ఆర్టీసీ ప్రయాణం భద్రమేనా !
ABN , First Publish Date - 2023-11-20T00:08:53+05:30 IST
విజయవాడ బస్టాండ్‌లో, వీరవాసరం హైవేపై ఇటీవల చోటు చేసుకున్న బస్సు ప్రమాదాలు ఆర్టీసీ ప్రయాణికుల్లో భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

సగానికి పైగా పాత బస్సులే
కాలం చెల్లిన బస్సులతో కాలక్షేపం
ఏలూరు కలెక్టరేట్, నవంబరు 19 : విజయవాడ బస్టాండ్‌లో, వీరవాసరం హైవేపై ఇటీవల చోటు చేసుకున్న బస్సు ప్రమాదాలు ఆర్టీసీ ప్రయాణికుల్లో భయాందోళనలకు గురి చేస్తున్నాయి. విజయవాడ బస్టాండ్‌లో అదుపు తప్పిన బస్సు ఫుట్‌పాత్ పైకి ఎక్కి ప్రయాణికులపైకి దూసుకెళ్లగా ముగ్గురు మృతి చెందిన ఘటన ఆర్టీసీ బస్టాండుల్లో ప్రయాణికుల భద్రతపై డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. వీరవాసరం హైవేపై పాలకొల్లు నుంచి భీమవరం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో మోటార్ సైక్లిస్టు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనల నేపథ్యంలో జిల్లాలోని డిపోల్లో ఉన్న బస్సుల కండీషన్‌పై ప్రయాణికులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో అధిక శాతం బస్సులు కాలం చెల్లినవే ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు తరచూ రోడ్లపైనే ఆగిపోవడం లేదా ప్రమాదాలకు గురికావడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరమ్మతు లకు గురై బస్సులు ఆగిపోవడం పరిపాటిగా మారింది. వాస్తవానికి ఆరు లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను నడపాలన్న నిబంధన ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పది లక్షల కిలోమీటర్లు పైగా తిరిగిన బస్సులే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. లాభాలు రావడం లేదనే కారణంతో ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తుందనే వాదన వినిపిస్తోంది. ఏలూరు డిపోలో 131, నూజివీడు డిపో 86, జంగారెడ్డిగూడెం 77 మొత్తం 294 బస్సులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా పాతబస్సులే. 15 ఏళ్లు సర్వీసు దాటిన బస్సులను రోడ్లపై నడపకూడదని అత్యున్నత న్యాయస్థానం గతంలో ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొన్ని బస్సులను నిలుపుదల చేశారు. కొన్ని బస్సులు కండీషన్‌లో లేవని వాటికి మరమ్మతులు చేయించి ఆయా రూట్లలో నడుపుతున్నట్టు కార్మికులు చెబుతున్నారు. కొత్త బస్సులు రాక, పాత బస్సులతోనే నెట్టుకొస్తున్నారు. జిల్లాలో రోడ్లు అధ్వానంగా ఉండడం, తరుచూ ఎక్కడో ఒక చోట బస్సులు మొరాయిస్తుండడంతో ప్రజలు భయం... భయంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. నిత్యం ఏదో ప్రాంతంలో బస్సులు ఆగిపోవడం బస్సు నుంచి పొగలు రావడం సర్వసాధారణమైంది.
ప్రయాణికులకు తప్పని అవస్థలు
తరచూ బస్సులు మార్గమధ్యంలో ఆగిపోతుండడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దాదాపు అన్నీ కాలం చెల్లిన బస్సులు కావడంతో అటు కార్మికులు, ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా మైదాన ప్రాంతాలతో పాటు తిరిగే బస్సులు ఎక్కువగా మరమ్మతులకు గురవుతున్నాయని డ్రైవర్లు చెబుతునానరు. ఇంజన్ అరుగుదల మొదలుకుని క్లచ్ ప్లేట్లు కాలిపోవడం, ఇరిగిపోవడం, రేడియేటర్ వేడి ఎక్కడం, స్టీరింగ్‌కు సంబంధించిన సమస్యలు వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఇదే పరిస్థితి మరికొన్నాళ్లు సాగితే డొక్కు బస్సులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం లేకపోలేదని ఇప్పటికైనా కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు సమకూర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.