మేము సైతం..

ABN , First Publish Date - 2023-09-23T00:26:55+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టును నిరసిస్తూ పదో రోజు శుక్రవారం పార్టీ శ్రేణులు, అభిమానులు జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగించారు.

మేము సైతం..
జంగారెడ్డిగూడెంలో కొవ్వొత్తులతో మహిళల ర్యాలీ

జిల్లావ్యాప్తంగా కొనసాగిన నిరసన దీక్షలు

చంద్రబాబు విడుదల కావాలని ఆలయాల్లో పూజలు

కొవ్వొత్తులతో మహిళల ప్రదర్శనలు

ఏలూరు, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టును నిరసిస్తూ పదో రోజు శుక్రవారం పార్టీ శ్రేణులు, అభిమానులు జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగించారు. ‘బాబుతో మేము సైతం’ అంటూ వివిధ రూపాల్లో మద్దతు ప్రకటించారు. ఏలూరు చేపలతూము సెంటర్‌లో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బడేటి చంటి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. బిర్లా భవన్‌ సెంటర్‌, మార్కెట్‌ ఏరియా తదితర ప్రాంతాల్లో పర్యటించి చంద్రబాబుపై వైసీపీ సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరును వివరించారు. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం నవ్వుల పాలైందని అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలో టీడీపీ మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన నియోజకవర్గ తెలుగు యువత అద్యక్షుడు నత్త నాగేంద్ర ఆధ్వర్యంలో తెలుగు యువత దీక్షను చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, ముత్తారెడ్డి, ముస్తఫా తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. శుక్రవారం సాయంత్రం జంగారెడ్డిగూడెం రామచంద్రపురం వాటర్‌ ట్యాంక్‌ నుంచి స్థానిక గంగానమ్మ ఆలయం వరకు ‘మేము సైతం బాబు వెంట’ అంటూ మహిళలతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం గంగానమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలవరం నియోజకవర్గం పరిధిలో కొయ్యలగూడెంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బొరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు మాజీ మంత్రి దేవినేని ఉమా హాజరయ్యారు. పోలవరం మండలంలో పట్టిసీమలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టి.నరసాపురం మండలంలోని కె.జగ్గవరంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయవరపు శ్రీరామూర్తి, నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముసునూరు మండలంలో గోగులంపాడు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు, కార్యకర్తలు 100 మందితో దీక్షను చేపట్టి చెవుల్లో పువ్వులు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. చింతలపూడి మండలం మల్లాయిగూడెం, ప్రగడవరం, బట్టువారిగూడెం, గురుబట్లగూడెం గ్రామాల్లో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పోస్టుకార్డుల ఉద్యమాన్ని నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గంలో బత్తులవారిగూడెంలో టీడీపీ నాయకులు అర్ధ నగ్న ప్రదర్శనతో తనమ నిరసన చేశారు. మొర్సపూడిలో నల్ల బెలూన్‌లు ఎగురవేశారు. కైకలూరు, ముదినేపల్లి మండలం పెదపాలపురంలో, ఉంగుటూరులో రిలే దీక్షలు చేశారు. కైకలూరు టీడీపీ కార్యాలయంలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా కలిదిండి మండలం టీడీపీ అధ్యక్షుడు పోకల జోగిరాజు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ముదినేపల్లి మండల పెద్దపాలపర్రులో టీడీపీ నిరసనలు సాగాయి.

పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారు : దేవినేని

కొయ్యలగూడెం, సెప్టెంబరు 22 : ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. కొయ్యలగూడెంలో జరుగుతున్న టీడీపీ రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో సైకో పాలన సాగుతోంది. ఒక మాజీ ముఖ్యమంత్రిని తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయడం దారుణం. పోలవరం నిర్వాసితులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది. ప్రాజెక్టు కోసం ఎంతో త్యాగం చేసిన నిర్వాసితులను నట్టేట ముంచారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబుకు సంఘీ భావాన్ని తెలుపుతున్నారు’.. అన్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు దీక్షలో కూర్చున్నారు. పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్‌లు పారేపల్లి రామారావు, కాకర్ల సురేష్‌, ఎపెడా డైరెక్టర్‌ విద్యాసాగర్‌, తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి మేఘలాదేవి, మండల టీడీపీ అధ్యక్షుడు పారేపల్లి నరేష్‌, పట్టణ టీడీపీ అధ్యక్షుడు జ్యేష్ట రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ కుంజా సుభాషిణి, చాందిని, ఆకుల అరుణ, మడకం లక్ష్మి, రమాదేవి, సంధ్యారాణి, తదితర మహిళలు దీక్షలో కూర్చున్నారు.

Updated Date - 2023-09-23T00:26:55+05:30 IST