నిరసన సెగలు

ABN , First Publish Date - 2023-09-22T00:15:08+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై జిల్లాలో తొమ్మిదో రోజు గురువారం కూడా నిరసనలు ఎగసిపడ్డాయి.

నిరసన సెగలు
చాట్రాయి మండలం మంకొల్లు వద్ద తమ్మిలేరు ప్రాజెక్టులో జలదీక్ష

చంద్రబాబు అరెస్ట్‌తో ఊరూరా ఆందోళనలు

రోజురోజుకు టీడీపీకి పెరుగుతున్న బీసీల మద్దతు

ఏలూరులో బార్‌ అసోసియేషన్‌, న్యాయవాదుల సంఘీభావం

దీక్షల్లో భారీ సంఖ్యలో కూర్చుంటున్న మహిళలు

ఏలూరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై జిల్లాలో తొమ్మిదో రోజు గురువారం కూడా నిరసనలు ఎగసిపడ్డాయి. ఏలూరు నియోజవర్గ ఇన్‌చార్జి బడేటి చంటి నేతృత్వంలో రోజుకో రీతిన వినూత్న నిరసనలతో నిరసనలు జరుగుతున్నాయి. ఏలూరులోని భవన, హోటళ్ల కార్మికులు, హోటళ్లకు వెళ్లే ప్రజలను బడేటి కలుసుకున్నారు. చంద్రబాబును జగన్‌ సర్కార్‌ కక్ష పూరితంగా ఎలా అరెస్ట్‌ చేసింది వివరించారు. చంద్రబాబుకు నైతిక మద్దతు తెలపాలని ప్రజలను కోరారు. ప్రతీ ఒక్కరూ చేయి చేయి కలిపి వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నగరంలోని చేపల తూము సెంటర్‌లో జరుగుతున్న రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఈ దీక్షలకు ఏలూరు బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. మూడు కేసులకంటే ఎక్కువ వున్న వారిపై రౌడీ షీట్‌ తెరుస్తామని బెదిరిస్తుండటాన్ని బడేటి ఖండించారు. జంగారెడ్డిగూడెంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. చింతలపూడి నియోజక వర్గ నాయకులు నియోజకవర్గంలోని ఒక్కో రోజు ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుంటూ నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో లింగపాలెం మండలంలో దీక్షలు చేపట్టారు. పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన బీసీ నాయకులు కొయ్యలగూడెంలో జరుగుతున్న దీక్షల్లో పాల్గొన్నారు. నూజివీడు టౌన్‌, బత్తులవారిగూడెం, మొరసపూడి, ముసునూరు, ముక్కొళ్లుపాడు ప్రాంతాల్లో టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నాయకుల దీక్షలకు నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వర్రావు శిబిరాలకు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెయిల్‌పై బయట తిరుగుతున్న ఏ 1, ఏ 2లు చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి, ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కైకలూరు నియోజవర్గ కేంద్రంలోని టీడీపీ కార్యాలయం వద్ద మండవల్లి నాయకుల ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు జరిగాయి. ఉంగుటూరు, దెందులూరుల్లోను రిలే దీక్షలు కొనసాగాయి.

ఇద్దరు టీడీపీ కార్యకర్తల మృతి

పోలవరం/చింతలపూడి, సెప్టెంబరు 21 : చంద్రబాబు అరెస్టుతో మనస్థాపానికి గురైన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు. చంద్రబాబును అరెస్ట్‌ చేసినప్పటి నుంచి పోలవరం పంచాయతీ కృష్ణారావుపేటకు చెందిన పార్టీ కార్యకర్త పెంటా కోటేశ్వరరావు(66) దిగులుతో ఆరోగ్యం క్షీణించి మృతి చెందాడు. బాబును అన్యాయంగా అరెస్టు చేశారని, పదే పదే కలవరించేవాడని అతని కుమారుడు ప్రసాద్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. చంద్రబాబు అరెస్టు వార్తలు చూస్తూ చింతలపూడి మండలం సీతానగరం గ్రామ టీడీపీ ఉపాధ్యక్షుడు చందా మన్మథరావు (55) బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యాడు. ఆయనను విజయవాడ ఆస్పత్రికి తరలిం చగా, చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నియోజకవర్గ టీడీపీ మాజీ కన్వీనర్‌ జె.ముత్తారెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు మాటూరి వెంకట్రామయ్య, టీడీపీ నాయ కులు బొమ్మాజీ అనిల్‌, కక్కిరాల నాగేశ్వరరావు, ముత్తా శేఖర్‌ తదితరులు మన్మథ రావు భౌతికకాయం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Updated Date - 2023-09-22T00:15:08+05:30 IST