వర్షం.. నష్టం
ABN , First Publish Date - 2023-03-19T00:40:52+05:30 IST
జిల్లాలో శనివారం మధ్యాహ్నం కురుస్తున్న వర్షాలకు వివిధ పంటలకు నష్టం కలుగుతోంది. పలు ప్రాంతాల్లో కురిసిన వడగళ్ళ వానలతోపాటు ఈదురు గాలులకు మొక్కజొన్న చేలు నేలకొరిగాయి.

మామిడి, మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం
రహదారులకు అడ్డంగా పడిన భారీ వృక్షాలు
నేలకొరిగిన చేలు.. ఉద్యాన పంటలకు నష్టమే
నేడు పిడుగులతో కూడిన వర్షాలు
ఏలూరు సిటీ/జంగారెడ్డిగూడెం/టి.నరసాపురం/ కుక్కునూరు/కలిదిండి, మార్చి 18 : జిల్లాలో శనివారం మధ్యాహ్నం కురుస్తున్న వర్షాలకు వివిధ పంటలకు నష్టం కలుగుతోంది. పలు ప్రాంతాల్లో కురిసిన వడగళ్ళ వానలతోపాటు ఈదురు గాలులకు మొక్కజొన్న చేలు నేలకొరిగాయి. మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. కోసిన ఎండు మిర్చి పంట పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. పొగాకు, మిర్చి, మినుము, వరి పంటలు దెబ్బ తిననున్నాయి. కుక్కునూరు. వేలేరు పాడు, ముసునూరు మండలాల్లో మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. అల్పపీడన ప్రభావంతో శనివారం కుక్కునూరులో భారీ వర్షం కురిసిం ది. తడిచిన మిర్చిని రైతులు కల్లాల్లో ఆరబెట్టారు. ఈ క్రమంలో వర్షం కురవడంతో మళ్లీ తడిచింది. కల్లాల్లోని నీటిని బయటకు పంపుతూ రైతులు మిర్చిని ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొక్క జొన్న చేలు పడిపోవటంతో భారీగానే నష్టం ఉండవచ్చునని రైతులు చెబుతున్నారు. జీలుగుమిల్లి మండలం రౌతుగూడెంలో రహదారికి అడ్డంగా భారీ వృక్షం నేలకూలింది. రహదారులు పూర్తిగా జలమయం అయ్యాయి.
చెట్టు పడి మహిళ మృతి
తాడువాయి ముత్యాలమ్మ ఆలయ సమీపంలోని భారీ రావిచెట్టు నేలకొరిగి రహదారికి అవతల వైపు ఉన్న ఒక ఇంటి షెడ్డుపై పడింది. షెడ్డులో కూర్చుని ఉన్న సంధ్య(37) అనే మహిళ అక్కడి కక్కడే మృతి చెందింది. ఆమెకు భర్త శ్రీను, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కురిసిన వర్షం
జిల్లాలో శనివారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై వర్షాలు కురిశాయి. భీమడోలు, పోలవరం, చింతలపూడి, టి.నర్సా పురం, కలిదిండి, లింగపాలెం, కుక్కు నూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, ఉంగుటూరు, ఏలూరు, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, నిడమర్రు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా, చింతలపూడి, టి.నర్సాపురం, ముసునూరు మండలాల్లో వడగళ్లు పడ్డాయి. మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి స్వల్పంగా కురిశాయి. ఆదివారం కూడా పిడుగులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగే ప్రమాదం ఉందని, పిడుగులు పడే అవకాశం ఉండటంతో వర్షం వచ్చిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. శనివారం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మధ్యాహ్నం జిల్లాలో 26 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు ఉష్ణోగ్రతలు పడిపోగా 29/21 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది.
వడగళ్ల వాన బీభత్సం
టి.నరసాపురం మండలం బొర్రంపాలెం, ఏపిగుంట, టి.నరసాపురం తదితర ప్రాంతాల్లో వడగండ్ల వానతోపా టు ఈదురు గాలులు వీచడంతో మామిడి, మొక్కజొన్న, పొగాకు, నిమ్మ, మిర్చి వంటి కొన్ని పంటలు దెబ్బ తిన్నాయి. 400 ఎకరాల్లో మొక్కజొన్న నేలకు ఒరిగింది. తిరుమలదేవిపేటలో మూడు పెంకుటిళ్ళపై చెట్లు కూలడంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి.
రొయ్యల మృత్యువాత
అకాల వర్షాలతో చెరువుల్లో నీరు చల్లబడి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఫలితంగా వనామి రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో రైతులు ముమ్మరంగా రొయ్యలను పట్టుకుంటున్నారు. సానా రుద్రవరం, వెంకటాపురం, గోపాలపురం గ్రామాల్లో రొయ్యలకు ఆక్సిజన్ కొరతతోపాటు వైరస్ సోకడంతో చనిపోయాయి. 100 కౌంటు నుంచి 300 కౌంటు సైజు రొయ్యలనే పట్టుబడి చేయటంతో గిట్టుబాటు ధర రావటం లేదని రైతులు వాపోతున్నారు. వేసవిలో వనామి సాగుకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో మం డలంలో 15 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. ఎకరానికి లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు వర్షాలకు చెరువుల్లో ఏరియేటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేదని వాపోతున్నారు. రొయ్యలు చనిపోతుండటంతో వ్యాపారులు సిండికేటుగా మారి తక్కువ ధరకు కొంటున్నారని వాపోతున్నారు. కనీసం ఖర్చులు రాకపోవడంతో అప్పుల పాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రొయ్యలు రంగు మారడంతో వ్యాపారులు వీటిని కొనడం లేదు. ఎరుపు రంగు రొయ్యలను గోతుల్లో వేసి పూడుస్తున్నారు.
రైతులూ..ఈ పని చేయండి
ప్రస్తుతం వరి అంకురం ఏర్పడే దశ నుంచి పాలు పోసుకునే దశలో ఉన్నందుకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ శాఖాధికారి వై.రామకృష్ణ తెలిపారు. జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్న వరి ఎంటీయూ 1121 రకం కోతలకు సమయం ఉందని, కావున రైతులు ఎటువంటి నిరుత్సాహ పడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. అధికంగా వర్షాలు కురిస్తే డ్రైనేజ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని పొలంలో అధిక నీటిని డ్రైనేజ్ కాలువల ద్వారా బయటకి తీసుకుంటే వరికి ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. జిల్లాలో మొక్కజొన్న 71,300 ఎకరాల్లో సాగులో ఉందని, ప్రస్తుతం మొక్కజొన్న పంట గింట గట్టిపడే దశ నుంచి కోత దశలో ఉన్నందున కోతను వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించారు. రెండు రోజులుగా పడుతున్న వర్షాలకు ఇప్పటి వరకు ఉంగుటూరు, లింగపాలెం మండలాల్లో 250 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగిందన్నారు. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు నాలుగు రోజులు వర్షాభావ పరిస్థితులు ఉంటాయన్నారు.