రహదారులు ధ్వంసం
ABN , First Publish Date - 2023-08-22T00:02:59+05:30 IST
మండలంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన రహదారులు తారు రోడ్డుకు నోచుకోవడం లేదు. ఫలితంగా అవి అధ్వాన ంగా మారి ప్రయాణికులకు ప్రమాదకరంగా పరిణమించాయి.
రూ.4 కోట్లతో శాంతినగరం–పెదలంక రోడ్డు నిర్మాణం
నేటికీ తారు రోడ్డుకు నోచుకోని వైనం
అండలుగా విరిగి కాల్వలో పడుతున్న గ్రావెల్
కలిదిండి, ఆగస్టు 21 : మండలంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన రహదారులు తారు రోడ్డుకు నోచుకోవడం లేదు. ఫలితంగా అవి అధ్వాన ంగా మారి ప్రయాణికులకు ప్రమాదకరంగా పరిణమించాయి. ప్రజాధనం వృథా అవుతోంది. రూ.4 కోట్లతో నిర్మించిన శాంతినగరం–పెదలంక రోడ్డు పలు చోట్ల గ్రావెల్ అండలుగా విరిగి కాల్వలో పడుతోంది. 2021లో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. 2022 ఆగస్టు నాటికి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. 2023 ఆగస్టు నెల గడుస్తున్నప్పటికీ గ్రావెల్ రోడ్డుపై తారు వేయకపోవడంతో రోడ్డు మధ్యలో పగుళ్లు ఏర్పడి గోతులు పడుతున్నాయి. ద్విచక్ర వాహన చోదకులు అదుపుతప్పి తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రహదారిపై ప్రయాణించడానికి నరకయాతన అనుభవిస్తున్నారు. పాతాళ భోగేశ్వరస్వామి ఆలయం నుంచి సంతోషపురం దుర్గమ్మ ఆలయం వరకు గ్రావెల్‌తో రహదారి నిర్మించారు. ఈ రోడ్డుపై ఇంతవరకు తారు వేయలేదు. ఈ రోడ్డు మధ్యలో పగుళ్లు ఏర్పడి కుంగుతోంది. పలుచోట్ల గ్రావెల్ అండలుగా విరిగి పడుతోంది. వాహనదారులు, ఆయా గ్రామాల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రావెల్‌పై తారు వేయాలని పాలకులు, అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి గ్రావెల్ రోడ్లపై తారు వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీ రాజ్ ఏఈఈ ఫణిని వివరణ కోరగా బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగిందని, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించామన్నారు. అక్టోబరులో శాంతినగరం–పెదలంక, భోగేశ్వరస్వామి–సంతోషపురం రహదారులపై తారు వేస్తామన్నారు.