సీతారాముల కల్యాణానికి అపర భద్రాద్రి ముస్తాబు

ABN , First Publish Date - 2023-03-26T00:57:46+05:30 IST

మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగి అపర భద్రాద్రిగా పేరుగాంచిన చనుబండ కోదండ రామస్వామి ఆలయం సీతారాముల కల్యాణానికి ముస్తాబైంది.

సీతారాముల కల్యాణానికి అపర భద్రాద్రి ముస్తాబు
చనుబండ కోదండరామస్వామి ఆలయం..

28 నుంచి కల్యాణోత్సవాలు ప్రారంభం

చాట్రాయి, మార్చి 25: మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగి అపర భద్రాద్రిగా పేరుగాంచిన చనుబండ కోదండ రామస్వామి ఆలయం సీతారాముల కల్యాణానికి ముస్తాబైంది. 28వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2 వరకు పాంచాహ్నిక దీక్షతో సుదర్శనం శ్రీనివాసాచార్యులు యాజ్జీకంలో కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరగనున్నట్టు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి తెలిపారు. 28వ తేదీ ఉదయం స్వామివారిని పెండ్లి కుమారుని చేయుట, రాత్రి విష్వక్సేన పూజ, దీక్షా స్వీకరణ, పుణ్యావచనం, అగ్ని ప్రతిష్ట, 29 రాత్రి 9.30కి ఎదుర్కోలు ఉత్సవం (వధూవరా అన్వేషణ), 30వ తేదీ ఉదయం గం 12.15 లకు స్వామివారి కల్యాణం అనంతం గరుడోత్సవం నిర్వహిస్తారు. 31న మహాపట్టాభిషేకం, అన్నసమారాధన, రాత్రి 11.30లకు రఽథోత్సవం ఉంటా యన్నారు. ఏప్రిల్‌ 1వతేదీ మధ్యాహ్నం 2 గంటలకు వసంతోత్సవం, రాత్రి 8.33లకు పూర్ణాహుతి అనంతరం దోపోత్సవం, 2వతేదీ రాత్రి 9.43లకు ద్వాదశ ప్రదక్షణలు అనంతరం స్వామివారి పవళింపుసేవ జరుగుతుందని ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

భద్రాచలం నుంచి తలంబ్రాలు

భద్రాచలం నుంచి కోదండ రామస్వామి ఆలయానికి శనివారం కల్యాణ తలంబ్రా లు వచ్చాయి. ప్రతి ఏడాది భద్రాచలం శ్రీ రామచంద్రస్వామి ఆలయం నుంచి కల్యాణ తలంబ్రాలు తెచ్చి ఇక్కడ రాములోరి కల్యాణం జరిపించడం ఆనవాయితీ. తలంబ్రాలను ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి, అర్చకులు మారుతి అందుకొన్నారు.

==========

మరుగుదొడ్డి గుంతలో పడి బాలుడి మృతి

పెదవేగి, మార్చి 25 : మరుగుదొడ్డి కోసం తవ్విన నూతిలో పడి రెండేళ్ళ బాలుడు మృతి చెందాడు. పెదవేగి మండలం న్యాయంపల్లికి చెందిన దేవరపల్లి రవి, వెంకటేశ్వ రమ్మలకు పది నెలలు, రెండేళ్ల వయసున్న ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. శనివారం ఉదయం రెండేళ్ల బాలుడు గగన్‌తేజ వారి ఇంటికి సమీపంలో ఉండే తాతయ్య, నానమ్మల ఇంటికి వెళ్ళాడు. నానమ్మ సీఎం సభకు వెళ్ళగా, తాతయ్య ఇంటి దగ్గర ఉన్నాడు. కొత్తగా నిర్మించుకున్న రేకుల షెడ్డు దగ్గర ఇటీవల మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టారు. దీనికోసం నుయ్యి తవ్వి దానిపై సిమెంట్‌ రేకు ఉంచారు. కొద్దిసేపటికి బాలుడు కనిపించకపోయేసరికి బాలుడి తాతయ్య కుమారుని ఇంటికి వెళ్ళి కోడలుకు విషయం చెప్పి చుట్టుపక్కల వెతికారు. నుయ్యిపై ఉన్న రేకు కొంత పక్కకు జరిగి ఉండ డంతో అనుమానం వచ్చి నూతిలో చూడగా నీటిలో విగతజీవుడై గగన్‌తేజ కనిపించాడు. స్థానికంగా వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు. బాలుని మృతితో ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. వచ్చేనెల 18న రెండో పుట్టినరోజు కోసం ఎదురు చూస్తున్నామని ఇంతలోనే ఇంత విషాదం జరిగిందని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

Updated Date - 2023-03-26T00:57:46+05:30 IST