ప్రైవేటు ఫీ‘జులుం’ తగ్గేనా ?
ABN , First Publish Date - 2023-05-26T00:06:41+05:30 IST
ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణపై అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం సబ్ కలెక్టర్ ఫీజుల నియంత్రణపై సమావేశమవడంతో పాటు ఒక పాఠశాలలో తనిఖీ చేశారు.

ఫీజుల నియంత్రణపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి
పాఠశాలల్లో సౌకర్యాలను బట్టే ఫీజులుండాలి
బుక్స్..యూనిఫాం అమ్మకూడదు
రెండేళ్ల క్రితమే ఫీజులపై ప్రభుత్వం జీవో
గాల్లో కలసిపోయిన నిబంధనలు
జిల్లాలో 473 ప్రైవేటు పాఠశాలలు..11 లక్షల మంది విద్యార్థులు
ప్రైవేటు స్కూల్స్ అధిక ఫీజులకు అడ్డు కట్టవేస్తాం.. అని రెండేళ్ల క్రితం జీవో తెచ్చిన ప్రభుత్వం చతికలపడింది. ఫీజుల నియంత్రణ నిబంధన ప్రచారానికే తప్ప ఆచరణకు నోచుకోలేదు. వచ్చే విద్యా సంవత్సరానికి ఫీజుల నియంత్రణపై రెవెన్యూ శాఖ దృష్టి పెట్టడంపై తల్లిదండ్రుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే అమలు ఎలా ఉంటుందనేదానిపై లెక్కకు మిక్కిలి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భీమవరం ఎడ్యుకేషన్, మే 25 : ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణపై అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం సబ్ కలెక్టర్ ఫీజుల నియంత్రణపై సమావేశమవడంతో పాటు ఒక పాఠశాలలో తనిఖీ చేశారు. నిబంధనలు ప్రకారం ఫీజులు ఉండేలా చేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి చెబుతున్నారు. ప్రైవేటు పాఠశాలలో సౌకర్యాలను బట్టే ఫీజులు ఉండాలనే నిబంధన ఉంది. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల జీతాలు కలిపి 90 శాతంగా లెక్క వేసి మిగిలిన 10 శాతం పాఠశాల లాభంగా నిర్ణయించి దానిని బట్టే ఫీజులు నిర్ణయించాలి. ఆ లెక్కన చిన్న పాఠశాలకు ఎంత ఫీజు ఉండాలి ? కార్పొరేట్ సంస్థలకు ఎంత ఉండాలనేది తెలుస్తుంది.
యూనిఫాం, బుక్స్ అమ్మకూడదు
ప్రైవేటు స్కూల్స్‌లో నిబంధనలు ప్రకారం యూనిఫాం బుక్స్ అమ్మరాదు. కాని అన్ని స్కూల్స్‌లో వాళ్ళ దగ్గరే యూనిఫాం, బుక్స్ తీసుకోవాలనే నిబంధన అమలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో రూ.3 వేలు విలువ చేసే మెటీరియల్ రూ.6 వేల వరకు అమ్ముతున్నారు .తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థుల తల్లితండ్రులు కొనుగోలు చేస్తున్నారు. ఈసారి అధికారులు వీటిపైన దృష్టి పెట్టారు. నిబంధనల ప్రకారం బుక్స్ పాఠశాలలో అమ్మకాలు చేయాలన్నా నిబంధనలు పాటించాలి. అలా ఏ పాఠశాలలోనూ అమలు కావడం లేదు.
1వ తరగతికే రూ.30 వేలు
ప్రైవేటు పాఠశాలలో కనిష్ట ఫీజు పలు పాఠశాలల్లో 1వ తరగతికి రూ.30 వేలు ఉంటోంది. స్కూల్ ఫీజు రూ.24 వేలు, బుక్స్ రూ.5 వేలు ఇలా 30 వేలు వరకు చేరుతోంది. యూనిఫాంకి రూ.1000 చెల్లించాలి. జిల్లాలో 473 ప్రైవేటు పాఠశాలలు ఉండగా 1.10 లక్షల వరకు విద్యార్థులు ఏడాదికి విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ ఫీజుల మోత తప్పడం లేదు. రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలు ఉత్తీర్ణత బాగా పడిపోవడం పదవ తరగతిలో జీరో ఉత్తీర్ణతలో పాఠశాలలు పెరగడంతో తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలపై ఆసక్తి చూపుతున్నారు.
ఫీజుల నియంత్రణ గాలికి వదిలేశారు
రెండేళ్ల క్రితం ఫీజుల నియంత్రణపై జీవో తీసుకువచ్చింది. ప్రైవేటు స్కూల్స్‌లో గ్రామాలలో, పట్టణం, సిటీలలో ఇలా మూడు విధాలుగా ఫీజులు నిర్ణయించింది. రూ.10,500 నుంచి 14, 500 వరకు ఫీజులు నిర్ణయించారు. దానిపై ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్‌లు ఏకీభవించకపోవడం, కోర్టు దాకా వెళ్లడం జరిగింది. చివరకి తల్లితండ్రులకు మేలు జరగలేదు. ఆ నిబంధనలు గాల్లో కలసిపోయాయి. ప్రభుత్వం మరలా ఫీజుల నియంత్రణపై దృష్టి పెట్టిందే లేదు.
భారమైనా ప్రైవేటు వైపు చూపు
రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ ఉత్తీర్ణత బాగా పడిపోయింది. 2021–22 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు 13,616 మంది పరీక్ష రాయగా 5,325 మంది ఉత్తీర్ణత సాధించారు. 2022–23 సంవత్సరంలో 12,442 మంది పరీక్ష రాయగా 6,683 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. గతేడాది ఉత్తీర్ణత తగ్గడంతో ప్రభుత్వ పాఠశాలల నుంచి 19,832 మంది విద్యార్థులు ప్రైవేటు స్కూల్స్‌కి వెళ్లిపోయారు. ఈ ఏడాది అదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా ప్రైవేటు పాఠశాలలో అడ్మిషన్‌లు జోరుగా సాగు తున్నాయి. ఫీజులు భారం అయినా ప్రభుత్వ పాఠశాలల తీరు బాగోలేకపోవడంతో ప్రైవేటు వైపు చూస్తున్నారు.