వైసీపీని తరిమి కొడదాం : ఎమ్మెల్యే రామరాజు
ABN , First Publish Date - 2023-12-03T00:08:27+05:30 IST
వచ్చే ఎన్నికలలో వైసీపీని తరిమికొడదామని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు.
ఉండి, డిసెంబరు 2 :వచ్చే ఎన్నికలలో వైసీపీని తరిమికొడదామని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. శనివారం కోలమూరులో ‘ఇంటింటికి ఎమ్మెల్యే, ఇంటింటికి మన రాంబాబు, బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలంతా గుర్తుచేసుకుంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎక్కడవేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారిందన్నారు. అంతా అవినీతిమయంగా, కక్షపూరితంగా పాలన సాగుతుందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మ్యేనిఫెస్టో వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో క్లస్టరు ఇన్‌చార్జిలు పేరిచర్ల బాలరాజు, కట్టా రాంబాబు, పేరిచర్ల మురళీకృష్ణంరాజు, దేవన్‌రాజు, పార్టీ మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, టీడీపీ మాజీ అధ్యక్షుడు జుత్తుగ శ్రీనివాసరావు, యశోధకృష్ణ, గంధం బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం 8వ వార్డులో..
నరసాపురం టౌన్ : నరసాపురం పట్టణంలో 8వ వార్డులో శనివారం ‘బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ బాండ్లను టీడీపీ పట్టణ కార్యదర్శి కొల్లు పెద్దిరాజు అందించారు. నాలుగున్నరేళ్లలో వైసీపీ చేసింది ఏమి లేదన్నారు. పన్నుల రూపంలో దోపిడీ చేశారన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి మళ్లీ అవకాశం ఇస్తే రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మహిళలు అండగా ఉండాలని కోరారు. తొలుత పట్టణ, మండలంలో ఓటర్ల వెరిఫికేషన్‌ను టీడీపీ, జనసేన నాయకులు పరిశీలించారు. బూత్‌ల వారీగా ఓట్లు ఉన్నాయా, చేర్పులు, మార్పులపై బీఎల్‌వోలను అడిగి తెలుసుకున్నారు. కొప్పాడ నరేష్, పోలిశెట్టి సాంబ తదితరులు పాల్గొన్నారు.