దూసుకొచ్చిన మృత్యువు

ABN , First Publish Date - 2023-03-31T00:23:33+05:30 IST

మోటార్‌ సైకిల్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఘటనా స్థలిలో ఇద్దరు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

దూసుకొచ్చిన మృత్యువు
మృతులు బెంజ్‌మెన్‌ రవి, ఉషా, జోసఫ్‌ (ఫైల్‌)

బైక్‌ను ఢీకొన్న లారీ

దంపతులు సహా మేనల్లుడి దుర్మరణం.. జంగారెడ్డిగూడెం హైవేపై విషాదం

జంగారెడ్డిగూడెం, మార్చి 30 : మోటార్‌ సైకిల్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఘటనా స్థలిలో ఇద్దరు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిృష్టారం గ్రామానికి చెందిన నక్కా రవి(30), ఉషా దంపతులు తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఉంటున్న రవి సోదరైన వేల్పుల కళావతి, అనంతకుమార్‌ దంపతుల ఇంటికి రెండు రోజుల క్రితం వెళ్లారు. అక్కడ నుంచి గురువారం తిరుగు ప్రయాణం అయ్యారు. రవి, ఉషా దంపతులు ద్విచక్ర వాహనంపై, వారితోపాటు అనంతకుమార్‌, కళావతి దంపతులు వారి ఇద్దరు పిల్లలు జోసఫ్‌ బెంజ్‌మెన్‌ (12), జాయ్‌ బాబులు బస్సులో బయల్దేరారు. మార్గమధ్యలో జంగారెడ్డిగూడెం బస్టాండ్‌కు బస్సు వచ్చే సరికి జోసఫ్‌ బెంజ్‌మెన్‌ తన మేనమామ రవితో కలసి బైక్‌పై వెళ్తానని మారాం చేశాడు. ఈ విషయం తెలిసి రవి బస్టాండ్‌ వద్దకు వచ్చి మేనల్లుడిని ఎక్కించుకుని బయల్దేరాడు. అక్కడ నుంచి 10 నిమిషాలు ప్రయాణం సాగగా జంగారెడ్డిగూడెం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద నేషనల్‌ హైవేపై ఎదురుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొనడంతో కిందపడిన రవి, బెంజ్‌మెన్‌ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఉషను 108లో తొలుత జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి అక్కడ నుంచి ఏలూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో దేవులపల్లి వద్ద మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన లారీ ముందువెళ్తున్న లారీని ఓవర్‌ టేక్‌ చేస్తూ అతివేగంగా దూసుకొచ్చి బైక్‌ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా ప్రమాదం జరిగిన అదే ప్రదేశంలో ఫిబ్రవరి 9న బైక్‌పై వెళ్తున్న ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులు లారీ ఢీకొని మృతి చెందారు.

నా కొడుకును లేపండి

మృతుల్లో ఒకరైన జోసఫ్‌ బెంజ్‌మెన్‌ గోకవరంలో 6వ తరగతి చదువుతున్నాడు. కాగా మార్చురీ వద్ద అతని తల్లి కళావతి ‘నా కుమారుడు జోసఫ్‌ బెంజ్‌మెన్‌ పడుకున్నాడు.. లేపండి.. ఆడుకునే సమయం అయింది..’.. అంటూ కన్నీరు మున్నీరుగా రోదించడం చూపరులను కలచి వేసింది.

Updated Date - 2023-03-31T00:23:33+05:30 IST