హోరెత్తిన నిరసనలు
ABN , First Publish Date - 2023-09-26T00:41:55+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా 13వ రోజు సోమ వారం నిరసన దీక్షలు కొనసాగాయి.

జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణుల రిలేదీక్షలు.. ఆలయాల్లో పూజలు
ఏలూరు, సెప్టెంబరు 25, (ఆంధ్రజ్యోతి) : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా 13వ రోజు సోమ వారం నిరసన దీక్షలు కొనసాగాయి. రాష్ట్ర ప్రజనీకానికి వైసీపీ చేస్తున్న రాజ కీయ కుట్రలన్నీ అర్థమవుతున్నాయని, రాష్ట్ర అభివృద్ధికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఎంత ముఖ్యమో ప్రజలకు వివరిస్తూ టీడీపీ నాయకులు వారిలో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఏలూరు చేపల తూము సెంటర్‌లో నిర్వహించిన రిలే నిరాహార దీక్షల్లో టీడీపీ ఇన్‌చార్జ్ బడేటి చంటి పాల్గొని నాయకులు, కార్యకర్తలతో కలసి కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఎమర్జెన్సీకి మించి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరసన శిబిరంలో మహిళలు దీక్షలను చేపట్టారు. గుర్వాయిగూడెంలో తెలుగు యువత ఆధ్వర్యంలో దీక్షలను కొనసాగించారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో జరిగిన నిరసన దీక్షల్లో నియోజక వర్గంలోని లింగపాలెం, కామవరపుకోట, చింతలపూడి, జంగారెడ్డిగూడెం నాలుగు మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు వెళ్లి మద్దతు తెలిపారు. మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, జగ్గవరపు ముత్తారెడ్డి, గుత్త సత్యసాయివరప్రసాద్, బొమ్మాజీ అనిల్, సొంగా రోషన్‌కుమార్, మోరంపూడి మల్లికార్జునరావు తదితరులు సంఘీభావం వ్యక్తం చేశారు. కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం అల్లూరులో గంగా భవాని అమ్మవారి ఆలయం వద్ద చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మోకాళ్ల మీద నిలబడి నిరన వ్యక్తం చేశారు. పోలవరం నియోజకవర్గం పరిధిలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో కొయ్యలగూడెంలో వాణిజ్య విభాగం నాయకులు దీక్షను చేపట్టారు. నూజవీడు, మొర్సపూడి, ముసునూరు, బత్తులవారిగూడెంలలో టీడీపీ దీక్షలు కొనసాగాయి. దెందులూరు మండలం గంగన్నగూడెం ఆరోమైలు వద్ద టీడీపీ నిరసన దీక్షలు చేశారు. ఉంగుటూరులోని ఏలూరు కాల్వలో టీడీపీ నాయకులు జలదీక్ష చేపట్టారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని స్పందన కార్య క్రమంలో ఉంగుటూరు తహసీల్దార్ వెంకటరమణకు ఎస్సీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.
అక్రమ అరెస్టుపై ప్రజలకు చెప్పండి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
ఏలూరు టూ టౌన్, సెప్టెంబరు 25 : టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన విధానాన్ని ప్రజలకు అవగాహన కలిగేలా వివరిం చాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రాజమండ్రిలో చంద్రబాబుతో ములాఖత్ అవడానికి వెళ్తున్న అచ్చెన్నాయుడు ఏలూరు లోని ఓ హోటల్‌లో టీడీపీ నాయకులతో కాసేపు మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్పందన ఎలా ఉందంటూ ఆరా తీశారు. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ సానుకూల పవనాలు వీస్తున్నాయని వీటిని సద్వినియోగం చేసుకుని పార్టీని బలోపేతం దిశగా తీసుకెళ్లాలని హితబోధ చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పని చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజ నేయులు, ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడేటి రాధాకృష్ణయ్య, మాజీ కన్వీనర్ ముత్తారెడ్డి, ముత్తా వెంకట వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.