రోడ్‌ టెర్రర్‌

ABN , First Publish Date - 2023-03-31T00:35:14+05:30 IST

వరుస రోడ్డు ప్రమాదాలు హడ లెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో నేషనల్‌ హైవేపై ప్రమాదాలు అధికమయ్యాయి.

రోడ్‌ టెర్రర్‌
జంగారెడ్డిగూడెం హైవేపై బైక్‌ను ఢీ కొట్టి బడ్డీ కొట్టులోకి దూసుకువెళ్లిన కారు (ఫైల్‌)

జంగారెడ్డిగూడెం నేషనల్‌ హైవేలో బెంబేలెత్తిస్తున్న వరుస ప్రమాదాలు

జంగారెడ్డిగూడెం, మార్చి 30 : వరుస రోడ్డు ప్రమాదాలు హడ లెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో నేషనల్‌ హైవేపై ప్రమాదాలు అధికమయ్యాయి. అటు ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు జీలుగుమిల్లి నుంచి జంగారెడ్డిగూడెం మీదుగా కొయ్యలగూడెం వరకు నేషనల్‌ హైవేపై నిత్యం ప్రమాదాలు జరు గుతూనే ఉన్నాయి. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం ప్రమాదాలకు కారణాలుగా కన్పిస్తున్నాయి. గతంలో జీలుగుమిల్లి నుంచి దేవరపల్లి వరకు అత్యంత దారుణంగా ఉన్న ఈ హైవేను నూతనంగా నిర్మించారు. దీంతో వాహనాల వేగానికి బ్రేక్‌లు లేకుండా పోయాయి. ఈ క్రమంలో హైవే ఎక్కాలంటేనే జనం భయపడు తున్నారు.

వరుస ప్రమాదాలు...!

ఈనెల 26వ తేదీన జంగారెడ్డిగూడెం నేషనల్‌ హైవే గోకుల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయ ఆర్చ్‌ దాటిన తర్వాత ద్వి చక్రవాహనంపై వెళ్తు న్న కేతిరెడ్డి అప్పలనాయుడును కారు ఢీ కొని పక్కనే ఉన్న బడ్డీ కొట్టులోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అప్పలనాయుడు మృతి చెందగా బడ్డీ దుకాణంలో ఉన్న నలుగురిలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈనెల 29వ తేదీన కొవ్వూరు రోడ్డు నేషనల్‌ హైవే బైనేరు బ్రిడ్జ్‌పై ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. తాజాగా గురువారం జంగారెడ్డిగూడెం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ హైవేపై ద్విచక్రవాహనాన్ని లారీ అతివేగంగా ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఇలా నిత్యం జీలుగుమిల్లి నుంచి కొయ్యలగూడెం హైవే వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత 40 రోజుల్లో రాష్ట్ర సరిహద్దు జీలుగుమిల్లి నుంచి తాడువాయి వరకు 15 ప్రమాదాలు జరిగిన ఇద్దరు మృతి చెందారు. కొయ్యలగూడెం స్టేషన్‌ పరిధిలో అచ్యుతాపురం వద్ద జరిగిన ప్రమాదంలో బైక్‌ను కారు ఢీ కొనడంతో ఒక వ్యక్తి నెల రోజుల క్రితం చనిపోయాడు. కొయ్యలగూడెం– బయ్యనగూడెం మధ్య నేషనల్‌ హైవేపై పది రోజుల క్రితం మోటార్‌ సైకిల్‌ను లారీ ఢీ కొనడంతో సచివాలయ ఉద్యోగి మృతి చెందాడు.

కొంతకాలం క్రితం జంగారెడ్డిగూడెం పోలీస్టేషన్‌ పరిధిలో హైవే పెట్రోలింగ్‌ వాహనాలు 24 గంటల పాటు హైవేలో తిరుగుతూ ఉండేవి. ఏ ప్రమాదం జరిగిన క్షణాల్లో అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించే వారు. ట్రాఫిక్‌ సమస్య లు తలెత్తకుండా ట్రాఫిక్‌ను నియంత్రించేవారు. అయితే మూడేళ్ల నుంచి హైవే పెట్రోలింగ్‌ వాహనాలు కన్పించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాన రహదారిగా 516 డీ– నేషనల్‌ హైవే నిత్యం రద్దీగా ఉంటుంది. భారీ లోడ్‌లతో వచ్చే లారీలు అతివేగంగా నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసు కుంటున్నాయి. జంగారెడ్డిగూడెంలో బైక్‌ ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. కొంతమంది యువత బైక్‌ రేస్‌ల మాదిరిగా నడుపుతూ బెంబేలెత్తిస్తున్నారు.

Updated Date - 2023-03-31T00:35:14+05:30 IST