సర్టిఫికెట్ లేక పింఛన్‌కు దూరం..!
ABN , First Publish Date - 2023-09-26T00:40:27+05:30 IST
అంగ వైకల్యంతో నడవ లేని స్థితిలో ఉన్న ఓ యువతి సామాజిక భద్రత పింఛన్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో జీవనం కోసం యాచనకు దిగింది.

రెండు కాళ్లు చచ్చుబడిన ఓ అభాగ్యురాలి దీనగాథ
ముదినేపల్లి, సెప్టెంబరు 25 : అంగ వైకల్యంతో నడవ లేని స్థితిలో ఉన్న ఓ యువతి సామాజిక భద్రత పింఛన్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో జీవనం కోసం యాచనకు దిగింది. కడుపు నింపుకునేందుకు చచ్చు బడిన కాళ్లతోనే బజారులో దేకుతున్న దృశ్యం చూపరు లను కలచివేస్తోంది. ముదినేపల్లిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన గోన మాధవి(37)కి పదేళ్ల క్రితం వివాహం కాగా, రెండో కాన్పు సమయంలో బాలింత వ్యాధికి గురై రెండు కాళ్లు చచ్చుబడి పోయాయి. ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. అనారోగ్యానికి గురైన మాధవిని తనకు సంబంధం లేదంటూ భర్త పుట్టింటి వద్దే విడిచిపెట్టేశాడు. దీంతో ఆమె తల్లి సరోజిని కూలి పనులకు వెళ్తూ కుమా ర్తెతో పాటు ఆమె ఇద్దరు పిల్లల సంరక్షణ చేపట్టింది. మాధవి వికలాంగ పింఛన్‌కు దరఖాస్తు చేసేందుకు సదరం సర్టిఫికెట్ కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి వెళ్లడం సాధ్యం కాక ఆ ప్రయత్నం మానుకుంది. అలా ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. ఇటీవల ఆమె దీనస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాలపై ఎంపీడీవో మల్లేశ్వరి కొంత చొరవ తీసుకుని వికలాంగ సర్టిఫికెట్ కోసం సచివా లయ సిబ్బందితో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి పంపినా ఫలితం దక్కలేదు. మాధవి బాలింత వ్యాధికి గురైనట్టు గతంలోని మెడికల్ సర్టిఫికెట్లు ఉంటేనే తాము వికలాంగ ధ్రువీకరణ పత్రం ఇస్తామని ప్రభుత్వ వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో పెన్షన్‌కు దరఖాస్తు చేసే అవకాశం లేకుండా పోతోంది. మరోవైపు వృద్ధాప్యంలోని ఆమె తల్లికి కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. ఈ పరిస్థి తుల్లో తనతో పాటు తన పిల్లలు, తల్లి కోసం మాధవి ముదినేపల్లిలో రోడ్లపై చచ్చుబడిన కాళ్లతో దేకుతూ యాచి స్తోంది. ఆమెను చూసిన అందరు అయ్యో పాపం.. అంటున్నా అధికారులు మాత్రం అంగవైకల్యం సర్టిఫికెట్ తెచ్చుకోకపోతే తాము ఏమీ చేయలేమంటున్నారు.