Share News

ఆదాయం ఢమాల్‌

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:18 AM

రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైంది.క్రయ విక్రయాలు నిర్వహించే బ్రోకర్లు కానరావడం లేదు. వెంచర్‌లు తగ్గుముఖం పట్టాయి. భూముల ధరలు తగ్గిపోయాయి.

ఆదాయం ఢమాల్‌

లక్ష్యం చేరుకోలేక రిజిస్ర్టేషన్‌ శాఖ సతమతం

పతనమైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

క్రయ విక్రయాలు మందగమనం

నవంబరు నాటికి జిల్లాలో 70 శాతమే ఆదాయం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైంది.క్రయ విక్రయాలు నిర్వహించే బ్రోకర్లు కానరావడం లేదు. వెంచర్‌లు తగ్గుముఖం పట్టాయి. భూముల ధరలు తగ్గిపోయాయి. అంతటికీ వైసీపీ ప్రభుత్వం కారణ మంటూ అన్ని వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రభుత్వ విధానాల వల్లే రియల్‌ ఎస్టేట్‌ రంగం పూర్తిగా దెబ్బతిందని ఆందోళన చెందుతున్నారు. ఆ ప్రభావం రిజిస్ర్టేషన్‌ శాఖపై పడింది. ప్రతిఏటా పెరగాల్సిన ఆదాయం స్తంభించిపోయింది. లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు. ప్రభుత్వం మారితే తప్ప పరిస్థితుల్లో మార్పు రాదంటూ రియల్టర్‌లు ఆందోళన చెందుతున్నారు. కొత్త వెంచర్‌లు వేసేందుకు వేచి చూస్తున్నారు. ఎన్నికల తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో కదలిక వస్తుందంటూ బిల్డర్‌లు భావిస్తున్నారు. నిర్మాణాల కోసం ఓపిక పడుతు న్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో నిర్మాణాలు చేపట్టినా లాభదాయకం కాదంటూ వెనుకంజ వేస్తున్నారు. జనం వద్ద సొమ్ములు కొరత వెంటాడుతోంది. ఇవన్నీ రిజిస్ర్టేషన్‌లపై ప్రభావం చూపుతున్నాయి. ఆదాయం మందగించింది. ప్రతిఏటా ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు.

భారీలోటు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ప్రారంభమైంది. జిల్లాలో ఏడాదికి రూ. 571 కోట్లు ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టారు. నవంబరు నాటికి సుమారు రూ.365 కోట్లు ఆదాయం రావాలి. ఇప్పటివరకు రూ. 266 కోట్లు మాత్రమే సమ కూరింది. అంటే 70 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నారు. మరో 30 శాతం వెనుకంజలో ఉన్నారు. భవిష్యత్తులోనూ ఇదే పంథా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల దగ్గర పడు తుండడంతో రియల్టర్‌లు వేచి చూస్తారు. ప్రభుత్వం మారితేనే రియల్‌ రంగం వృద్ధి చెందుతున్న భావన అందరిలోనూ ఉంది. ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం వల్ల ఆ ప్రభావం అన్ని రంగాలపై పడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్వా రంగం దెబ్బతింది. వరి సాగు ఒడిదుడుకులను ఎదు ర్కొంటోంది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రియల్‌ రంగంపై పెట్టుబడి పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఉద్యోగులు కూడా స్థలాల్లో, నివాసాలో కొనుగోలు చేసుకునేవారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వేతనం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. పీఎఫ్‌ సొమ్ములు కూడా ఇవ్వడం లేదు. ఇది కూడా రియల్‌ రంగంపై ప్రభావం చూపింది.

లంచావతారులు

అధికార పార్టీ నేతల ధనదాహం కూడా రియల్‌ రంగం పతనానికి కారణమైంది. వెంచర్‌లు వేయా లంటే నియోజకవర్గ ప్రజా ప్రతినిధుల జేబులు నింపాల్సి వస్తోంది. నాన్‌ లేఅవుట్‌ అయితే ఎకరానికి రూ.10లక్షలు, లేఅవుట్‌ అయితే రూ.5లక్షలు చెల్లించాలి. నిర్మాణాల విషయంలోనూ లక్షల రూపా యలు ముట్ట చెపాల్పి వస్తోంది. దాంతో నిర్మాణాలు నిలిపివేసుకుంటున్నారు. వెంచర్‌లు వేయడం లేదు. ప్రజాప్రతినిధుల అవినీతి దందా కూడా రియల్‌ ఎస్టేట్‌పై పడింది.ఫలితంగా రిజిస్ర్టేషన్‌లు తగ్గుముఖం పట్టాయి. ఆదాయం పడిపోయింది. లక్ష్యాన్ని చేరుకోవడం కష్టతరమవుతోంది.

Updated Date - Dec 17 , 2023 | 12:18 AM