హోమియో వైద్యానికి తూట్లు..

ABN , First Publish Date - 2023-02-21T00:43:59+05:30 IST

హోమియో వైద్యానికి ప్రజాదరణ ఉన్నా ప్రభుత్వం హోమియో ఆస్పత్రుల అభివృద్ధిపై శీతకన్ను వేసింది. హోమియో ఆస్పత్రులు పలు రకాల సమస్య లతో కునారిల్లుతున్నాయి.

హోమియో వైద్యానికి తూట్లు..
ఆగిరిపల్లి హోమియో ఆస్పత్రి

సరిపడ వైద్య సిబ్బంది, సౌకర్యాలు నిల్‌

పీహెచ్‌సీల్లో విలీన యత్నాలు..

పూర్తిగా మూసివేసేందుకేనా?

హోమియో వైద్యానికి ప్రజాదరణ ఉన్నా ప్రభుత్వం హోమియో ఆస్పత్రుల అభివృద్ధిపై శీతకన్ను వేసింది. హోమియో ఆస్పత్రులు పలు రకాల సమస్య లతో కునారిల్లుతున్నాయి. సిబ్బంది కొరతతో ముక్కుతూ మూల్గుతూ మనుగడ సాగిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 12 చోట్ల ప్రభుత్వ హోమియో వైద్యశాలలు ఉండగా, ఇందులో ఏ ఒక్క ఆస్పత్రిలోనూ పూర్తిస్థాయిలో సౌకర్యాలుగానీ, సిబ్బందిగానీ లేరు. ఫలితంగా రోగులు హోమియో వైద్యానికి దూరమవుతున్నారు. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు లేని ఈ వైద్యం ప్రజలకు పూర్తిస్థాయిలో అందకపోవడం విచారకరం.

ఆగిరిపల్లి, ఫిబ్రవరి 20 : దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారంతా హోమియో వైద్యాన్ని ఆశ్రయించడం పరిపాటి. ముఖ్యంగా వృద్ధులు ఎక్కువగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని ఈ వైద్యంపైనే మక్కువ చూపుతారు. మధుమేహం, రక్తపోటు, కీళ్లవాతం, చర్మవ్యాధులు, సొరియాసిస్‌, పైల్స్‌, సైనస్‌, ఆస్తమా వంటి వ్యాధులు ఉన్న వారు ఎక్కువగా హోమియో వైద్యానికే మొగ్గు చూపుతారు. ప్రభుత్వ హోమియో ఆస్పత్రున్న చోట ఈ వైద్యానికి డిమాండ్‌ ఎక్కువగానే ఉంటుంది. ఉమ్మడి కృష్ణాలో ఆగిరిపల్లి, గుడ్లవల్లేరు, మచిలీపట్నం, నందిగామ, నూజివీడు, కోరుకొల్లు, పుల్లూరు, యార్లగడ్డ, సాలిపాలెం, గంపలగూడెం, పెదపాలెం, లక్ష్మీపురం ప్రాంతాలలో హోమియో ఆస్పత్రులున్నా ఈ ఆస్పత్రుల్లో మంచినీరు, విద్యుత్‌, కూర్చోడానికి బెంచీలు గానీ, కుర్చీలు గానీ లేవు. వైద్యులు కూడా సరిపడినంత మంది లేక దగ్గరలో ఉన్న ఆస్పత్రుల నుంచి వారానికో రోజు చొప్పున డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ఇక కాంపౌండర్‌, ఏఎన్‌ఎం, స్వీపర్‌ వంటి పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆస్పత్రులు నామ్‌ కే వాస్తేగా నడుస్తున్నాయి. ఆగిరిపల్లిలో 1982లో ప్రభుత్వ హోమియో ఆస్ప్రతి నెలకొల్పగా దాతలు పారేపల్లి బుచ్చయ్య, అంజమ్మ దంపతులు ఇచ్చి స్థలంలో 1986లో ఆస్పత్రికి భవనం నిర్మించి ఇందులో ఆస్పత్రిని నడుపుతూ వచ్చారు. కాలగమనంలో ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం 2012లో రెండు గదులతో కొత్త భవనం నిర్మించింది. ఆగిరిపల్లి మండల ప్రభుత్వ హోమియో ఆస్పత్రికి నిత్యం మండలంలోని వివిధ గ్రామాల నుంచే కాకుండా విజయవాడ, గన్నవరం మండలాల నుంచి కూడా రోజూ 50 మంది వరకు రోగులు వస్తుంటారు. వీరికి ఆస్పత్రిలో వేచి ఉండేందుకు కుర్చీలుగాని, మంచినీటి వసతిగాని లేదు. ఇక్కడ ఏఎన్‌ఎం, స్వీపర్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్న వైద్యురాలు, కాంపౌండరే తమ సొంత ఖర్చుతో మనిషిని నియమించి ఆస్పత్రిని శుభ్రం చేయిస్తున్నారు. హోమియో ఆస్పత్రుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించకపోగా ఈ వైద్యానికి రోగులను దూరం చేసేలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. మౌలిక సదుపాయాల గురించి మాట్లాడితే హోమియో ఆస్పత్రులను దగ్గరలోని పీహెచ్‌సీల్లో విలీనం చేస్తామంటోంది. పీహెచ్‌సీల్లోనే తగినంత చోటు లేక అక్కడి సిబ్బంది విధి నిర్వహణకే అరకొరగా ఉంటున్న పరిస్థితుల్లో పీహెచ్‌సీల్లో హోమియో ఆస్పత్రుల నిర్వహణకు గదులు కేటాయిం చే పరిస్థితులు కనిపించడం లేదు. కొత్తగా సిబ్బందిని నియమించకపోవడంతో హోమియో వైద్యాన్ని రోగులుకు అందుబాటులో లేకుండా చేయాలన్న లక్ష్యమే కనిపిస్తున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం హోమియో ఆస్పత్రులను ఆధునికీకరించి, సిబ్బంది నియామకాలు చేపట్టి, ఈ వైద్యాన్ని మరింత విస్తృతం చేయాలని రోగులు కోరుతున్నారు.

తాగడానికి నీళ్లేవీ..?

నాకు మెడనరాల నొప్పులు వచ్చాయి. హోమియో వైద్యం అయితే బాగా నయం అవుతుందన్న నమ్మకంతో వచ్చా ఆస్పత్రిలో తాగడానికి మంచినీళ్లు కూడా లేవు, ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసి వైద్య సేవలందించాలి.

–బొట్లా వీరయ్య, ఆగిరిపల్లి

పీహెచ్‌సీలో విలీనం చేస్తామంటున్నారు

ఆస్పత్రుల్లో మౌలిక వసతులు గురించి అడిగితే స్థానిక పీహెచ్‌సీలో విలీనం చేస్తామంటున్నారు, పీహెచ్‌సీల్లో మాకు చోటు కల్పించేందుకు అక్కడి సిబ్బందికే ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. మిగిలిన ఆస్పత్రులతో పోలిస్తే ఆగిరిపల్లి హోమియో ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగ్గానే ఉన్నాయి.

డి.రజిత, హోమియో వైద్యురాలు

Updated Date - 2023-02-21T00:44:31+05:30 IST