Share News

ఎలా ఆడేది..?

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:06 AM

జిల్లాలో క్రీడా మైదానాల్లో వసతుల కల్పనను విస్మరించిన ప్రభుత్వం తాజాగా ఆడుదాం ఆంధ్రా.. అంటూ పోటీలకు సన్నాహాలు చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

ఎలా ఆడేది..?
పెదగొన్నూరు హైస్కూల్‌ ఆటస్థలాన్ని ఎక్స్‌కవేటర్‌తో హడావిడిగా చదును చేయిస్తున్న దృశ్యం

నేడు ఆడుదాం ఆంధ్రా ప్రారంభం

క్రీడా పోటీల నిర్వహణకు తప్పని తిప్పలు

మైదానాలు కరువు.. వసతుల లేమి

నాలుగున్నరేళ్లుగా క్రీడారంగం గాలికి..

అధికారులకే అంతా అయోమయం

ఏలూరు స్పోర్ట్స్‌ / ముదినేపల్లి, డిసెంబరు 25:

యువత పెడదారి పట్టకుండా వారిని క్రీడలవైపు మరలిం చడానికి ఆడుదాం ఆంధ్రా అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లా, జాతీయ, అంతర్జాతీయ వేదిక లపై గ్రామస్థాయి నుంచి యువత పోటీపడేలా వారిని తీర్చిదిద్దడం పోటీల లక్ష్యమంటూ ప్రభుత్వం చెబుతోంది. పోటీల సంగతి అటు ఉంచితే వైసీపీ అధికారంలోకి వచ్చాక క్రీడా వసతులపై శీతకన్ను వేయడంతో క్రీడాకారులకు అగ చాట్లు తప్పడం లేదు. జిల్లాలో క్రీడా మైదానాల్లో వసతుల కల్పనను విస్మరించిన ప్రభుత్వం తాజాగా ఆడుదాం ఆంధ్రా.. అంటూ పోటీలకు సన్నాహాలు చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కనీసం పోటీల నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతో క్రీడా పోటీలు ఎలా నిర్వహిం చాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

జిల్లావ్యాప్తంగా అన్ని సచివాలయ పరిధిలో ఈనెల 26 నుంచి ఆడుదాం ఆంధ్రా పోటీలకు క్రీడాకారులు రిజిస్ర్టేషన్‌ పూర్తయింది. క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, బాల్‌ బ్యాడ్మింటన్‌, ఖోఖో పోటీల్లో గ్రామ, మండల, జిల్లాల్లో పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే మౌలిక సదుపాయాలు లేని మైదానాల్లో క్రీడాపోటీలకు శ్రీకారం చుట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం క్రీడా మైదానాల అభివృద్ధిని గాలికి వదిలేసింది. జిల్లాకు ఒక ఇండోర్‌స్టేడియం అంటూ ప్రకటనలే తప్ప నిర్మాణం సంగతి అటు ఉంచితే పాతవాటి నిర్వహణకు నిధులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చాలాకేంద్రాల్లో ప్రైవేట్‌ కేంద్రాలను ఆశ్రయించి శిక్షణ పొందాల్సి వస్తోంది. ఉన్నట్లుండి ప్రభుత్వం ఆడుదాం రండి అంటూ పిలుపును ఇవ్వడంపై క్రీడాకారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మైదానం లేకుండా ఆటలు ఎలా...

జిల్లాలో 625 గ్రామ సచివాలయాల పరిధిలో 15 ఏళ్లు నిండిన వారందరిని పోటీలో పాల్గొనేలా అధికారులు, వలంటీర్లు, వైసీపీ శ్రేణులు ప్రచారం చేశాయి. పాల్గొనే వారికోసం రిజిస్ర్టేషన్లు ప్రారంభించగా, అవి పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ మైదానాలను పరిశీలించారు. పోటీల నిర్వహణకు 320 ఆట స్థలాలను సిద్ధం చేశారు. దీంట్లో ప్రైవేట్‌ మైదానాలే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ మైదానాల్లో మౌలిక వసతులు లేకపోవడంతో ప్రధానంగా ప్రైవేట్‌ మైదానాల ఎంపికపై దృష్టి సారించారు. మండల, మునిసిపల్‌ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ మైదానాలు ఉన్నా గ్రామీణస్థాయిలో వెతుకు లాట తప్పలేదు. ఆడుదాం ఆంధ్రా కోసం ఉపాధి నిధులతో మైదానాలు బాగు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ఎంపిక చేసిన అత్యధిక మైదానాల్లో సౌకర్యాలు లేకపోవడంతో పోటీల నిర్వహణ అధికారులకు తలనొప్పిగా మారింది.

అధికారులకు నిధుల సమస్య

అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఆడుదాం – ఆంరఽధా ఆటల పోటీల కార్యక్రమం గందరగోళంగా మారింది. ఆటల పోటీలు నిర్వహణకు అవసరమైన వనరుల సమీకరణ అధికారులను సందిగ్ధంలో పడేసింది. ముదినేపల్లి మండలంలో గ్రామ సచివాలయాల స్థాయిలో మంగళవారం నుంచి ఆడుదాం – ఆంధ్రా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం పూర్తిగా మండల పరిషత్‌ ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉన్నప్పటికీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్లు, పీఈటీలే పోటీలు నిర్వహించాలి. అయితే సచివాలయాల పరిధిలో ఏయే ఆటల పోటీలకు ఎన్ని టీములు నమోదయ్యాయన్న సమాచారం పీడీలు, పీఈటీల వద్ద లేదు. ఇదిలా ఉంటే పోటీల నిర్వహణకు అయ్యే ఖర్చు ఎవరు భరించాలన్నది ప్రధాన సమస్యగా ఉంది. ఆటల నిర్వహణకు హైస్కూళ్లలో ఆట స్థలాల చదునుకు, ఇతర ఏర్పాట్లకు, ప్రారంభోత్సవాలకు అయ్యే ఖర్చు సంగతి ఏమిటన్నది అధికారులను వేధిస్తోంది. పోటీల నిర్వహణకు అవసరమైన క్రీడా సామగ్రిని ప్రభుత్వం సరఫరా చేసింది. క్రీడల నిర్వహణ భారం మాత్రం అధికారులపై పడింది. గ్రామ పంచాయతీలు నిధులు లేవని చేతులెత్తేయడం, స్థానిక ప్రజా ప్రతినిధులు ఖర్చులు భరించే స్థితిలో లేకపోవడంతో క్రీడలను ఎలా నిర్వహించాలో తెలియక అధికారులు అయోమయంలో పడ్డారు. ముదినేపల్లి మండలంలో హైస్కూళ్లలో ఆటల పోటీలు నిర్వహించేందుకు ఆట స్థలాలు అనువుగా లేవు. ఎక్కువగా వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, ఖో–ఖో ఆటలు ఆడేందుకే ఆట స్థలాలు అనుకూలంగా ఉన్నాయి. దీంతో క్రికెట్‌ పోటీలు గురజ హైస్కూల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. కొన్నిచోట్ల హడావుడిగా ఆట స్థలాలను హడావిడిగా చదును చేయిస్తున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:06 AM