Share News

ఇసుక దోపిడీ

ABN , First Publish Date - 2023-11-08T23:46:37+05:30 IST

ఇసుక దోపిడీ సాగుతోంది. గోదావరి వరదలతో ర్యాంప్‌లు మూతపడ్డాయి. మరోవైపు ఏజన్సీ కాలపరిమితి తీరిపోయింది. కొత్తవారికి ర్యాంప్‌లు కట్టబెట్టేందుకు ప్రభుత్వం టెండర్‌లు పిలిచింది. జిల్లాలో తమ గుత్తాధిపత్యం ఉండేలా అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇసుక దోపిడీ

ఐదు టన్నుల లారీ రూ.19 వేలు

అధిక ధరలకు విక్రయిస్తున్న దళారులు

ముందస్తు నిల్వల నుంచి అమ్మకాలు

కొత్త ర్యాంపులపైనా అధికార పార్టీ కన్ను

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఇసుక దోపిడీ సాగుతోంది. గోదావరి వరదలతో ర్యాంప్‌లు మూతపడ్డాయి. మరోవైపు ఏజన్సీ కాలపరిమితి తీరిపోయింది. కొత్తవారికి ర్యాంప్‌లు కట్టబెట్టేందుకు ప్రభుత్వం టెండర్‌లు పిలిచింది. జిల్లాలో తమ గుత్తాధిపత్యం ఉండేలా అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. టెండర్‌లు ఖరారయ్యేంత వరకు ర్యాంప్‌లు తెరచుకునే అవకాశం లేదు. దాంతో ఇసుకకు డిమాండ్‌ పెరిగింది. ధరలు పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లాలో ఐదు టన్నుల లారీ ఇసుక ప్రస్తుతం రూ. 19 వేల ధర పలుకుతోంది. అదే ర్యాంప్‌లు పనిచేసినప్పుడు గరిష్టంగా రూ.15వేలకు విక్రయించారు. గోదావరి వరదలతో ర్యాంప్‌లు మూత పడ్డాయి. అప్పుడు కూడా ధర పెరగలేదు. నిర్మాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాజాగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో నిర్మాణాలు చేపడుతున్నారు. ఇసుకకు డిమాండ్‌ పెరిగింది. దాంతో ఇసుక ధర రూ.19 వేలు పలుకుతోంది. పెనుగొండ, ఆచంట మండలాల్లో ఇసుక నిల్వలు చేసుకున్నారు. వేలటన్నులు ఇసుక నిల్వ ఉంది. దానినే ఇప్పుడు అమ్మకాలు సాగిస్తున్నారు. వాస్తవానికి ఇసుక నిల్వలు చేసుకోవడం నిబంధనలకు విరుద్ధం. గతంలో నిల్వలుంటే సీజ్‌ చేశారు. విజిలెన్స్‌ తనిఖీలు నిర్వహించారు. నిర్మాణాదారులు నిల్వ ఉంచిన కొద్దిపాటి ఇసుకపైనా ఆరాలు తీశారు. బిల్లులు సమర్పించాలని విజిలెన్స్‌ అధికారులు స్పష్టం చేశారు. అదే ఇప్పుడు కొండల మాదిరిగా ఇసుక నిల్వలున్నాసరే అధికారులకు పట్టడం లేదు. ఇసుక నిల్వ చేసుకున్న వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. అధిక ధరలకు అమ్ముకుంటున్నారు.

టీడీపీ హయాంలో ఉచితం

తెలుగుదేశం హయాంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశారు. అప్పట్లో లారీ ఇసుక రూ. 10 వేలకు లభించేది. కేవలం తవ్వకం ధరతో పాటు, రవాణా చార్జీలు వసూలు చేసేవారు. ప్రభుత్వానికి నష్టం వాటిల్లినా నిర్మాణ రంగం వృద్ధి చెందాలని అప్పట్లో ఉచిత విధానాన్ని అమలు చేశారు. తక్కువ ధరకే ఇసుక లభ్యమైంది. నిర్మాణ రంగం కరువు తీరిపోయింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విఽధానాన్ని నిలిపివేశారు. ఏడాదిపాటు ఇసుక విధానాన్ని అమలు చేయలేకపోయారు. ఇసుక లభ్యత లేక నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు రోడ్డున పడ్డారు. తీరా ప్రభుత్వమే ఇసుక విక్రయాలకు తెరతీసింది. అప్పుడు ధరలు రూ. 14 వేలకు చేరాయి. అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ దోచుకున్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఏజన్సీకి ప్రభుత్వం ఇసుక ర్యాంప్‌లు అప్ప గించింది. అప్పుడు కూడా ధరలు తగ్గుముఖం పట్టలేదు. లారీ ఇసుక రూ. 15 వేలు పలికింది. ధరలు పెరిగాయి. అక్ర మార్కులు ముందస్తుగానే నిల్వ చేసుకున్నారు. దానినే ఇప్పుడు అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. దీనిని కాదని తెలుగుదేశం హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయంటూ, ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు గగ్గోలు పెడుతున్నారు.

ర్యాంప్‌లు ఎవరికి దక్కేనో..

జిల్లాలో ఉన్న ఇసుక గుట్టలపై అధికారులు గొంతు విప్పడం లేదు. మరోవైపు కొత్తగా ప్రభుత్వం ఇసుక ర్యాంప్‌ల కోసం టెండర్లు పిలిచింది. తమ గుప్పిల్లో ర్యాంప్‌లు ఉండేలా దళారులు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. జిల్లాలో సిద్ధాంతం, నడిపూడి, కోడేరు, దొడ్డిపట్ల, మద్దిరాజు పాలెం, యలమంచిలి లంక, యలమంచిలి, చించినాడలో ర్యాంప్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో సిద్ధాంతం ర్యాంప్‌న ుంచి ఇసుక సరఫరా అధికంగా ఉంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకరి కనుసన్నల్లోనే ర్యాంప్‌లు ఉండేలా పావులు కదుపుతున్నట్టు సమాచారం. మొత్తంపైన క్షేత్ర స్థాయిలో తమ ప్రమేయం ఉండేలా దళారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Updated Date - 2023-11-08T23:46:39+05:30 IST