చంద్రబాబు అరెస్టుపై నిరసనలు
ABN , First Publish Date - 2023-09-23T00:27:12+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టును నిరసిస్తూ పదో రోజు శుక్రవారం పార్టీ శ్రేణులు, అభిమానులు జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగించారు. వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నింది. చంద్రబాబుపై అవినీతి బురద చల్లే ప్రయత్నం చేసింది.
10వ రోజుకు రిలే దీక్షలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టును నిరసిస్తూ పదో రోజు శుక్రవారం పార్టీ శ్రేణులు, అభిమానులు జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగించారు. వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నింది. చంద్రబాబుపై అవినీతి బురద చల్లే ప్రయత్నం చేసింది. కక్ష పూరితంగా వ్యవహరించింది. ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. తెలుగుదేశం శ్రేణులంతా చంద్రబాబుతోనే ఉంటారు. అక్రమ అరెస్ట్‌లు ఉపసంహరిం చుకునే వరకు పోరాటం చేస్తారు’ అంటూ ఆ పార్టీ నాయకులు దీక్ష పూనారు. పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం చేపట్టిన దీక్షలో వినూత్న నిరసనలు చేపట్టారు. నర్సాపురంలో శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ దీక్షలో కూర్చున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు దీక్ష వహించారు. భీమవరంలో టీడీపీ శ్రేణులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథిలు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు త్వరితగతిన బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెంలో రూరల్ మండల నాయకులు దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. సాయంత్రం వరకు రిలే దీక్షలు చేపట్టారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ వలవల బాబ్జి, ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ తదితరులు మద్దతు ప్రకటించారు. నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. మంచిముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారంటూ బాబ్జి పేర్కొన్నారు. తణుకులో నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలను ప్రజలంతా తిప్పికొడతారని ఆరిమిల్లి స్పష్టం చేశారు. పాలకొల్లులో ఎస్సీ సెల్ నియోజకవర్గ నాయకులు దీక్ష వహించారు. పాముల రజనీకుమార్, బిట్ల రామాంజనేయులు, మాకా రత్నంరాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయమని శాపనార్థాలు పెట్టారు. ఆచంటలో తెలుగునాడు విద్యార్థి సంఘం నాయకులు దీక్షలో పాల్గొన్నారు. ఉండిలో చేపట్టిన దీక్షా శిబిరంలో పాలకోడేరు మండల టీడీపీ నాయకులు దీక్ష పూనారు. పాలకోడేరు మండల అధ్యక్షుడు దెందుకూరి ఠాగూర్ కోటేశ్వరరాజు ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. నియోజకవర్గ పరిశీలకుడు నాగేంద్రకుమార్, ఆకివీడు, ఉండి మండల అధ్యక్షుడు మోతుపల్లి రామవరప్రసాద్, కరిమెరక నాగరాజులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
నరసాపురం, సెప్టెంబరు 22: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని శాసనసభ్యులకూ రక్షణ లేకుండా పోయిందని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ మండిపడ్డారు. శుక్రవారం నరసాపురంలో దీక్షలో పాల్గొని మాట్లాడుతూ శాసనసభలో టీడీపీ సభ్యులపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దూషణలు, దౌర్జన్యాలు, దాడులకు పాల్పడటం దారుణమన్నారు. సభలోని విషయాలు బయటకు రానివ్వకుండా తమ అధీనంలో పెట్టుకోవడం సిగ్గుచేట న్నారు. శాసనసభ సమావేశాలు వైసీపీ సమావేశాలుగా మారాయని ఎద్దేవా చేశారు. చంద్ర బాబుపై మోపిన కేసులు ఏవీ నిలబడవన్నారు. కక్షపూరితంగానే చంద్రబాబును జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారన్నారు. సాంకేతిక కారణాల వల్ల హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ను తిరస్కరించినా సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని షరీఫ్ వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, జక్కం శ్రీమన్నా రాయణ, కొల్లు పెద్దిరాజు, కొప్పాడ రవిలు పాల్గొన్నారు.