రేషన్ బియ్యం.. విఫల ప్రయోగం
ABN , First Publish Date - 2023-03-20T00:12:30+05:30 IST
పేదలకు రేషన్ పంపిణీలో ప్రభుత్వం విఫల ప్రయోగాలు చేస్తోంది. ఆర్థిక భారాన్ని పెంచుకుంటూ పోతోంది. ఇంటింటా రేషన్ పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నెలకు రూ.25 కోట్లు వెచ్చిస్తున్నారు.

కొత్త విధానానికి తెరతీస్తున్న ప్రభుత్వం
మిల్లుల నుంచి నేరుగా డీలర్‌లకు పంపిణీ
రబీలో అమలు యత్నాలు.. వందశాతం బియ్యం పక్కదారికి అవకాశం
ఖరీఫ్ బియ్యంపైనే లబ్ధిదారుల ఆసక్తి
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పేదలకు రేషన్ పంపిణీలో ప్రభుత్వం విఫల ప్రయోగాలు చేస్తోంది. ఆర్థిక భారాన్ని పెంచుకుంటూ పోతోంది. ఇంటింటా రేషన్ పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నెలకు రూ.25 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇదికూడా పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదు. వాహనం కోసం లబ్ధిదారులు ఎదురు చూడాల్సి వస్తోంది. ఏ సమయానికి వస్తుందోనన్న ఆందోళన లబ్ధిదారుల్లో ఉంటోంది. పని మానుకుని రేషన్ కోసం పడిగాపులు పడుతున్నారు. గతంలో 15 రోజుల పాటు ఎప్పుడైనా రేషన్ డీలర్ వద్దకు వెళ్లి తీసుకునే వెసులుబాటు ఉండేది. లబ్ధిదా రులకు ఇబ్బందులు ఉండేవి కాదు. ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి ప్రభుత్వం తెర లేపింది. మిల్లర్‌ల నుంచి నేరుగా రేషన్ డీలర్‌లకు బియ్యాన్ని అందించాలని తహ తహలాడుతోంది. టెండర్‌లు పిలిచింది. ప్రస్తుత రబీ సీజన్‌లోనే ఈ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
టెండర్ దాఖలు చేసిన మిల్లర్ లేదా ఏజన్సీ సంచులను సమ కూర్చుకోవాలి. రేషన్‌కు సరిపడా బియ్యానికే ఈ విధానం వర్తింప జేయాలని ప్రభుత్వం భావి స్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి పెద్దగా ప్రయోజనం లేక పోగా ఇతర సమస్యలు ఉత్పన్నం కానున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు వ్యాపారులు రీసైక్లింగ్‌లో ఆరితేరిపోయారు. కొద్దిపాటి మిల్లర్లు కూడా ఇదే ధోరణి అనుసరిస్తు న్నారు. అసోసియేషన్‌లు వీరిపై నిఘా పెట్టినా ఫలితం లేకపోతోంది. కొందరు డీలర్‌లు ఇదే తరహాలో రేషన్ బియ్యాన్ని తిరిగి సేకరించి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం గోదా ముల నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్‌లకు బియ్యం సరఫరా అవుతున్నాయి. అక్కడ నుంచి డీలర్ల వద్దకు వెళుతున్నాయి. ఈ క్రమంలో బియ్యం పక్కదారి పడితే తనిఖీలు చేసి చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. అదే మిల్లుల నుంచి నేరుగా డీలర్‌ల వద్దకు వెళితే వ్యాపారులు బుక్ ట్రాన్స్‌ఫర్ అంటే బియ్యం రవాణా కాకుండా అయినట్టు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లబ్ధిదారుల్లోనూ విముఖత
రబీలో ఉత్పత్తి అయ్యే బియ్యంపై లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపరు. తినేందుకు విముఖత చూపుతుంటారు. రబీ బియ్యం సరఫరా అయినప్పుడే నూరుశాతం రేషన్ బియ్యం మళ్లీ మార్కెట్‌కు తరలిపోతుంది. అదే ఖరీఫ్‌లో ఉత్పత్తి అయ్యే స్వర్ణ, పీఎల్ వంటి రకాలు సరఫరా చేస్తే కొంత మేర లబ్ధిదారులు వినియోగించుకుంటారు. డీలర్‌ల నుంచి సరఫరా చేసినప్పుడు లబ్ధిదారులు దాదాపు 80 శాతం బియ్యాన్ని తీసుకుపోయేవారు. అదే రబీ బియ్యం అయితే కనీసం 20 శాతం బియ్యం డీలర్‌ల నుంచి తీసుకువెళ్లడం కష్టంగా ఉండేది. మిగిలిన 80 శాతం బియ్యం పక్కదారి పట్టేవి. ఇప్పుడు కూడా రబీ బియ్యాన్ని సరఫరా చేస్తే అదే పరిస్థితి ఉత్పన్నం కానుంది. రబీలో ఉత్పత్తి అయ్యే బియ్యం అంతగా రుచికరంగా ఉండవన్న ఉద్దేశంతో లబ్ధిదారులున్నారు.
గతంలో ఖరీఫ్ బియ్యం సరఫరా
తెలుగుదేశం ప్రభుత ్వం హయాంలో అప్పటి జిల్లా కలెక్టర్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఖరీఫ్ బియ్యాన్ని రేషన్‌లో సరఫరా చేసేవారు. జిల్లాకు అవసరమైన స్వర్ణ రకాల బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేసేవారు. ఏడాదిపాటు ప్రతినెలా వాటినే అందించేవారు. ఇప్పుడు రబీ బియ్యాన్ని ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది. రబీలో ఉత్పత్తి అయ్యే బియ్యం డీలర్‌ల వద్దకు పంపితే అవి లబ్ధిదారులు వినియోగించుకునే అవకాశం లేదు. జిల్లాలో ఉత్పత్తి అయ్యే ఖరీఫ్ బియ్యాన్ని గతంలో సరఫరా చేసినప్పుడు లబ్ధిదారులు అత్యధికంగా వినియోగించుకునేవారు. జిల్లా అవసరాలు తీరిన తర్వాత ఇతర జిల్లాలకు తరలించేవారు. రబీ బియ్యాన్ని పూర్తిగా భారత ఆహార సంస్థకు అప్పగించేవారు. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరించే విధానం ప్రకారం అయితే ఆరునెలల పాటు రబీ బియ్యాన్ని రేషన్‌లో సరఫరా చేయా ల్సి ఉంటుంది.
జిల్లా అవసరాలు 12 శాతమే
జిల్లాలో ఉత్పత్తి అయ్యే బియ్యంలో 12 శాతం జిల్లా అవసరాలకు సరి పోనున్నాయి. ప్రస్తుతం ప్రతినెలా 8,250 టన్నుల బియ్యాన్ని రేషన్ లబ్ధిదా రులకు పంపిణీ చేస్తున్నారు. అంటే ఏడాదికి దాదాపు లక్ష టన్నుల బియ్యం అవసరం కానున్నాయి. కానీ ఖరీఫ్, రబీ సీజన్‌లలో జిల్లాలో దాదాపు 8 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో కేవలం లక్ష టన్నులు జిల్లాలో పంపిణీ చేయనున్నారు. మిగిలిన ఏడు లక్షల టన్నులు ఎప్పటిలాగే గోదా ముల్లో నిల్వ చేయాలి. అందులో కొంతమేర భారత ఆహార సంస్థకు అప్ప గించాలి. మిగిలిన బియ్యాన్ని ఇతర జిల్లాల అవసరాలకు తరలించాలి. రాష్ట్ర ప్రజలు వినియోగించే ఖరీఫ్ బియ్యం పంపిణీకి ప్రాముఖ్యత ఇవ్వాలి. రబీ బియ్యం మాత్రమే భారత ఆహార సంస్థకు అప్పగించాలి. అటువంటిది రబీ బియ్యాన్ని లబ్ధిదారులకు రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతిమంగా ఇది వికటించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.