తగ్గేదేలే..

ABN , First Publish Date - 2023-09-20T00:42:54+05:30 IST

చినవెంకన్న తోడు కావాలని వేడుకుంటూ జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, కార్యకర్తల సుమారు మూడు వేల మంది భారీ పాదయాత్రగా శ్రీవారి క్షేత్రానికి మంగళవారం చేరుకున్నారు.

తగ్గేదేలే..
టీడీపీ నేతల భారీ పాదయాత్ర

ఉమ్మడి పశ్చిమ టీడీపీ నేతల భారీ పాదయాత్ర

తిరుమలపాలెం ఘటనకు దీటైన సమాధానమిచ్చిన టీడీపీ–జనసేన

ఎక్కడా కానరాని పోలీసులు

జిల్లాలో ఏడో రోజు కొనసాగిన రిలేదీక్షలు

ఏలూరు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

ఆగమంటే ఆలోచిస్తా మేమో గానీ.. అడ్డుకుంటే తగ్గేదేలేదని టీడీపీ–జనసేన కూటమి నిరూపించింది. పోలీసులు లాఠీలు ఝళిపిస్తే.. తాము ఐక్యంగా పోరాడుతామని చెప్పకనే చెప్పింది. ఏ ద్వారకా తిరుమలకు చేరకుండా అడ్డుకున్నారో, అదే చినవెంకన్న సన్నిధికి టీడీపీ–జనసేన కూటమి భారీ సంఖ్యలో పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. వెంకన్న సన్నిధికి చేరుకుని 101 కొబ్బరికాయలు కొట్టి తమ అధినేత చంద్రబాబునాయుడి విడుదలకు మొక్కులు మొక్కింది. మరోవైపు జిల్లాలో నిరాహారదీక్షలను నాయకులు ఏడో రోజున కొనసాగించారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టు నేపథ్యంలో యావత్‌ తెలుగుదేశం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో రీతిన నిరసనలు చేపడుతున్నారు. జిల్లా నాయకులు సైతం నిరాహారదీక్షలు, నిరసనలు, ఆందోళనలు తదితర రూపాల్లో తమ ఆందోళనను వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలోనే బాబును విడుదల చేయాలని, ఈరాక్షస పాలన అంతమొందేందుకు కలియుగ ప్రత్యక్షదైవం చినవెంకన్న తోడు కావాలని వేడుకుంటూ జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, కార్యకర్తల సుమారు మూడు వేల మంది భారీ పాదయాత్రగా శ్రీవారి క్షేత్రానికి మంగళవారం చేరుకున్నారు. ద్వారకా తిరుమల మండలంలోని తిమ్మాపురం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, కె.జవహర్‌, నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లు బడేటి చంటి, మద్దిపాటి వెంకటరాజు, ఆరిమిల్లి రాధా కృష్ణ, వలవల బాబ్జి, ఘంటా మురళీరామకృష్ణ, అంగర రామ్మోహనరావు, పొత్తూరి రామరాజు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగపల్లి శేషారావు, జనసేన శ్రేణులు పాల్గొన్నారు. నిమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్ర బాబుకు వస్తున్న ప్రజాదరణ, యువగళం పాదయాత్రకు వస్తున్న స్పందన, వారాహి యాత్రకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను గమ నించి వైసీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ప్రతిపక్షం చేపట్టిన ఈ ప్రజా యాత్రలను అణచివేసే దిశగా ఈ రాష్ట్ర సైకో చేస్తోన్న ప్రయత్నాలు నిర్వీర్యం అవ్వాలని, సైకో పాలన పోవాలని చిన వెంకన్నను తమ పాదయాత్ర ద్వారా వేడుకున్నామన్నారు. బడేటి చంటి మాట్లా డుతూ ప్రజాకోర్టులో జగన్‌ డిపాజిట్లు కోల్పోవడం తథ్యమన్నారు. ప్రజలు స్వచ్ఛం దంగా చంద్రన్న అక్రమ అరెస్టును నిరసిస్తూ రోడ్లపైకి వస్తున్నారన్నారు. గోపాలపురం ఇన్‌చార్జ్‌ మద్దిపాటి వెంకట్రాజు మాట్లాడుతూ జగన్‌ తన రాజకీయ సమాధికి తానే పునాది తీసుకున్నాడ న్నారు.

లాఠీలకు సవాల్‌..

గడిచిన శుక్రవారం ఇదే రీతిన టీడీపీ మండల స్థాయి నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఆ సమయంలో పోలీసులు లాఠీలకు పనిజెప్పి అడ్డుకున్నారు. భీమడోలు ఎస్‌ఐ బూతుల పర్వం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాను శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అడ్డుకుంటే సహించేదే లేదని మరోసారి పాదయాత్రకు పూనుకున్నారు. అయితే మండల స్థాయి కాస్తా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాగా, పదుల నాయకుల సంఖ్య కాస్తా వేలల్లో సమీకరణమై పాదయాత్ర ఒక ప్రభంజనంలా సాగింది. దాదాపు 5 కి.మీల. మేర జరిగిన ఈ పాదయాత్రను అడ్డుకునేందుకు, లాఠీలు అడ్డుపెట్టడానికి గానీ ఏ ఒక్క అధికారి ముందుకురాలేదు. తిమ్మా పురం నుంచి జరిగిన ఈ పాదయాత్రపై ఉత్కంఠ నెలకొన్నా, పోలీసులు సాహసించకపోవడంతో ఎలాంటి వివాదాస్పద ఘటనలకూ తావు లేకుండా పోయింది. శ్రీవారి పాదాల వద్దకు చేరుకున్న టీడీపీ– జనసేన నాయకులు స్వామికి మొక్కి కొబ్బరికాయలు కొట్టి, తిరిగి సొంత ప్రాంతాలకు ప్రయాణమయ్యారు.

కొనసాగిన దీక్షలు

టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యాన ఆరు రోజులుగా జరుగుతోన్న రిలే నిరాహార దీక్షలు జిల్లా వ్యాప్తంగా ఏడో రోజున కూడా కొనసాగాయి. ఏలూరు, దెందు లూరు, ఉంగుటూరు, కొయ్యలగూడెం, ముసునూరు, వేల్పుచర్ల, కైకలూరు, నూజివీడు తదితర ప్రాంతాల్లో ఈ దీక్షలు కొనసాగాయి. ఏలూరులోని చేపల తూము సెంటర్లో జరుగుతోన్న దీక్ష శిబిరం వద్ద నియోజకవర్గ ఇన్‌చార్జి బడేటి చంటి మాట్లాడుతూ తమ అధినేత చంద్రబాబును మానసికంగా వేధించడానికే సీఎం జగన్‌ ఈ అరెస్టుకు తెరతీశాడన్నారు. బాబు అరెస్టును నిరసిస్తూ మేము సైతం మీ వెంటే పేరిట టీడీపీ చేపడుతోన్న రిలే నిరాహార దీక్షల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతా మన్నారు. ఏ ఆధారాలు చూపించ కుండానే జగన్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలో అవినీతి పేరుతో అభూత కల్పనలకు శ్రీకారం చుట్టారన్నారు. టీడీపీతో పాటు జనసేన, ఇతర పక్షాల నేతలు ప్రజా ఉద్యమాలకు తెరతీసిన నేపథ్యంలో చంద్రబాబు బయటకు రావడం తథ్యమన్నారు.

బెయిల్‌ వచ్చేలా చూడు స్వామీ..

ద్వారకా తిరుమల, సెప్టెంబరు 19: టీడీపీ అధినేత చంద్ర బాబుకు బెయిల్‌ రావాలని, ఈ రాక్షస పాలన అంతమొం దించాలని కోరుతూ జిల్లాలోని అన్ని నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లు కార్యకర్తలతో కలసి పాద యాత్రగా మంగళవారం ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రానికి విచ్చే శారు. కొబ్బరికాయలు కొట్టి వెంకన్నకు మొక్కుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు, నాయకులు ఘంటా మురళీ రామకృష్ణ, పాలి ప్రసాద్‌, ఏలూరు జిల్లా జోన్‌–2 ఇన్‌చార్జ్‌ మండలం రవి, మండల టీడీపీ అధ్యక్షుడు లంకా సత్యనారాయణ, పాకలపాటి గాంధీ, మొగతడకల శ్రీని వాసరావు, డీవీఎస్‌ చౌదరి, పోలిన శ్రీను, ఘంటా శ్రీనివాసరావు, ఏపూరి దాలయ్య, మద్రాసు రాము, నాదెండ్ల సురేంద్రనాథ్‌ చౌదరి పాల్గొన్నారు.

మొర్సపూడిలో పోస్టుకార్డు ఉద్యమం

నూజివీడు టౌన్‌ : చంద్రబాబుకు అండగా మేము సైతం అంటూ వృద్ధులు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటు న్నారు. టీడీపీ చేపట్టిన పోస్ట్‌కార్డు ఉద్య మాన్ని మండలంలోనూ చేపట్టారు. మొర్సపూడికి చెందిన వృద్ధురాలు శ్రీకృష్ణమ్మ ఈమేరకు బాబుకు అండగా నేను సైతం అంటూ పోస్టుకార్డుపై స్వహస్తాలతో రాసి రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌ జైలుకు పంపారు.

Updated Date - 2023-09-20T00:44:13+05:30 IST