రిజిస్ర్టేషన్‌.. వీర బాదుడు!

ABN , First Publish Date - 2023-06-03T00:31:30+05:30 IST

మీ ఊరు లేదా పట్టణం ప్రధాన మార్గం పక్కనే ఉందని ఇన్నాళ్లు మురిసిపోతూ వచ్చారు. ఏ క్షణాన ఊరికి చేరాలన్నా అలవోకేనంటూ సంబర పడ్డారు. జగన్‌ సర్కారుకు మాత్రం ఇదే వరమైంది. బాదుడుకు మార్గమైంది. రిజిస్ట్రేషన్‌ చార్జీల పేరిట భారీగా బాదేశారు.

 రిజిస్ర్టేషన్‌.. వీర బాదుడు!
ఏలూరు రిజిస్ర్టార్‌ కార్యాలయం

పట్టణాల ఒడ్డున ఉంటే 50 శాతం వడ్డింపు

రోడ్డుపక్కన ఉంటే 30 నుంచి 40 శాతం పెంపు

కమర్షియల్‌ ల్యాండ్స్‌ రేట్లకు అంతేలేదు

వ్యవసాయ భూములనూ వదల్లేదు

రిజిస్ట్రేషన్ల బాదుడుపై జనాగ్రహం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

మీ ఊరు లేదా పట్టణం ప్రధాన మార్గం పక్కనే ఉందని ఇన్నాళ్లు మురిసిపోతూ వచ్చారు. ఏ క్షణాన ఊరికి చేరాలన్నా అలవోకేనంటూ సంబర పడ్డారు. జగన్‌ సర్కారుకు మాత్రం ఇదే వరమైంది. బాదుడుకు మార్గమైంది. రిజిస్ట్రేషన్‌ చార్జీల పేరిట భారీగా బాదేశారు. ఎడాపెడా కమర్షియల్‌ ల్యాండ్స్‌పై పెనుభారం మోపేశారు. రిజిస్ట్రేషన్‌ భారం కాబోతుందని గత నెలాఖరునాడే ఉప్పందడంతో కొంతమంది ఈ భారం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. రిజిస్ట్రేషన్‌ శాఖ గడప తొక్కిన వేళ ఏకంగా రెండు రోజులపాటు సర్వర్లు మొరాయించా యి. దీని అర్థమేమిటంటే సర్కారు బాదుడు అందరిమీద పడాల్సిందేనంటూ చెప్పకనే చెప్పినట్టైంది. తాజాగా రిజిస్ట్రేషన్‌ పెనుభారం కాబోతుంది. పట్టణాలు, పల్లె తేడా లేకుండా వీర బాదుడు బాదేశారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 510 రెవెన్యూ గ్రామాలు ఉండగా ప్రధాన రోడ్డు ఇరువైపులా విస్తరించి ఉన్న ఏలూరుతో సహా 96 గ్రామాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ చార్జీల బాదుడే తప్పదు.

ఇష్టానుసారం రిజిస్ట్రేషన్‌ భారం

సర్కారు ఖజానా ఇప్పటికే వెలవెలబోతోంది. దీనిని కప్పి బుచ్చుకోవడానికి జగన్‌ సర్కార్‌ రకరకాల ప్రయోగాలు చేస్తోంది. బీద, బిక్కీ తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన ఒడ్డింపుకు తెర తీసింది. తద్వారా ఖజానా నింపుకోవడానికి ఎత్తుగడ వేసింది. ఈసారి స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ద్వారా ఖజానాకు ఆదాయం సమకూర్చుకోవాలనుకున్నారు. గడిచిన రెండేళ్లుగా రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరగలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకేసారి అన్నట్టుగా 30 నుంచి 50 శాతం రిజి స్ట్రేషన్‌ విలువ పెంచేశారు. ఆ మేరకు రిజిస్ట్రేషన్‌ ఆదాయాన్ని ఖరారు చేసినట్టయ్యింది. ఏలూరు జిల్లాలో 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా ఏప్రిల్‌, మే నెలల్లోనే దాదాపు 14 వేల 240కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే ఈ వేసవిలో గతంలో ఎన్నడూ లేనంతగా రిజిస్ట్రేషన్లు బదలాయింపు భారీ గా జరిగినట్టే. ఆ మేరకు రిజిస్ట్రేషన్‌ శాఖకు తన టార్గెట్‌లో 71.76 శాతానికి చేరుకున్నట్టయ్యింది. ప్రత్యేకించి భీమడోలు సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలో 62 గ్రామాలు ఉండగా వీటిలో 14 గ్రామాల్లో భూముల ధరలు పెంచి రిజిస్ట్రేషన్‌ ఆదాయాన్ని భారీగా సమకూర్చుకుంటున్నారు. చింతలపూడిలో 80 గ్రామా లకు 15 గ్రామాలు, జంగారెడ్డిగూడెంలో 36 గ్రామాలకు 7, కామవరపుకోటలో 32 గ్రామాలకు 10, పోలవరంలో 10 గ్రామాలకు 2, గణపవరంలో 42 గ్రామాలకు 6, వట్లూరులో 32కి 6, కైకలూరులో 42కి 5 గ్రామాలు, మండవల్లిలో 34కి 6, ముదినేపల్లిలో 29కి 6 గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ విలువ భారీగా పెరిగింది. ఇదంతా జనం నెత్తిన మోపేశారు. ఏలూరు కార్పొరేషన్‌తో సహా ఏలూరు రూరల్‌ మండలంలోని 48 గ్రామాలకు 14 గ్రామాల్లో జనాలకు చుక్కలు చూపించారు. నూజివీడు మునిసిపాలిటీతో సహా నూజివీడు రూరల్‌లో 63 గ్రామాలకు 5 గ్రామాల్లో భారీగా వడ్డించారు. జనం నెత్తిన భారం మోపడంలో జగన్‌ సర్కార్‌ ఇప్పటికే రికార్డు సృష్టిం చింది. ఒకవైపు కరెంటు చార్జీలు, ఇంకోవైపు ఆర్టీసీ చార్జీలు, ఆఖరుకి చెత్త పన్నులు వేసి జనాల ముక్కు పిండారు. ఇక మిగిలిన స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ ఆదాయ వనరుపై కన్నేసి రంగంలోకి దిగారు. గడిచిన రెండు మాసాలుగా సబ్‌ రిజిస్ట్రార్‌లు ఏఏ గ్రామాల నుంచి రిజిస్ట్రేషన్‌ భారీగా ఆదాయం పొందవచ్చని అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపా దించారు. అంతే.. ఏ మాత్రం మార్పులు, చేర్పులు చేయ కుండా సబ్‌ రిజిస్ట్రార్‌లు పంపిన ప్రతిపాదనలకు సర్కార్‌ యథాతథంగా ఆమోదముద్ర వేయడంతో రిజిస్ట్రేషన్‌ చార్జీలు తడిసి మోపెడయ్యాయి. ‘ఏ ప్రాంతంలో ఆదాయ వనరు ఉందో, మరే ప్రాంతంలో భూమి విలువ పెంచేందుకు అవకాశం ఉందో గమనించి నిర్ణయాలు తీసుకోండి. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచండి’ అంటూ సర్కార్‌ ఇచ్చిన ఆదేశాన్ని సబ్‌ రిజిస్ట్రార్‌లు తూచా పాటించారు.

రోడ్డుపక్కన ఉంటే చాలు..

రహదారి సౌకర్యం అత్యంత చేరువగా ఉంటే చాలు పట్ట ణాలు, గ్రామాల్లో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచే శాయి. ఉదాహరణకు హనుమాన్‌ జంక్షన్‌ నుంచి హైవే సాగే ప్రాంతాలకు చేరువగా ఉన్న గ్రామాలన్నింటిపైనా రిజిస్ట్రేషన్ల భారం మోపారు. ఏలూరు నగరానికి అత్యంత చేరువగా ఉన్న ప్రాంతాలన్నింటి పైనా భారీగా రిజిస్ట్రేషన్‌ చార్జీలు మో పారు. చొదిమెళ్ళ, తంగెళ్ళమూడి, మల్కాపురం, చాటపర్రు, కొమడవోలు, వెంకటాపురం, సత్రంపాడు, శ్రీపర్రు, కలకుర్రు, మాదేపల్లి వంటి ప్రాంతాలన్నింటిలోనూ ఇప్పటికే కమర్షియల్‌ ల్యాండ్‌కు సంబంధించి గజం రూ.మూడు వేలు ఉండగా దానిని రూ.ఐదు వేలకు పెంచేశారు. శ్రీపర్రు, కలకుర్రు వంటి గ్రామాలు కొల్లేరుకు చేరువగా ఉంటాయి. ఈ గ్రామాల మీదుగానే ఏలూరు నుంచి కైకలూరు వైపు వెళ్లే ప్రధాన మార్గం ఉంది. దీనిని సాకుగా తీసుకుని ఉతికి ఆరేశారు. నూజివీడు ప్రాంతంలోనూ రోడ్డు మార్గానికి చేరువగా ఉన్న హనుమాన్‌జంక్షన్‌ నుంచి నూజివీడు మీదుగా విజయవాడ వెళ్లే మార్గాల్లో ఉన్న బోరువంచ, మీర్జాపురం, గొల్లపల్లి, యనమదల గ్రామాలతో పాటు అన్నవరంలోను భూముల ధరలు భారీగా పెంచినట్టయ్యింది. ముసునూరు, చాట్రాయి మండలాల్లో భూమి ధరలు పెరగలేదు. ఒక్క చాట్రాయి మండలం చనుబండలోనే ధర పెరిగింది. ఆగిరిపల్లి మండ లంపై ఏ మాత్రం భారం పడలేదు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి సమీపాన ఉన్న కొయ్యలగూడెం, లక్కవరం, దేవులపల్లితోపాటు మరికొన్ని గ్రామాల్లోను రోడ్డుపక్కన ఉన్న భూమి ధరలు 30 నుంచి 35 శాతం పెంచారు. అదే కమర్షియల్‌ ల్యాండ్‌ ఇంతకుముందు రూ.10 లక్షలు ఉండగా, ఇప్పుడు పెరిగిన ధరలతో రూ.13 లక్షల నుంచి రూ.13.50 లక్షలు అవుతుంది. అగ్రికల్చర్‌ భూముల విషయంలో ఎకరా ఒక్కింటికి గతంలో రూ.10 లక్షలు ఉండగా, ఇప్పుడది కాస్తా రూ.12 లక్షలకు చేరింది. ఇక్కడ కూడా ఈ ధరల ఆధారం గానే రిజిస్ట్రేషన్‌ ఫీజు భారీగా పెరుగుతాయన్నమాట. వట్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలో కలపర్రు, కాళ్ళమూడి, పెద పాడు, గవరవరం, శనివారపుపేట వంటి ప్రాంతాల్లో రిజి స్ట్రేషన్‌ వాల్యూ 30 శాతం మేర పెంచేశారు. పెదవేగి మండ లం విజయరాయి, నడిపల్లి, బాపిరాజుగూడెం, వంగూరు, అలివేడు వంటి గ్రామాల్లో గజం ఒక్కింటికి ఇంతకుముందు రూ.వెయ్యి ఉండగా, ఇప్పుడు దానిని రూ.1500లకు పెంచా రు. భీమడోలు మండలంలో అత్యధిక గ్రామాలు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న 14 గ్రామాల్లోనూ వడ్డనే వడ్డన. చింతలపూడినీ వదలలేదు. ఈ సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలో అత్యఽ దికంగా 15 గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ వసూళ్లు భారీగా పెరిగాయి.

చూద్దాం.. చేద్దామనేలోపే..

ఇప్పటికే జగన్‌ సర్కార్‌ బాదుళ్లతో జనం కకావికలమై ఉన్నారు. కొందరేమో భూములు, ఫ్లాట్‌లు, ఇళ్ల స్థలాలు కొను గోలుకు వీలుగా అడ్వాన్సులు ఇచ్చి రిజిస్ట్రేషన్‌ వాయిదా వేసు కుంటూ వచ్చారు. పూర్తి స్థాయి సొమ్ము చెల్లించేందుకు స్తోమతలేక రిజిస్ట్రేషన్‌ వాయిదా వేసుకుంటూ రాగా ఇప్పుడు సర్కార్‌ చేష్టలతో వీరంతా గుక్కతిప్పుకోలేకపోతున్నారు. ప్రధాన పట్టణాలు ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు వంటి ప్రాంతాల్లోను రిజిస్ట్రేషన్లపై తాజా నిర్ణయం ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. పెంచుతామని సంకే తాలు బయటకు వెలువడిన ఇప్పట్లో కాదేమోనని కొందరు ఊహించి ఈ విధంగా బోర్లా పడ్డారు. ఒక్క ఏలూరులోనే పెరిగిన భూముల విలువ రిజిస్ట్రేషన్‌ రాబడి ఇబ్బడిముబ్బడి గానే ఉండబోతుంది.

Updated Date - 2023-06-03T00:31:30+05:30 IST