మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Dec 31 , 2023 | 11:34 PM
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు తమ ధాన్యాన్ని అమ్మేందుకు సిద్ధం చేసినా కొనుగోళ్లు మందకొడిగానే సాగుతున్నా యి. ప్రకృతి వైపరీత్యాలతో ఎన్నో కష్టాల నెదుర్కొని పొలాల నుంచి వ్యయ ప్రయాసలకొర్చి ఒడ్డుకు చేర్చిన ధాన్యం అమ్ముడుపోవడం లేదు.
రోడ్ల వెంబడే ధాన్యం నిల్వలు.. ఒడ్డుకు చేర్చినా ఫలితం లేదు
నిబంధనలు మార్చాలని రైతుల డిమాండ్
ముదినేపల్లి, డిసెంబరు 31 : ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు తమ ధాన్యాన్ని అమ్మేందుకు సిద్ధం చేసినా కొనుగోళ్లు మందకొడిగానే సాగుతున్నా యి. ప్రకృతి వైపరీత్యాలతో ఎన్నో కష్టాల నెదుర్కొని పొలాల నుంచి వ్యయ ప్రయాసలకొర్చి ఒడ్డుకు చేర్చిన ధాన్యం అమ్ముడుపోవడం లేదు. తేమలో ఒక్క శాతం కూడా తేడా లేకుండా నిబంధనల మేరకు ధాన్యాన్ని రోజుల తరబడి రోడ్ల వెంబడి ఆరబెట్టిన ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం పెద్దగా శ్రద్ద చూపించడం లేదని రైతులు ఆక్రోశం వ్యక్తం చే స్తున్నారు. ముదినేపల్లి మండలంలో చాలా గ్రామాల్లో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోలేని దయ నీయ పరిస్థితి. పండించిన పంటను సొమ్ము చేసుకోలేకపోతున్నామన్న బాధను వ్యక్తం చేస్తున్నారు. తూకం వేసి సిద్ధంగా ఉంచిన ధాన్యాన్ని కూడా మిల్లుకు చేర్చే అవకాశాలు కరువయ్యాయి. మిల్లుల వద్ద ధాన్యాన్ని ఆన్‌లోడ్ చేసేందుకు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి రావడంతో ట్రాక్టర్ల యజ మానులు కిరాయితోపాటు వెయిటింగ్ ఛార్జి డిమాండ్ చేస్తున్నారు. ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం వల్ల ధాన్యం నిల్వలు మండలంలో పేరుకుపోతున్నాయి. ముదినేపల్లి – గుడివాడ, కైకలూరు జాతీయ రహదారితో పాటు పలు చోట్ల రోడ్ల వెంబడి పూర్తిగా ఆరబెట్టిన ధాన్యం నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆఫ్‌లైన్ విధానం రద్దు చేసి ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోళ్లు జరుగుతుండడంతో రైతులు తమకు ఇష్టం వచ్చిన మిల్లుకు ధాన్యాన్ని అమ్మే అవకాశం లేకుండాపోయింది.
60 శాతం కొనుగోళ్లు
ముదినేపల్లి మండలంలో సుమారు 16,500 ఎకరాల విస్తీర్ణంలో సార్వా వరి సాగు చేయగా, సుమారు 49 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందన్నది వ్యవసాయ శాఖ అంచనా. అయితే తుఫాన్ వల్ల సుమారు 8 వేల ఎకరాల్లో పూర్తిగా, పాక్షికంగా పంట నష్టం జరగడంతో సుమారు 16 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి తగ్గింది. దీంతో 33 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అందుబాటులో ఉండవచ్చని డీసీఎంఎస్ అధికారులు అంచనా వేశారు. ఇందులో ఇప్పటి వరకు మండలంలో సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రైతుల వద్ద మూడున్నర వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. సుమారు 12,500 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడికి సంబంధించి వరి కోతలు, వరి కుప్పల నూర్పిళ్లు పూర్తి చేయాల్సి ఉంది. మరో 15 రోజుల వరకు సార్వా కోతలు, నూర్పిళ్లు జరిగే అవకాశం ఉన్నందున నిబంధనలు సడలించకపోతే ధాన్యం అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్ని ఇబ్బందులే : పెందుర్తి వెంకట్రావు, రైతు, ముదినేపల్లి
కష్టపడి పండించిన పంటను అమ్ముకునే స్వేచ్ఛ లేదు. ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయి. వరి కోతలు చేసి ధాన్యాన్ని ఒడ్డుకు చేర్చేందుకు ఎకరానికి రూ.12 వేలు ఖర్చు అవుతోంది. మిల్లుకు తీసుకెళ్లిన ధర ఎంత నిర్ణయిస్తారో తెలియదు.
నిబంధనల ప్రకారం కొనుగోళ్లు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ప్రస్తుతం రైతుల వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఆర్‌బీకేల సిబ్బంది ద్వారా చర్యలు తీసుకుంటాం.
– విజయ్, డీసీఎంఎస్ మండల ధాన్యం సేకరణ ఇన్‌చార్జ్