అమ్మఒడి అలజడి

ABN , First Publish Date - 2023-07-27T23:47:17+05:30 IST

ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న అమ్మఒడి పథకం గాడి తప్పుతోంది. సక్రమంగా నిధులు జమకావడం లేదు.

అమ్మఒడి అలజడి

సొమ్ముల్లో కోత..ఆందోళనలో తల్లులు

ఇప్పటకీ ప్రతిరోజూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు

ప్రైవేటు విద్యా సంస్థలకు మొండిచేయి

వసూలు చేసుకోవాలంటూ దిశానిర్దేశం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న అమ్మఒడి పథకం గాడి తప్పుతోంది. సక్రమంగా నిధులు జమకావడం లేదు.ఇప్పటికీ జిల్లాలో వందలాది మంది లబ్ధిదారులు అమ్మఒడి కోసం ఎదురు చూస్తు న్నారు. ఈ–కెవైసీ కాలేదనో, ఆధార్‌ అనుసంధానం అవలేదనో కారణాలు చూపుతున్నారు. నిజానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అన్నీ సక్రమంగానే నమోదు చేశారు. ప్రభుత్వమే నిధులు విడుదలలో జాప్యం చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా అమ్మ ఒడి సొమ్ముల విడుదలలోనూ భారీ కోత పడుతోంది. కొందరికి కేవలం రూ.10 వేల లోపు మాత్రమే సొమ్ములు జమవుతున్నాయి. ఇలా ఎందుకు జరిగిందో అధికారులకు కూడా అర్థం కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా జూన్‌ 28వ తేదీన అమ్మఒడి పథకం సొమ్ములు జమయ్యాయని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. పశ్చిమలో 1,43,534 మంది విద్యార్థులకు అమ్మఒడి జమ చేస్తున్నట్టు వెల్లడించింది. అందుకోసం రూ.215.30 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాలో నేరుగా వేయనున్నట్టు చెప్పుకొచ్చారు. రోజులు గడచిపోతున్నాయి. విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. సచివాలయాల చుట్టూ తిరగుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల వలంటీర్లను నిలదీస్తున్నారు. ఒక్కో వలంటీర్‌ క్లస్టర్‌ పరిధిలో ఉండే లబ్ధిదారుల్లో కొద్దిమందికే పడ్డాయి. ఒక క్లస్టర్‌లో 10 మందికి పడాల్సి ఉంటే నలుగురుకు మాత్రమే ఇప్పటివరకు జమ చేశారు. తొలిరోజుల్లో అయితే పూర్తిస్థాయిలో సొమ్ములు జమయ్యాయని అధికారులు హడావుడి చేశారు.ఆధార్‌వంటి సాంకేతిక ఇబ్బందులున్న వెయ్యి లోపు మందికి మాత్రమే జమ కాలేదని చెప్పుకొచ్చారు. తీరా ప్రభుత్వం ఇప్పటికీ 30 శాతం మందికి సొమ్ములు జమ చేయలేదని అంచనా వేస్తున్నారు. అంటే జిల్లాలో దాదాపు 62 వేల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొందరు లబ్ధిదారులు భారీ స్థాయిలో కోత విధిస్తున్నారు. కేవలం రూ.9వేలు మాత్రమే జమ చేశారు. ఇదే విషయాన్ని సచివాలయాలకు వెళ్లి ప్రశ్నస్తే సిబ్బంది నోరెళ్ల బెడుతున్నారు. మరోసారి పడే అవకాశం ఉందని సర్ది చెపుతు న్నారు. అమ్మఒడి విషయంలో ప్రభుత్వ చర్యలు గందరగోళానికి దారితీస్తున్నాయి.

ప్రైవేటుపై భారం

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందించాలన్న ఉద్దేశంతో ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రభుత్వం ఉచిత సీట్లు కేటాయి స్తోంది. జిల్లాలో దాదాపు 850 మంది విద్యార్థులకు ఈ ఏడాది అడ్మిషన్‌లు కల్పించారు. గత ఏడాది నుంచే ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉచిత విద్య అంటూ పేద విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత విద్య అందిస్తోంది. వారికి కూడా అమ్మఒడి సొమ్ములు జమచేస్తోంది. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉచితంగా చదువుతున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం ఈ ఏడాది రూ. 13వేలు జమ చేసింది. అవే సొమ్ములను విద్యార్థుల నుంచి వసూలు చేసుకొని ఫీజుల రూపంలో జమ చేసుకోవాలని ప్రభుత్వం చెప్పు కొస్తోంది. ఇటీవల ప్రైవేటు యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఇదే విషయాన్ని అధికారులు స్పష్టం చేశారు. అయితే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవడం తమ వల్ల అయ్యే పనికాదంటూ ప్రైవేటు సంస్థలు చేతు లెత్తేస్తున్నాయి. గతంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీట్లు కేటాయించేవారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరిన ప్రతి విద్యార్థికి రూ.18500 వంతున ఫీజు చెల్లించేవారు. విద్యా సంస్థలకు కాస్త ఊరట లభించేది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి వేటు వారిపైనే పడింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు సంస్థల్లో చేరిన విద్యార్థులకు ఫీజులు చెల్లించలేమంటూ స్పష్టం చేసింది. దాంతో విద్యార్థులంతా భంగపడ్డారు. తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిపోయారు. గత ఏడాది నుంచి మళ్లీ ఉచిత సీట్ల విధానాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఫీజులు మాత్రం చెల్లించడం లేదు. తల్లుల ఖాతాలో జమచేసిన అమ్మ ఒడి సొమ్ములు తీసుకోవాలని చెపుతోంది.అలా చేస్తే తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తుందని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.

Updated Date - 2023-07-27T23:47:17+05:30 IST