చేపల పట్టుబడి అడ్డగింత

ABN , First Publish Date - 2023-06-01T00:06:31+05:30 IST

కళింగగూడెం పంచాయతీ పరిధిలోని కొత్త చెరువు ప్రాంతంలోని ఆక్వాచెరువులో చేపల పట్టుబడిని బుధవారం గ్రామ స్థులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆకివీడు స్టేషన్‌కు తరలించారు.

చేపల పట్టుబడి అడ్డగింత
గ్రామస్థులను నిలువరిస్తున్న పోలీసులు

ఆకివీడురూరల్‌ మే 31: కళింగగూడెం పంచాయతీ పరిధిలోని కొత్త చెరువు ప్రాంతంలోని ఆక్వాచెరువులో చేపల పట్టుబడిని బుధవారం గ్రామ స్థులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆకివీడు స్టేషన్‌కు తరలించారు. ఏడు సంవత్సరాల క్రితం కళింగగూడెంలోని గేదెల కోడు– కొత్త చెరువు గ్రామాల మధ్య ఉన్న సుమారు 62 ఎకరాల్లో తాండ్ర జ్యోగిరాజు తదితర రైతులు ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుమతితో చెరువు తవ్వారు. ఆ సమయంలో లీజుదారుడు కొత్తచెరువు గ్రామానికి వాటర్‌ ప్లాం టుతో పాటు కొంత స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని, దానిని నిలబెట్టు కోకపోవడంతో తాము పోరాటం చేస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులంతా ఒక్కసారిగా చెరువు గట్టుమీదకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకుని కొంతమందిని స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా, తమను రెండు సంవత్సరాలుగా చెరువులో చేపలు పట్టుకోకుండా చేస్తున్నారని, న్యాయస్థానాన్ని ఆశ్రయించి పట్టుబడి పట్టుకుంటున్నామని, ఇప్పటికే చాలా నష్టపోయామని రైతులు వాపోయారు.

ఆత్మహత్యాయత్నం: చేపల చెరువు పట్టుబడిని ఆపేందుకు కొత్త చెరువు గ్రామానికి చెందిన పెనుమాల మాణిక్యాలరావు, దత్తళ్ళ రాజు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. పోలీసులు వారిని అడ్డుకుని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారివురు క్షేమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

భీమవరం సబ్‌ డివిజన్‌ సిబ్బందితో బందోబస్తు : రైతుల పిటీషన్‌ మేరకు కోర్టు ఆదేశాలతో భీమవరం సబ్‌ డివిజన్‌ సిబ్బందితో బందోబస్తు అందించినట్లు డీఎస్పీ శ్రీనాధ్‌ తెలిపారు. చెరువు పట్టుబడి పూర్తయ్యే వరకు బందోబస్తు ఉంటుందన్నారు. ఆకివీడు సర్కిల్‌ సీఐ రామ కృష్ణ, ఎస్‌ఐలు, కానిస్టేబుల్స్‌, వుమెన్‌ పోలీసులు సుమారు 70 మంది బందోబస్తులో పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T00:06:31+05:30 IST