సీఎం సభకు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తరలింపు
ABN , First Publish Date - 2023-03-20T00:29:50+05:30 IST
జగనన్న విద్యాదీవెన విడుదల కార్యక్రమానికి నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థులను తరలించటంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి.

నూజివీడు టౌన్, మార్చి 19: జగనన్న విద్యాదీవెన విడుదల కార్యక్రమానికి నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థులను తరలించటంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. విద్యాదీవెన విడుదల కార్యక్రమాన్ని రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయగా, ఇంకా ఓట్లు కూడా రాని విద్యార్థులను విద్యాదీవెన కార్యక్రమానికి బస్సుల్లో తరలించటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 61 బస్సుల్లో సుమారు 3వేల మంది విద్యార్థులను తిరువూరుకు ట్రిపుల్‌ఐటీ అధికారులు తరలించారు. విద్యార్థులను తరలించటంపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులను కలుసుకునేందుకు తల్లిదండ్రులకు ఆదివారం ఒక్కరోజే అవకాశం ఉంటుంది. ఇవేమీ పట్టించుకోకుండా అధికారులు విద్యార్థులను జగన్ సభకు వెళ్ళాలని హుకుం జారీచేసి బస్సుల ద్వారా తరలించటంపై విద్యార్థుల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.