రైస్‌ మిల్లుల వద్ద పడిగాపులు

ABN , First Publish Date - 2023-05-25T23:51:34+05:30 IST

ట్రాక్టర్లు, లారీల ద్వారా తీసుకెళుతున్న ధాన్యం బస్తాలను రైస్‌మిల్లుల వద్ద దిగుమతి చేసుకోవడానికి రెండు మూడు రోజులు పడుతున్నది.

 రైస్‌ మిల్లుల వద్ద పడిగాపులు
పోడూరులో రైస్‌మిల్లు వద్ద బారులు తీరిన ధాన్యం లోడ్లు

పోడూరు, మే 25: ట్రాక్టర్లు, లారీల ద్వారా తీసుకెళుతున్న ధాన్యం బస్తాలను రైస్‌మిల్లుల వద్ద దిగుమతి చేసుకోవడానికి రెండు మూడు రోజులు పడుతున్నది. దీంతో డ్రైవర్లు రాత్రింబవళ్లు క్యూలైన్లో పడిగాపులు పడాల్సి వస్తున్నదని ట్రాక్టర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ రైస్‌మిల్లు వద్ద ఇదే పరిస్థితి నెలకొందంటున్నారు. ఒక పూటలో దిగుమతి చేయాల్సిన ధాన్యాల లోడు రెండు రోజులు పైగా పడటంలో కిరాయిలు పోతున్నాయని, ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు చేపట్టి రైస్‌మిల్లుల వద్ద ధాన్యం లోడ్లు త్వరితగతిన దిగుమతులు అయ్యేలా చూడాలని కోరుతున్నారు.

రాత్రి సమమాల్లో ప్రమాదాలు

రైస్‌మిల్లులు ప్రధాన రహదారులకు ఆనుకుని ఉండటం వల్ల ఽధాన్యం లోడులతో ట్రాక్టర్లు, లారీలు రోడ్డుపై బారులు తీరుతున్నాయి. దీంతో రాత్రి సమయాల్లో నల్ల బరకాలు కప్పి ఉన్న ట్రాక్టర్లు, వాహనదారులకు ఎదురుగా వస్తున్న వాహనాలు లైటింగ్‌లో కనపబడక ప్రమాదాలు చోటుచేసుకుంటు న్నాయి. ఇటీవల జిన్నూరు, తూర్పుపాలెం గ్రామాల్లో నల్లబరకాలు కప్పిఉన్న ధాన్యం ట్రాక్టర్లును ఢీకొని ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఎమ్మెల్యే దృష్టికి ధాన్యం రైతుల కష్టాలు

పాలకోడేరు, మే 25 : ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చెప్పేది ఒకలా క్షేత్రస్థాయిలో మరోలా ఉందని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. వేండ్రలో ధాన్యం కొనుగోలుపై తలెత్తిన ఇబ్బందులను తెలుసుకునేందుకు గురువారం ఆయన గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ధాన్యం కొనుగోలులో జరుగుతున్న దోపిడిని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గ్రామానికి చెందిన వీరవల్లి త్రిమూర్తులు మాట్లాడుతూ గ్రామంలోని ధర్మగారి చెరువు కారణంగా తన పంటలో ధాన్యం దెబ్బతింటుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పలుమార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. వెంటనే పంట చేలను పరిశీలించి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ షేక్‌ హుస్సేన్‌కు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు కారణంగా మిల్లర్లు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం 40 కేజీల బస్తాకు అదనంగా 2 కేజీలు చేర్చి 42 కేజీల బస్తా ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. అయినప్పటికీ మిల్లర్లు మాత్రం మరో ఐదు కేజీల వరకు అదనంగా తీసుకుంటున్నారని లేకపోతే నగదు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మిల్లులు ఈ తరహా దోపిడికి పాల్పడుతున్నాయని ఫోన్లో ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు.

Updated Date - 2023-05-25T23:51:34+05:30 IST