో వాటిని వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఇప్పటి వరకు సుమారు 6,600 ఇళ్లు మాత్రమే అప్పగించారు. మిగిలినవి లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. కేవలం 300 చదరపు అడుగుల కేటగిరీ ఇళ్లను మాత్రమే ఉచితంగా అందజేస్తున్నారు. అదే 365, 430 చదరపు కేటగిరీల్లో అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కలిపి రూ.3 లక్షల రాయితీ ఇస్తున్నాయి. బ్యాంకుల నుంచి రూ.3.65 లక్షలు రుణం అందజేస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు భరించాల్సి వస్తోంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఏపీ టిడ్కో ఖాతాలో జమ అవుతు న్నాయి. వాటిని ప్రభుత్వం బదలాయించుకుంటోంది. కానీ కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు మంజూరు చేయడం లేదు. మౌలిక వసతుల కల్పనలోనూ జాప్యం చేస్తూ వస్తోంది. అదే ఇప్పుడు టిడ్కో లబ్ధిదారులకు శాపంగా మారింది. పూర్తిస్థాయి లో ఇళ్లు అప్పగించే పరిస్థితి లేదు. ప్రస్తుత ప్రభుత్వంలో అప్పగించలేని దుస్థితి నెలకొంది. మరోవైపు వడ్డీ భారాన్ని ఎవరు భరిస్తారన్న దానిపై అయోమయం నెలకొంది. రెండేళ్లు దాటినా ఇళ్లు కేటాయించని లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వం వడ్డీ మంజూరుచేసింది. అదే రెండేళ్లలోగా అయితే లబ్ధిదారులు భరించాలని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి వడ్డీ భారం తప్పడం లేదు. ప్రభుత్వం తప్పిదంతో అంతిమంగా ప్రజలపై భారం పడుతోంది.