వంతుల వారీ బీటలు

ABN , First Publish Date - 2023-02-21T23:31:02+05:30 IST

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాల్వల ఆధునికీకరణ పనులు జరగలేదు. ఫలితంగా ఇవి మెరక తేలి, శివారు పొలాలకు సాగు నీరందక బీటలు వారుతున్నాయి.

వంతుల వారీ బీటలు
చినిమిల్లిపాడులో బీటలు వారిన వరి పొలాలు

దాళ్వాకు సక్రమంగా అందని సాగునీరు

శివారు భూముల్లో ఎండుతున్న నాట్లు

నెర్రలు తీస్తున్న పొలాలు.. రైతుల కన్నీళ్లు

ఇంజన్లతో తోడకం.. అదనపు భారం

ఆక్వాకు యఽథేచ్ఛగా నీటి చౌర్యం

పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులు

నీటి కోసం అన్నదాతల వేడుకోలు

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాల్వల ఆధునికీకరణ పనులు జరగలేదు. ఫలితంగా ఇవి మెరక తేలి, శివారు పొలాలకు సాగు నీరందక బీటలు వారుతున్నాయి. వంతుల వారీ విధానంలో పూర్తిస్థాయిలో నీరు సరఫరా కావడం లేదు. నిఘా ఉంచాల్సిన అధికారులు, కమిటీ, సిబ్బంది పర్యవేక్షణ లోపించి ఆక్వా చెరువులకు యథేచ్ఛగా నీటి చౌర్యం జరుగుతోంది. ఈ ఏడాది దాళ్వా గట్టెక్కేనా..? అన్న భయం రైతులను వెంటాడుతోంది. ఇప్పటికే వ్యవసాయంలో పడుతున్న ఇబ్బందులు, పెట్టుబడులు, నష్టాలు భరించలేక చాలామంది వరి సాగు నుంచి ఆక్వా వైపు మరలారు. భవిష్యత్‌లో పరిస్థితి ఇలానే ఉంటే పూర్తిస్థాయిలో రైతులు వరి సాగు మానేసే ప్రమాదం ఉంది.

ఆకివీడు రూరల్‌/ఆకివీడు: వంతుల వారీ విధానంతో ఆకివీడు మండల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెదకాపవరంలోని వినాయకుడి గుడి సమీపంలోను, చినిమిల్లిపాడులోని మొండికోడు పరిధిలోను వరి పొలాలకు నీరందడం లేదు. సచివాలయాల చుట్టూ తిరిగినా నీరు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో నీరందిస్తేనే పొట్ట దశ వస్తుంది. అధికారులు పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి ఇప్పటికే రూ.20 వేలపైనే పెట్టుబడి పెట్టారు. ఇంజన్లతో తోడుకోవడం వల్ల ఎకరానికి అదనపు ఖర్చు రూ.2 వేలవుతోందని వాపోతున్నారు. మరోవైపు రొయ్యల చెరువుల ఉప్పు నీటిని పంట కాల్వలు, బోదెల్లోకి వదులుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని, ఉప్పు నీటి వల్ల పొలాలు చౌడుబారి దిగుబడులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అడుగంటిన బ్యాంక్‌ కెనాల్‌..

ఆచంట : ఆచంట మండలంలో శివారు ప్రాంత పొలాలకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కోడేరు, సిద్ధాంతం బ్యాంక్‌ కెనాల్‌లో నీటి మట్టం పూర్తిగా అడుగంటింది. పలుచోట్ల బోర్లు, ఇంజన్ల సహాయంతో నీటిని పంట పొలాలకు తోడుతున్నారు. ప్రస్తుతం పంట పొలాలు కుదురు దశకు ఉన్నాయని సక్రమంగా నీరందించాలని రైతులు కోరుతున్నారు.

అద్దె ఆయిల్‌ ఇంజన్ల సాయంతో..

గణపవరం : ఉండి పంట కాల్వ నుంచి ఎ.గోపవరం ఛానల్‌ ద్వారా సాగు నీరు కొత్తపల్లి, సరిపల్లి తదితర ఎనిమిది కిలోమీటర్ల పొడవున శివారు గ్రామాల ఆయక ట్టుకు ఆధారం. ఈ కాల్వకు వంతుల వారీలో సాగు నీరందక రైతులు అల్లాడిపోతున్నారు. పంట చేలు బీటలు వారడంతో రైతులు అద్దెకు ఆయిల్‌ ఇంజన్లను సమకూర్చుకునా చుక్క నీరందక సతమతమవుతున్నారు. కాస్తో కూస్తో నీరుంటే ఆక్వా రైతులు నీటి సౌర్యానికి పాల్పడుతున్నారని వరి రైతులు ఆరోపిస్తున్నారు. ఎస్‌.కొందేపాడు, కేశవరం తదితర ఆయక ట్టులకు అత్తిలి పంట కాల్వ నుంచి నీరు అందకపోవడంతో రైతులంతా ఎస్‌.కొందేపాడు సర్పంచ్‌ సీతాళం వీరలక్ష్మికి మొర పెట్టుకోగా యనమదుర్రు డ్రెయిన్‌ నుంచి మురుగు నీటిని ఆయిల్‌ ఇంజన్ల ద్వారా తోడి చేలకు నీటిని అందిస్తున్నారు.

ఇంజన్‌ వేస్తేనే.. పంట పొలంలో నీరు..

పాలకోడేరు : దాళ్వాలో నారు వేసిన మొదలు నేటి వరకు ఇంజన్లతో నీరు తోడుకుని సాగు చేసుకుంటున్నామని కోరుకొల్లు, మోగల్లు, మైప గ్రామాల రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం దాళ్వా సాగుకు నీరందించలేమని ముందే చెప్పి ఉంటే సాగుకు హాలిడే ప్రకటించి ఏదో కూలి పనులు చేసుకునేవారమని ఆ ప్రాంత రైతులు వాపోతున్నారు. పొట్ట దశలోని పంట పొలాలకు సాగునీరు అందించలేకపోతున్నారు. పంట కాల్వలో అడుగంటిన నీటినే ఇంజన్లు సాయంతో తోడి పంటను బతికించేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. ఇప్పటికే ఎకరానికి వచ్చి రూ.20 వేలకు పైగా పెట్టుబడి పెట్టామని, సకాలంలో సాగు నీరందకపోతే అప్పులే మిగులుతాయని రైతులు వాపోతున్నారు.

నీరందక చేలు నెర్రలు..

కాళ్ళ : కాళ్ళ మండలంలో సుమారు 4,335 ఎకరాల్లో దాళ్వా సాగు చేస్తున్నారు. ఏలూరుపాడు, కాళ్ళ, దొడ్డనపూడి, సీసలి, కాళ్ళకూరుల్లో తీవ్ర సాగునీటి కొరత నెలకొంది. నీరందక చేలు నెర్రలు తీస్తున్నాయని రైతులు వాపోతున్నారు. బొండాడ, జక్కరం, కోపల్లె గ్రామాల్లో వరి పొలాలు ఇప్పటికే పొట్ట దశకు చేరుకున్నాయి. ఉన్నత అధికారులు స్పందించి దాళ్వా పంటకు పూర్తిస్థాయిలో నీరందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

సీలేరు వాటర్‌ తీసుకొస్తున్నాం : కలెక్టర్‌ ప్రశాంతి

ఆకివీడు రూరల్‌/కాళ్ల/ఉండి, ఫిబ్రవరి 21 : సాగునీటి ఎద్దడి లేకుండా సీలేరు వాటర్‌ తీసుకొస్తున్నామని కలెక్టర్‌ ప్రశాంతి తెలిపారు. ఆకివీడు రూరల్‌ గుమ్ములూరు గ్రామంలో ఈ–క్రాప్‌ నమోదు సూపర్‌ పర్యవేక్షణ చేసి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వ్యవసాయం, ఆక్వా ఎంత విస్తీర్ణంలో ఉందో అధికారులను అడిగారు. ఈకెవైసీ ఈనెల 25లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కాల్వల ద్వారా నీటి పరిమాణాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని, ప్రభుత్వం సీలేరు వాటర్‌ తీసుకువస్తుందని రెండురోజులలో సమస్య తగ్గిపోతుందని తెలిపారు. కాళ్ళ మండలం దొడ్డనపూడిలో కలెక్టర్‌ ప్రశాంతి మంగళవారం వరి పొలాలను పరిశీలించారు. మండలంలో మొత్తం ఎన్ని ఎకరాలలో వరిసాగు చేస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాళ్వా పంటకు సంబంధించి ఈ–క్రాప్‌ సూపర్వైజరీ చెక్‌లో భాగంగా వరిసాగులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ రైతు రాంబాబుని ప్రశ్నించారు. ప్రస్తుతం దాళ్వాకు సాగునీటి ఇబ్బంది తీవ్రంగా ఉందని రైతు ఆమెకు మొరపెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇస్తున్న వంతులవారీ విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆమె సూచించారు. అనంతరం ఉండి మండలం కలిసిపూడిలో ఆమె సందర్శించారు. వ్యవసాయం కౌలుకు చేస్తున్నారా.. ? లేదా సొంతంగా చేసుకుంటున్నారంటూ రైతులను ఆరా తీశారు. అనంతరం ఆర్‌బీకే సిబ్బందితో సమావేశం నిర్వహించి వారాబంధీ ఏవిధంగా అమలు చేస్తన్నారంటూ తదితర వివరాలను ఆరా తీశారు. జేడీ జెడ్‌ వెంకటేశ్వరరావు, ఏడీఏ శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు

దాళ్వా సాగుకు స్వల్పకాలిక టెండర్లు

కాంట్రాక్టర్లు స్పందిస్తేనే అడ్డుకట్టలు, ఇంజన్ల ఏర్పాటు..

(భీమవరం–ఆంధ్రజ్యోతి) : పశ్చిమడెల్టాలో దాళ్వా సాగు గట్టెక్కించేందుకు డ్రెయిన్లలో అడ్డుకట్టలు వేయడానికి జలవనరులశాఖ చర్యలు తీసుకుంది. పంట కాల్వల్లో ఇంజన్‌లు ఏర్పాటు చేసి సాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళిక రచించింది. రెండు నెలల తర్వాత ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 కోట్లతో స్వల్పకాలిక టెండర్లు పిలిచారు. వారం రోజుల వ్యవధిలోనే టెండర్లు ఖరారు చేసేలా అధికారులు కసరత్తు పూర్తిచేశారు. ఇప్పుడు కంట్రాక్టర్లు ఏ మేరకు స్పందిస్తారనే అనుమానం అధికారులను పట్టి పీడిస్తోంది. పశ్చిమ డెల్టా పరిధిలో 138 చోట్ల అడ్డుకట్టలు వేయాలని ప్రతిపాదించారు. మెరక ప్రాంతాల్లో ఇంజన్లద్వారా సాగునీరు అందించనున్నారు. అందుకోసం టెండర్‌లు సిద్ధం చేశారు. కాంట్రాక్టర్లు స్పందిస్తేనే అధికారులు అనుకున్నవిధంగా సాగునీరు సరఫరాకు అవకాశం ఉంటుంది. గతంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఆ ప్రభావం ప్రస్తుత టెండర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో నీటి ఎద్దడి ఎదురవుతోంది, శివారు ప్రాంతాలకు సాగు నీరు అందక రైతులు లబోదిబోమంటున్నారు. మెరక ప్రాంతాల్లోనూ నీటి సమస్య తలెత్తింది. ఇవన్నీ గట్టెక్కాలంటే కాంట్రాక్టర్లు స్పందించాలి. అడ్డుకట్టలు వేయాలి, ఇంజన్లు ఏర్పాటు చేయాలి.

Updated Date - 2023-02-21T23:31:03+05:30 IST