ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ రూటే..వేరు

ABN , First Publish Date - 2023-06-04T00:39:45+05:30 IST

పశ్చిమ డెల్టాలోని ఒక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం లంచాలతో అట్టడుకుపోతుంది. రిజిస్ట్రార్‌ లంచావతారానికి కార్యాలయంలోని సిబ్బందే కాదు..లేఖర్లు, కక్షిదారులు సైతం బెంబేలెత్తిపోతున్నారు.

ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ రూటే..వేరు

అయినా ఇంకా అసంతృప్తే..

80 కి .మీ ప్రయాణం చేసి ఉద్యోగం

కారు డ్రైవర్‌, మరో అసిస్టెంట్‌

గగ్గోలు పెడుతున్న లేఖర్లు,కక్షిదారులు

పాలకొల్లు, జూన్‌ 3: పశ్చిమ డెల్టాలోని ఒక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం లంచాలతో అట్టడుకుపోతుంది. రిజిస్ట్రార్‌ లంచావతారానికి కార్యాలయంలోని సిబ్బందే కాదు..లేఖర్లు, కక్షిదారులు సైతం బెంబేలెత్తిపోతున్నారు. సుమారు 80 కిలోమీటర్ల దూరం నుంచి దర్జాగా ప్రతీ రోజూ కారులో వచ్చి మండల కేంద్రంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారంటే ఆయన ఆదాయం ఏ రేంజ్‌లో ఉందో చెప్పకనే తెలుస్తున్నది. రానూ పోనూ 160 కిలోమీటర్లు.. కారుకు అయ్యే డీజిల్‌ ఖర్చు, డ్రైవర్‌ జీతం, దానికితోడు మరో అసిస్టెంట్‌.. ఎంత లంచం పట్టేస్తే ఈ దర్జా జరుగుతుందని కార్యాలయంలోని సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. ప్రతీ డాక్యుమెంట్‌కు ఏదో ఒక కొర్రీ వేస్తూ ఇబ్బందులు పెడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. వాస్తవానికి పంట భూములు, పొలాలు మాత్రమే వెబ్‌ ల్యాండ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయి. అయితే ఇళ్లస్థలాలు, ప్లాట్‌లకు సైతం వెబ్‌ల్యాండ్‌ ఉండాలంటూ ఏదో ఒక జీవోను తెరపైకి తెస్తూ సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ ఇబ్బందులకు గురి చేస్తునట్లు కార్యాలయ పరిధిలోని పలువురు లేఖర్లు చెబుతున్నారు. రోజుకు కనిష్టంగా రూ. లక్ష తీసుకెళుతున్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని సిబ్బందికి సైతం వాటాలు ఇవ్వడం లేదని ఒక ఉద్యోగి తెలిపారు. ప్రతీ నిత్యం రిజిస్ట్రేషన్‌కు వచ్చే దరఖాస్తులను గంటలు కొద్ది పెండింగ్‌లో పెట్టి బేరం కుదిరిన తరువాతే రిజిస్ట్రేషన్‌ పక్రియ పూర్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. పశ్చిమ డెల్టాలోని ఒక మండల కేంద్రంలో సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ లంచావతారంపై స్థానికులు,లేఖర్లు ఇప్పటికే ఒక రాష్ట్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు తక్షణం స్పందించి ఆ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పూర్తిస్థాయిలో సబ్‌ రిజస్ట్రార్‌ నియమించాలని కోరుతున్నారు.

Updated Date - 2023-06-04T00:39:45+05:30 IST